భాజపా తీన్‌మార్‌

సార్వత్రిక సమరానికి సెమీఫైనల్స్‌గా భావిస్తూ వచ్చిన శాసనసభ ఎన్నికల్లో హిందీ రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. ఆదివారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఉత్తరాదిన కమలం విరబూసింది.

Updated : 04 Dec 2023 06:58 IST

ఉత్తరాదిన కమల సునామీ  
మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం
ఓటములను గెలుపుగా మార్చుకున్న కాషాయదళం
సొంత బలంతో అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇక 12
హస్తం చేతిలో మూడు రాష్ట్రాలు
ఈనాడు - దిల్లీ

సార్వత్రిక సమరానికి సెమీఫైనల్స్‌గా భావిస్తూ వచ్చిన శాసనసభ ఎన్నికల్లో హిందీ రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. ఆదివారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఉత్తరాదిన కమలం విరబూసింది. మధ్యప్రదేశ్‌లో 230కి గాను 163 సీట్లతో వరసగా అయిదోసారి అప్రతిహత విజయం సాధించింది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న భాజపాకు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌కు మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ ఉంటుందని తొలుత అంచనాలు వెలువడ్డాయి. చివరకు హస్తం పార్టీని 66 సీట్లకు పరిమితం చేసి, భాజపాయే మరోసారి అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు తగ్గట్టుగా తెలంగాణలో కాంగ్రెస్‌ హస్తవాసి ఫలించింది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ను గద్దె దించి కమలం పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతోంది. ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మరోసారి విజయం సాధించడం తథ్యమని ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజా విజయంతో సొంతంగా 12 రాష్ట్రాలను పాలించే స్థాయికి భాజపా చేరితే, కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాలకు (కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌) పరిమితమైంది. అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారే రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని పునరావృతం చేస్తూ ఈసారి భాజపా విజయం సాధించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 200 నియోజకవర్గాలుండగా 199 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. భాజపా దూకుడుగా దూసుకుపోయి 115 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. కాంగ్రెస్‌ 69 సీట్లతో సరిపెట్టుకుంది. మాజీ ముఖ్యమంత్రి విజయరాజె సింధియా మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకుంటారనే అంచనాలు మొదలయ్యాయి. మధ్యప్రదేశ్‌లో భాజపా అఖండ మెజారిటీ సాధించింది. 2003 నుంచి వరుసగా నాలుగు పర్యాయాలుగా అధికారాన్ని చేపడుతూ వచ్చిన కాషాయదళం ఇప్పుడు అయిదోసారి విజయపతాకాన్ని ఎగురవేసింది.


ఛత్తీస్‌గఢ్‌లో పడిపోయిన హస్తవాసి

త్తీస్‌గఢ్‌లº వరుసగా మూడుసార్లు అధికారాన్ని చలాయించి 2018లో అనూహ్యంగా ఓడిపోయిన కమల దళం ఇప్పుడు భూపేశ్‌ బఘెల్‌ బృందాన్ని ఊహించని విధంగా ఓడించింది. 20 ఏళ్లలో ఎన్నడూలేనంత భారీ గెలుపు సాధించింది. 90 సీట్లున్న అసెంబ్లీలో 2003లో 50, 2008లో 50, 2013లో 49 సీట్లు గెలుచుకొని సాధారణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాషాయదళం మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు 54 సీట్లతో విజయాన్ని సొంతం చేసుకొంది. అక్కడ కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం కనిపించినా ముఖ్యమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు చాపకింద నీరులా చేటుచేశాయి. గత నాలుగు ఎన్నికల్లో ఎన్నడూలేనంత తక్కువకు కాంగ్రెస్‌ సీట్లు పడిపోయాయి.


రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు అడియాస

రాజస్థాన్‌లో అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ ద్వయం నాలుగేళ్లుగా కుర్చీ కోసం పోట్లాడుకున్నా చివరి ఆరునెలల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు తమకు ఓట్ల వర్షం కురిపిస్తాయన్న కాంగ్రెస్‌ ఆశలను వాస్తవ ఫలితాలు అడియాసలు చేశాయి. ఓటమి తేలిపోయిన తర్వాత సీఎం పదవికి గహ్లోత్‌ రాజీనామా చేశారు. 200 సీట్లున్న రాజస్థాన్‌లో 2003లో 120, 2008లో 78, 2013లో 163, 2018లో 73 సీట్లు చొప్పున భాజపా గెలుచుకుంది. ప్రతి అయిదేళ్లకోసారి గెలుపోటముల మధ్య ఊగిసలాడిన భాజపా సేన గత విజయంనాటికంటే తక్కువ సీట్లు ఈసారి తెచ్చుకుంది. అయినా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే శక్తి కూడగట్టుకుంది.


హస్తానికి చేటు

ధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పట్ల మహిళల్లో ఉన్న ఆదరణ, పార్టీకి సంస్థాగతంగా ఉన్న బలం, నరేంద్రమోదీ ప్రజాకర్షణ కలిపి భాజపాకి తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ ఏకపక్ష వైఖరి, ఇండియా కూటమిలోని బీఎస్పీ, సమాజ్‌వాదీలాంటి పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా బరిలో దిగడం వంటివి హస్తానికి చేటుచేశాయి. గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ను భాజపా దొడ్డిదారిలో దించేసి అధికారాన్ని చేజిక్కించుకుందన్న సానుభూతి ఈసారి తమకు అనుకూలంగా పనిచేస్తుందన్న అతివిశ్వాసం దెబ్బతీసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాదిన కాంగ్రెస్‌ ఓడిపోవడం విపక్ష ‘ఇండియా’ కూటమికి భంగపాటు కాదని జేడీయూ నేత కె.సి.త్యాగి వ్యాఖ్యానించారు. భాజపాను ఎదుర్కోలేమనే భావన నుంచి కాంగ్రెస్‌ బయటపడాలన్నారు. ఇండియా కూటమిపై ఈ ఎన్నికలు ఏమాత్రం ప్రభావం చూపబోవని ఎన్సీపీ అగ్రనేత శరద్‌పవార్‌ చెప్పారు.


లోక్‌సభ సమరంలో హ్యాట్రిక్‌ ఖాయం

- దిల్లీలో భాజపా కార్యకర్తలతో ప్రధాని నరేంద్రమోదీ

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాం. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ సాధించడం ఖాయం. తాజా ఫలితాలు అవినీతిపరులకు ఓ హెచ్చరికలాంటివి. స్వావలంబన, పారదర్శకత, సుపరిపాలన అనే నా ఎజెండాను తాజా ఎన్నికల్లో ప్రజాతీర్పు ద్వారా బలపరిచినట్లయింది. కుటుంబ రాజకీయాలు చేసేవారందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తే అదొక మంచి ఫొటోగా మారి పత్రికల పతాక శీర్షికలకు బాగుంటుంది. అంతేగానీ ఆ పక్షాలు ప్రజా విశ్వాసాన్ని చూరగొనలేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని