icon icon icon
icon icon icon

BJP - Telangana Election Result: భాజపాకు మోదం.. ఖేదం!

హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు భాజపాకు కొంత ఉత్సాహాన్నిచ్చినా.. మరోవైపు నిరాశను మిగిల్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించింది.

Updated : 04 Dec 2023 08:12 IST

తొలిసారి 8 స్థానాల్లో గెలుపు
కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌లపై విజయం
ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో 4 స్థానాలు కైవసం
కీలక నేతల ఓటమితో డీలా
7 జిల్లాల్లో దక్కని ప్రాతినిధ్యం
ఈటల, సంజయ్‌, అర్వింద్‌, రఘునందన్‌, బాపురావుల ఓటమి

ఈనాడు, హైదరాబాద్‌: హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు భాజపాకు కొంత ఉత్సాహాన్నిచ్చినా.. మరోవైపు నిరాశను మిగిల్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఆశించిన రీతిలో విజయాలు దక్కకపోవడం, కీలక నేతలు ఓటమి పాలు కావడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేశాయి. కామారెడ్డిలో భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ స్థానంలో సీఎం కేసీఆర్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై భాజపా విజయం సాధించింది. అయితే మొత్తంగా భాజపాకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఓటమిపాలు కాగా గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌ మూడోసారి విజయం సాధించారు. సిటింగ్‌ స్థానాలకు సంబంధించి హుజూరాబాద్‌లో భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌, దుబ్బాకలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఓటమి పాలయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, ముథోల్‌, సిర్పూర్‌.. నిజామాబాద్‌ జిల్లాలో నిజామాబాద్‌ అర్బన్‌, కామారెడ్డి, ఆర్మూర్‌లలో భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గోషామహల్‌ స్థానంలో భాజపా గెలిచింది. మిగిలిన 7 ఉమ్మడి జిల్లాల్లో భాజపాకు ప్రాతినిధ్యం దక్కలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గతంలో కంటే భారీగా చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు వచ్చినా ఫలితం దక్కలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో పట్టు సాధించిన భాజపాకు ఈసారి నిరాశే మిగిలింది. రాష్ట్రంలో 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలుండగా ఈ స్థానాల్లో ఎక్కడా భాజపాకు విజయం దక్కలేదు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో..

గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ స్థానంలో విజయం సాధించడంతో పాటు ఆ తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లలో విజయం సాధించిన భాజపా గతంలో నెగ్గిన ముషీరాబాద్‌, అంబర్‌పేట, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, ఉప్పల్‌ సహా కొత్తగా మహేశ్వరం, సనత్‌నగర్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానాలపై నమ్మకం పెట్టుకుంది. అనూహ్యంగా వీటిలో పలుచోట్ల మూడోస్థానానికి పరిమితం కాగా కొన్ని చోట్ల రెండో స్థానంలో నిలిచింది.

ముగ్గురు ఎంపీల ఓటమి..

భాజపా జాతీయ నాయకత్వం రాష్ట్ర ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. 20-25 స్థానాలు లక్ష్యంగా భాజపా ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలతో పాటు ముగ్గురు ఎంపీలను ఎన్నికల బరిలోకి దింపింది. కీలక నేతలతో పాటు పోటీచేసిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలుకావడం భాజపాకు నిరాశ మిగిల్చింది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో స్వల్ప తేడాతో మంత్రి గంగుల కమలాకర్‌ చేతిలో ఓటమిపాలుకావడం భాజపా శ్రేణుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. కోరుట్ల నుంచి బరిలో దిగిన డి.అర్వింద్‌ కూడా ఓటమి పాలయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నాలుగు స్థానాల్లో విజయం సాధించినా బోథ్‌ నుంచి పోటీ చేసిన ఎంపీ సోయం బాపురావు ఓడిపోవడం భాజపా శ్రేణుల్ని డీలాపడేలా చేసింది. కాగా హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో పోటీచేసిన ఈటల రాజేందర్‌ రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. హుజూరాబాద్‌ గెలుపుపై ధీమాగా ఉన్న ఈటల గత ఎన్నికల్లో ప్రత్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి చేతిలో ఓటమిపాలు కావడం భాజపా వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గజ్వేల్‌లో తలపడిన ఈటల రాజేందర్‌ 63,771 ఓట్లను సాధించి రెండో స్థానానికి పరిమితమయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో తెదేపా పొత్తుతో 5 స్థానాల్లో నెగ్గగా, 2018 ఎన్నికల్లో ఒక చోట విజయం సాధించిన భాజపా ఈసారి 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img