icon icon icon
icon icon icon

Venkata Ramana Reddy: జెయింట్‌ కిల్లర్‌.. రమణారెడ్డి

ఇద్దరు కొదమ సింహాల్లాంటి నేతలు. ఆ ఇద్దరూ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు అధినేతలు. ఒకరు ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉండగా, మరొకరు తమ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారన్న అంచనాల్లో ఉన్నవారు.

Updated : 04 Dec 2023 07:00 IST

ఈనాడు, కామారెడ్డి: ఇద్దరు కొదమ సింహాల్లాంటి నేతలు. ఆ ఇద్దరూ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు అధినేతలు. ఒకరు ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉండగా, మరొకరు తమ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారన్న అంచనాల్లో ఉన్నవారు. అలాంటి దిగ్గజాలు ఇద్దరినీ ఒకేసారి ఓడించి... విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు. భారాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డిలను కామారెడ్డి నియోజకవర్గంలో ఓడించిన ఆ నాయకుడే.. భాజపా అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి! దేశప్రజలందరి దృష్టినీ ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జెయింట్‌ కిల్లర్‌గా నిలిచారు. తన సమీప భారాస అభ్యర్థి కేసీఆర్‌పై 6,741 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రేవంత్‌రెడ్డి మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

  • స్థానికంగా భారాస నాయకులు, కార్యకర్తల మధ్య కుమ్ములాటలు కేసీఆర్‌ ఓటమికి కారణంగా భావిస్తున్నారు. బహునాయకత్వం కారణంగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ సక్రమంగా సాగలేదనే ప్రచారం సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నియోజకవర్గంలోని సారవంతమైన భూములను స్వాధీనం చేసుకునేందుకే పోటీచేస్తున్నారనే ప్రత్యర్థుల ప్రచారాన్ని భారాస నాయకులు సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు.
  • నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీకి పెద్దదిక్కుగా ఉండే మాజీమంత్రి షబ్బీర్‌అలీ నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీచేయడంతో ఆయన పూర్తిగా అక్కడే దృష్టిసారించారు. దీనికితోడు కాంగ్రెస్‌ పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వం 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారాస గూటికి చేరింది. దీంతో కొన్ని గ్రామాల్లో ఆ పార్టీకి ప్రచారానికి నాయకులు కూడా లేరు. రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి నియోజకవర్గంలో మకాం వేసి ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
  • కాటిపల్లి వెంకటరమణారెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీచేసి ఓడిపోయారు. అయినా తర్వాత పంచాయతీ, పురపాలకసంఘ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రమించారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాడి.. దాన్ని రద్దు చేయించారు. ధరణి పోర్టల్‌లో సమస్యలు పరిష్కరించాలని, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీ నిధులు మంజూరుచేయాలని ఉద్యమాలు చేపట్టారు. గత ఏడాది కాలంగా నియోజకవర్గమంతా కులసంఘాల భవనాలను, దేవాలయాలను సొంత నిధులతో నిర్మిస్తున్నారు. అన్నివర్గాల ప్రజల ఆమోదం పొంది.. ప్రస్తుత ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.

కేసీఆర్‌ పూర్వీకుల గ్రామంలో భారాసకే ఆధిక్యం

బీబీపేట, న్యూస్‌టుడే: కామారెడ్డిలో పోటీచేసిన కేసీఆర్‌ పూర్వీకుల గ్రామం (అమ్మ ఊరు) అయిన బీబీపేట మండలం కోనాపూర్‌లో భారాసకే ఆధిక్యం లభించింది. గ్రామంలో 819 ఓట్లు ఉండగా 742 ఓట్లు పోలయ్యాయి. వీటిలో భారాసకు 397 ఓట్లు, కాంగ్రెస్‌కు 152, భాజపాకు 101, ఇతరులకు 88, నోటాకు 4 ఓట్లు పోలయ్యాయి. భారాసకు 245 ఓట్ల ఆధిక్యం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img