icon icon icon
icon icon icon

Sunil Kanugolu: గోల్‌ కొట్టిన సునీల్‌!

రాష్ట్రంలో ఇప్పుడు అందరి నోటా వినపడుతున్న పేరు సునీల్‌ కనుగోలు. రాజకీయవ్యూహాలు రచించడంలో తలపండిన కేసీఆర్‌ను ఢీకొట్టి.. కొద్ది నెలల కాలంలోనే కాంగ్రెస్‌ను విజయతీరాన్ని చేర్చడం వెనుక ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు.

Updated : 04 Dec 2023 07:48 IST

కాంగ్రెస్‌ విజయం వెనుక వ్యూహకర్త కీలక పాత్ర
రెండు రాష్ట్రాల్లో విజయాలకు సూత్రధారి
ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇప్పుడు అందరి నోటా వినపడుతున్న పేరు సునీల్‌ కనుగోలు(Sunil Kanugolu). రాజకీయవ్యూహాలు రచించడంలో తలపండిన కేసీఆర్‌ను ఢీకొట్టి.. కొద్ది నెలల కాలంలోనే కాంగ్రెస్‌ను విజయతీరాన్ని చేర్చడం వెనుక ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. అటు భారాస, ఇటు భాజపాల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ... ఎప్పటికప్పుడు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ నేతలను నడిపించారన్న పేరుంది. కర్ణాటకకు చెందిన సునీల్‌ కనుగోలు దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుపొందారు. గతంలో ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బృందంలో కీలకసభ్యుడిగా పనిచేశారు.

కర్ణాటక ఎన్నికలు, జోడో యాత్రకూ ఆయనే

ఉదయ్‌పుర్‌లో కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకున్న నవ సంకల్ప్‌ డిక్లరేషన్‌ అమలు కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ 2024 బృందంలో ఆయన్ను తొలుత సభ్యుడిగా నియమించింది. తదనంతరం ఏఐసీసీ ఎన్నికల వ్యూహ కమిటీ ఛైర్మన్‌గా కూడా నియమితులైన ఆయన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. గత మే నెలలో జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికల్లో తన రాజకీయ వ్యూహ చతురతతో అధికారంలో ఉన్న భాజపాను ఓడించి.. ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టేలా కృషి చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ప్రధాన సలహాదారుగా పేరుపొందిన సునీల్‌.. భారత్‌ జోడో యాత్ర ప్రణాళిక బాధ్యతలు తీసుకుని విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కర్ణాటక తర్వాత తెలంగాణలోనూ తనదైన శైలిలో పనిచేసి కాంగ్రెస్‌ను అధికారం వైపు నడిపించారు. కాంగ్రెస్‌ కంటే ముందు ఆయన ఏఐడీఎంకే, డీఎంకే పార్టీలకు కూడా వ్యూహకర్తగా పనిచేశారు. తెలంగాణలో వ్యూహాల అమలు, అంతర్గత సర్వేల వంటి విషయాల్లో సునీల్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం కూడా విజయానికి తోడ్పడిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img