icon icon icon
icon icon icon

CM KCR: గాబరా పడొద్దు.. గెలిచేది మనమే

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చూసి గాబరా పడొద్దని, మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌.. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది.

Updated : 02 Dec 2023 07:34 IST

భారాస అభ్యర్థులకు సీఎం కేసీఆర్‌ భరోసా
పోలింగ్‌ తీరుపై అధినేత విశ్లేషణ

ఈనాడు, హైదరాబాద్‌: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చూసి గాబరా పడొద్దని, మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌.. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎంతో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నేతలు భేటీ అయ్యారు. వారు ముఖ్యమంత్రికి క్షేత్రస్థాయిలో అనుకూల, ప్రతికూల పరిస్థితులను వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కేసీఆర్‌.. మరోసారి ప్రభుత్వ ఏర్పాటు పట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫలితాలువెల్లడయ్యే వరకూ ప్రశాంతంగా ఉండాలని, 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందామని, ఈ రాష్ట్రానికి మళ్లీ సుపరిపాలన అందించబోతున్నది మనమేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది.

జిల్లాల్లో వివిధ వర్గాల నాయకులకు ఫోన్లు చేసి పోలింగ్‌ సరళిని ఆరా తీసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ను లోతుగా విశ్లేషించినట్లు సమాచారం. భారాసకు ఎన్ని ఓట్లు పడే అవకాశాలున్నాయి? లబ్ధిదారుల ఆలోచనలు ఏ తీరుగా ఉన్నాయి.. తదితర అంశాలను చర్చించినట్లు తెలిసింది. చివరి గంటలో జరిగిన పోలింగ్‌తో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు భిన్నంగా ఫలితాలు ఉండే అవకాశాలున్నాయని విశ్లేషించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం ప్రగతి భవన్‌ నుంచి బయటకు వస్తూ పలువురు నాయకులు ఆనందంగా విక్టరీ సంకేతాన్ని చూపించారు.

నాగార్జునసాగర్‌ నీటి విడుదలపై ఆరా

నాగార్జునసాగర్‌ జలాశయం కుడికాలువ నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని విడుదల చేసిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ఉన్నతాధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. సాగర్‌ డ్యామ్‌పై బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఘటనలను ఆయనకు ఉన్నతాధికారులు వివరించినట్లు సమాచారం. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది.

వాస్తవ ఫలితాలు మావైపే: కేటీఆర్‌

చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర పోయినట్లు మంత్రి కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ‘‘ఎగ్జిట్‌ పోల్స్‌ ఉన్న దాన్ని ఎక్కువ చేసి చూపించాయి. కానీ వాస్తవ ఫలితాలు(ఎగ్జాక్ట్‌ పోల్స్‌) మావైపే ఉన్నాయి. మాకు శుభ వార్తను వినిపించనున్నాయి’’ అని తెలిపారు.


4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల ఫలితాలు 3వ తేదీన వెల్లడి కానుండగా.. ఆ మర్నాడు క్యాబినెట్‌ భేటీకి నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img