icon icon icon
icon icon icon

Revanth Reddy: పోరాడి.. గెలిచిన ధీవర!

అలుపెరగని పోరాటమే వారధిగా జడ్పీటీసీ సభ్యుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన అనుముల రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌  విజయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన ఆయన.. 17 ఏళ్లలోనే ఓ పార్టీని విజయపథంలో నడిపించిన నేతగా ఎదిగారు.

Updated : 04 Dec 2023 08:24 IST

జడ్పీటీసీ నుంచి జన నేతగా..
అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్‌

లుపెరగని పోరాటమే వారధిగా జడ్పీటీసీ సభ్యుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన అనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy).. కాంగ్రెస్‌  విజయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన ఆయన.. 17 ఏళ్లలోనే ఓ పార్టీని విజయపథంలో నడిపించిన నేతగా ఎదిగారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత 2021లో పీసీసీ పగ్గాలు చేపట్టిన ఆయన.. రాష్ట్రంలో పార్టీకి ఊపిరులూదారు. ఉద్వేగపూరిత ప్రసంగాలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
ప్రజల్లో ఆదరణ సంపాదించారు. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ తరఫున హెలికాప్టర్‌లో సుడిగాలిలా పర్యటించారు. నెల రోజుల్లో ఏకంగా 83 ప్రచార సభల్లో పాల్గొన్నారు.

రేవంత్‌రెడ్డి(Revanth Reddy) నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబరు 8న జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. వనపర్తిలో పాలిటెక్నిక్‌ చేశారు. తొలుత 2002లో తెరాస(ప్రస్తుత భారాస)లో చేరారు. ఆ పార్టీలో కొంతకాలమే కొనసాగారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తన సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా.. కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్‌ మండలంలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందడం విశేషం. అనంతరం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో దాదాపు 100 ఓట్ల ఆధిక్యమున్న అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఓడించారు. 2008లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి బరిలో దిగిన ఆయన.. కాంగ్రెస్‌ అభ్యర్థి గురునాథ్‌రెడ్డిపై 6,989 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 14,614 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి అక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, శాసనసభా పక్ష నేతగా తెలంగాణ అసెంబ్లీలో భారాసకు వ్యతిరేకంగా పోరాడారు. 2017లో కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2021లో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఆయన.. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించారు. ఈ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి మరోసారి ఘనవిజయం సాధించి సత్తా చాటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img