icon icon icon
icon icon icon

Revanth Reddy: అధికారంలోకి వస్తున్నాం

తెలంగాణ ఎన్నికల్లో సునామీలా ఫలితాలు ఉంటాయని, కాంగ్రెస్‌ గెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఓట్లు వేసి అయిదేళ్లపాటు సేవ చేయడానికి ప్రజలు అవకాశమిచ్చారన్నారు.

Updated : 01 Dec 2023 10:50 IST

ఎన్నికల్లో సునామీలా ఫలితాలు 
భారాసకు 25లోపే సీట్లు వస్తాయి 
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ఈనాడు-కామారెడ్డి, హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో సునామీలా ఫలితాలు ఉంటాయని, కాంగ్రెస్‌ గెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఓట్లు వేసి అయిదేళ్లపాటు సేవ చేయడానికి ప్రజలు అవకాశమిచ్చారన్నారు. గురువారం పోలింగ్‌ ముగిసిన అనంతరం కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘భారాసకు 25కు మించి ఒక్కసీటు కూడా ఎక్కువ రాదు. ఎన్నికల్లో తెలంగాణ మొత్తంలో ఒకే రకమైన సునామీ వచ్చింది. ఏ ఎగ్జిట్‌ పోల్‌ కూడా కాంగ్రెస్‌కు అధికారం రాదని చెప్పడం లేదు. మెజారిటీలోనే కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయని చెబుతున్నాయి. ఫలితాలు అనుకూలంగా లేవనే పోలింగ్‌ ముగిసిన తరవాత కేసీఆర్‌ మీడియా ముందుకు రాలేదు. గతంలో పోలింగ్‌ ముగియగానే ఆయన మీడియాతో మాట్లాడేవారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చేసినవారు క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ బెదిరిస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైతే ఆయన క్షమాపణ చెబుతారా? కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావుల ముఖాల్లో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపించాయి. తరతరాలుగా అధికారంలో కొనసాగుతాననుకొని కేసీఆర్‌ కామారెడ్డిలో బరిలో దిగారు. తెలంగాణ సమాజం చైతన్యవంతంగా వ్యవహరిస్తుందని ప్రజలు నిరూపించారు. తెలంగాణ కోసం ఉద్యమించినవారు, 30 లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్‌ను గెలిపించబోతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్‌ చెలగాటమాడారు. వారంతా గుణపాఠం చెప్పబోతున్నారు. కేసీఆర్‌కి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారు. కాంగ్రెస్‌ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకోవాలి.

గురువారం సాయంత్రం 5 గంటల వరకూ మేం ప్రతిపక్షం. తర్వాత పాలకపక్షం. సాంకేతికంగా డిసెంబరు 9 వరకూ ఆగాలి. కాంగ్రెస్‌ శ్రేణులపై పాలకపక్షం బాధ్యత వచ్చేసింది. నా నుంచి ఇక పదునైన పదజాలంతో కూడిన మాటలు ఆశించవద్దు. మేం బాధ్యతగా పరిపాలన అందిస్తాం. మొదటి మంత్రివర్గ సమావేశంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడం, ప్రజాపాలన అందించే దిశగా పనిచేస్తాం. ఓడినవారిని కేసీఆర్‌ బానిసల్లా చూశారు. ఓడినవారు బానిసలు కారు. గెలిచినవారు రాజులు కారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ప్రజారంజక పాలన అందించాలనుకున్నప్పుడు ప్రతిపక్షం, పాలకపక్షం బాధ్యతగా వ్యవహరించాలి. కాంగ్రెస్‌ పాలనలో సంఘాలకు, ప్రతిపక్షాలకు మాట్లాడటానికి అవకాశం కల్పిస్తాం. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ పునరుద్ధరిస్తుందని మరో గ్యారంటీ హామీతో మాట ఇస్తున్నా. సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తాం. అన్ని సంఘాలు, సామాజికవర్గాలకు మా పాలనలో అవకాశం కల్పిస్తాం. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. ప్రజా హక్కుల కోసం పోరాడేవారు ప్రభుత్వానికి స్వేచ్ఛగా అన్ని విషయాలు చెప్పే అవకాశం కల్పిస్తాం. ఎవరిపైనా ఆధిపత్యాన్ని చలాయించడానికి కాంగ్రెస్‌ అధికారాన్ని వినియోగించదు. మేం పాలకులం కాదు.. సేవకులం. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూసుకోవాలని పార్టీలోని పెద్దలు, నేతలకు నా సూచన. కోదండరాం నేతృత్వంలో అమరవీరుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌  పనిచేస్తోంది. అధికారం వచ్చిందని విర్రవీగం. అది చాలా బాధ్యతలను తెచ్చిపెట్టినట్లుగా భావించాలని పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇకనుంచి పాలకపక్షం కానున్నందువల్ల చాలా జాగ్రత్తగా.. బంగారం తూకం వేసినట్లుగా మాట్లాడాలి. నేను ఎంపీ, ఎమ్మెల్యే పదవుల్లో ఏది వదిలేయాలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

నీటి పంపకాలపై కేసీఆర్‌ కొత్త నాటకం

కొడంగల్‌, కోస్గి-న్యూస్‌టుడే: ఎన్నికల్లో గెలిచేందుకు మరోసారి తెలంగాణ సెంటిమెంటు రగిలించేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగంగానే గోదావరి, కృష్ణా, నాగార్జునసాగర్‌ నీటి పంపకాలపై కొత్త నాటకానికి తెరలేపారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తొమ్మిదిన్నరేళ్ల పంచాయితీని ప్రజల ముందుకు తీసుకొచ్చి లబ్ధి పొందేందుకు చూస్తున్నారన్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో గురువారం ఉదయం ఆయన తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. ఆయా చోట్ల విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలకు సంబంధించిన నీటి పంపకాల అంశం చాలా సున్నితమైందని.. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌, భారత్‌ మధ్యే నీటి సమస్యను పరిష్కరించుకున్నామని.. పొరుగు రాష్ట్రాలతో చర్చిస్తే పంపకాల అంశం పరిష్కారమవుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి ఎవరవుతారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఎన్నికల్లో గెలుపొందిన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రులేనని పేర్కొన్నారు. పార్టీ ఓ కమిటీ ఏర్పాటు చేస్తుందని.. దాని నిర్ణయం మేరకే సీఎం ఎవరనే అంశం తేలుతుందని చెప్పారు. కొడంగల్‌ ప్రాంత ప్రజల ప్రతిష్ఠ పెంచడానికి కృషి చేస్తానన్నారు.


స్ట్రాంగ్‌ రూంలకు ఈవీఎంలు చేరేవరకు అప్రమత్తం

ఈవీఎంలకు సీల్‌ వేసి.. పోలింగ్‌ కేంద్రాల నుంచి స్ట్రాంగ్‌ రూములకు చేర్చేవరకూ అప్రమత్తంగా ఉండాలని పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌ శాతం ఎంత నమోదైందన్న వివరాలను ఎన్నికల సంఘం గురువారం రాత్రే వెల్లడించాలని ఆయన ఎక్స్‌లో కోరారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img