icon icon icon
icon icon icon

ధీమా పైపైన.. గుబులు లోలోన

ఓట్ల లెక్కింపు గడువు దగ్గర పడటంతో బరిలో నిల్చిన ప్రధాన పార్టీల నేతలు తమకు పడ్డ ఓట్ల మీద ఇప్పుడు కూడికలు తీసివేతలతో బిజీగా ఉన్నారు. కార్యకర్తలను ఇళ్లకు పిలిచి ఏ కాలనీలో ఏ విధంగా పోలింగ్‌ జరిగింది.. అందులో తమకు ఎన్ని ఓట్లు పడతాయి..

Updated : 02 Dec 2023 09:26 IST

కూడికలు, తీసివేతల్లో అభ్యర్థులు
డబ్బు ప్రభావంపై విశ్లేషణ

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: ఓట్ల లెక్కింపు గడువు దగ్గర పడటంతో బరిలో నిల్చిన ప్రధాన పార్టీల నేతలు తమకు పడ్డ ఓట్ల మీద ఇప్పుడు కూడికలు తీసివేతలతో బిజీగా ఉన్నారు. కార్యకర్తలను ఇళ్లకు పిలిచి ఏ కాలనీలో ఏ విధంగా పోలింగ్‌ జరిగింది.. అందులో తమకు ఎన్ని ఓట్లు పడతాయి.. ప్రత్యర్థులకు ఎన్ని ఓట్లు పడతాయన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. తక్కువ మెజార్టీతోనైనా తాము గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్‌ శాతం తగ్గడంతో దీన్ని వల్ల ఎవరికి లాభం అన్న దానిపై కూడా విశ్లేషణ చేసుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు రోజు తేడా జరగకుండా కీలక నేతలను ఏజెంట్లగా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కౌంటింగ్‌పై దృష్టి

ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులు దృష్టిసారించారు. ఈసారి ఎవరికీ భారీ మెజార్టీలు వచ్చే అవకాశం లేదని పోటీలో ఉన్న అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కీలకంగా మారే అవకాశం ఉండటంతో కేంద్రాలకు ఏజెంట్లుగా తమకు నమ్మకమైన నేతలను పంపించాలని నిర్ణయించారు. ఏజెంట్లకు ప్రాథమిక శిక్షణ కూడా ఇస్తున్నారు. ప్రతి ఏజెంటు చివరి వరకు అప్రమత్తంగా ఉండేలా ప్రత్యేకంగా చెప్పి పంపించాలని అనుకుంటున్నారు.

నగదు పాచిక పారేనా?

ఈసారి భారీ ఓటింగ్‌ జరుగుతుందని అంతా అంచనా వేశారు. దీనికి భిన్నంగా హైదరాబాద్‌ జిల్లాలో ఓటింగ్‌ పెరగకపోగా తగ్గిపోయింది. 2018 శాసనసభ ఎన్నికల్లో ఈ జిల్లాలో 50.86 శాతం ఓటింగ్‌ జరిగితే ఈసారి 46 శాతానికే పరిమితమైంది. రంగారెడ్డిలో గతసారి 59.98 శాతం నమోదు కాగా ఈసారి 59.94 శాతం ఓటింగ్‌ జరిగింది. మేడ్చల్‌లో గతంలో 50.37 శాతం మంది ఓటేయగా ఈసారి 56 శాతం నమోదైంది. ఈసారి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 70 శాతం వరకు పోలింగ్‌ నమోదవుతుందని అంతా అంచనా వేశారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో దాదాపు 70 శాతం ఓటింగ్‌ నమోదు కాగా రాజధాని జిల్లాల్లో ఓటింగ్‌ తక్కువ నమోదైంది. ఇప్పుడిదే కొంతమంది అభ్యర్థుల వెన్నులో చలిపుట్టిస్తోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నగదు భారీగా పంపిణీ చేశారు. దీని ప్రభావం ఎంతవరకు ఉందన్న దానిపై కూడా అంచనా వేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img