icon icon icon
icon icon icon

BRS: నైరాశ్యంలో భారాస

వరసగా మూడోసారి విజయం సాధిస్తామనే ధీమాతో ఎన్నికల బరిలో దిగిన భారాసకు ఊహించని ఓటమి ఎదురైంది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తామనే విశ్వాసంతో ఉన్న ఆ పార్టీ చివరికి ఒక వంతు సీట్లను మాత్రమే సాధించగలిగింది.

Updated : 04 Dec 2023 11:04 IST

మూణ్నెల్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించినా దక్కని విజయం
సీఎం స్వయంగా 96 సభలు నిర్వహించినా ప్రతికూల ఫలితాలు
కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమిని జీర్ణించుకోలేని శ్రేణులు

ఈనాడు, హైదరాబాద్‌: వరసగా మూడోసారి విజయం సాధిస్తామనే ధీమాతో ఎన్నికల బరిలో దిగిన భారాసకు ఊహించని ఓటమి ఎదురైంది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తామనే విశ్వాసంతో ఉన్న ఆ పార్టీ చివరికి ఒక వంతు సీట్లను మాత్రమే సాధించగలిగింది. ముఖ్యంగా కేసీఆర్‌ కామారెడ్డిలో ఓటమిపాలు కావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఫలితాలు ఉత్తేజాన్ని ఇచ్చినప్పటికీ..గ్రామీణ నియోజకవర్గాలపై పెట్టుకున్న ఆశలు నిరాశపరచడం పార్టీ వర్గాలను విస్మయపరిచాయి. బొటాబొటీ మెజారిటీతో అయినా తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని భావించిన ఆ పార్టీ నేతల్లో ఫలితాల అనంతరం నైరాశ్యం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 21న అభ్యర్థులను ప్రకటించినప్పట్నుంచి నిత్యం  కోలాహలంగా కనిపించిన ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ ఆదివారం బోసిపోయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో గెలిచిన నేతలు స్థానికంగానే విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు.

అభివృద్ధి, సంక్షేమం నినాదంతో వెళ్లినా..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ 32 రోజుల్లో 96 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. అక్టోబరు 15న హుస్నాబాద్‌లో తొలి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. తర్వాత రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేశారు. భారాస ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేళ్లలో అమలుచేసిన రైతుబంధు, కల్యాణలక్ష్మి, 24 గంటల కరెంటు, తాగు, సాగునీరు సదుపాయాలు మెరుగుపరచడం సహా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. మరోవైపు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న కరెంటు, నీటి కష్టాలను ప్రజలకు గుర్తుచేశారు. ప్రధానంగా ధరణిని కాంగ్రెస్‌ పార్టీ ఎత్తేస్తామని చెబుతోందని, అదే జరిగితే రైతుబంధు నిధుల జమకు ఇబ్బందులు ఎదురవుతాయని, మళ్లీ భూముల పంచాయితీలు మొదటికొస్తాయని పదేపదే ప్రస్తావించారు. మంత్రి కేటీఆర్‌ కూడా రాష్ట్రవ్యాప్తంగా 60 రోజుల్లో 70 రోడ్‌షోలు, 30 బహిరంగ సభలు నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు 80కిపైగా సభలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. తమ పాలనలో అమలైన అభివృద్ధిని చెబుతూనే కాంగ్రెస్‌ విధానాలపై గళమెత్తారు. సుస్థిర పాలనతోనే తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రైతులు తమవైపే మొగ్గుచూపుతారని, పథకాల లబ్ధిదారుల ఓట్లు ఆదుకుంటాయని సీఎం సహా ముఖ్యనేతలు భావించారు. అందుకుభిన్నంగా ఊహించని ఫలితాలు వెల్లడవడం దిగ్భ్రాంతికి గురిచేసినట్లు భారాస వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం నుంచి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర ముఖ్యనేతలు ఫలితాల సరళిని పరిశీలించారు. కచ్చితంగా గెలుస్తారని భావించిన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోవడం,.. నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఇప్పుడు పరిమిత స్థానాలకు పడిపోవడానికి గల కారణాలపై చర్చించినట్టు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img