icon icon icon
icon icon icon

మార్చిన చోట కాస్త మెరుగ్గా..

అభ్యర్థులను మార్చిన, కొత్త అభ్యర్థులను బరిలోకి దింపిన నియోజకవర్గాల్లో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) కాస్త మెరుగైన ఫలితాలు సాధించింది. గత ఎన్నికల్లో గెలుపొందిన వారిలో కొందరికి టికెట్లు ఇవ్వకపోవడంతోపాటు ఓడిన వారి స్థానాల్లోనూ ఇతరులను పోటీకి నిలిపింది.

Updated : 04 Dec 2023 09:15 IST

18 స్థానాల్లో భారాస కొత్త అభ్యర్థులు  
12 సీట్లు గెలిచి.. ఆరు కోల్పోయిన పార్టీ

ఈనాడు, హైదరాబాద్‌: అభ్యర్థులను మార్చిన, కొత్త అభ్యర్థులను బరిలోకి దింపిన నియోజకవర్గాల్లో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) కాస్త మెరుగైన ఫలితాలు సాధించింది. గత ఎన్నికల్లో గెలుపొందిన వారిలో కొందరికి టికెట్లు ఇవ్వకపోవడంతోపాటు ఓడిన వారి స్థానాల్లోనూ ఇతరులను పోటీకి నిలిపింది. ఇలా మొత్తం 18 నియోజకవర్గాల్లో కొత్త వారిని బరిలో దించగా.. 12 చోట్ల భారాస అభ్యర్థులు విజయం సాధించారు. నర్సాపూర్‌లో 2018లో గెలిచిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి బదులుగా.. సునీతా లక్ష్మారెడ్డికి సీటు కేటాయించగా ఈమె విజయం సాధించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాటికొండ రాజయ్యను పక్కనబెట్టి.. కడియం శ్రీహరికి అవకాశమివ్వగా ఆయన గెలుపొందారు. జనగామలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారాస అభ్యర్థిగా ప్రకటించగా.. ఆయన విజయం పొందారు. ఉప్పల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి స్థానంలో పోటీకి నిలిపిన బండారి లక్ష్మారెడ్డి విజయం సాధించారు. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మికి టికెట్‌ ఖరారు చేయగా ఈమె గెలుపు సాధించారు. బోథ్‌ నియోజకవర్గంలో రాఠోడ్‌ బాపురావును కాదని.. అనిల్‌ జాదవ్‌కు అవకాశమివ్వగా విజయం సాధించారు. అలంపూర్‌ స్థానానికి తొలుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహంకే టికెట్‌ను ఖరారు చేశారు. కానీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఒత్తిడి మేరకు ఇక్కడ అబ్రహంను మార్చి, విజయుడుకు టికెట్‌ కేటాయించడంతో ఆయన గెలుపు సాధించారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి దుబ్బాక ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వగా గెలుపొందారు. మల్కాజిగిరి స్థానం నుంచి తొలుత మైనంపల్లి హన్మంతరావుకు టికెట్‌ ప్రకటించగా.. తదనంతర పరిణామాల్లో ఆయన పార్టీని వీడారు. దీంతో ఇక్కడి నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డిని పోటీలో నిలపగా ఆయన విజయాన్ని అందుకున్నారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో అక్కడ ఆయన కుమార్తె లాస్య నందితకు పార్టీ అవకాశమివ్వడంతో ఆమె గెలుపొందారు. హుజూరాబాద్‌లో 2018 ఎన్నికల్లో భారాస తరఫున గెలిచిన ఈటల రాజేందర్‌ పార్టీని వీడడంతో.. ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాసయాదవ్‌కు అవకాశమిచ్చారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాసయాదవ్‌కు బదులు పాడి కౌశిక్‌రెడ్డిని భారాస అభ్యర్థిగా బరిలోకి దించగా.. గెలుపు సాధించారు. కోరుట్లలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు బదులుగా ఆయన కుమారుడు డాక్టర్‌ సంజయ్‌ను బరిలోకి దింపగా విజయం సాధించారు.

పరాజితుల్లో..

భారాస తరఫున కొత్తగా అభ్యర్థులుగా  బరిలోకి దిగిన వారిలో ఆరుగురు ఓటమి పాలయ్యారు.. వేములవాడ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ స్థానంలో  చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు అవకాశమివ్వగా పరాజయం పాలయ్యారు. ఖానాపూర్‌ నుంచి సిట్టింగ్‌ శాసనసభ్యురాలు రేఖానాయక్‌ను కాదని.. భూక్యా జాన్సన్‌ రాథోడ్‌ను బరిలోకి దించగా ఆయన ఓడిపోయారు. వైరాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాములు నాయక్‌ను    పక్కనబెట్టి మదన్‌లాల్‌ను పోటీలో నిలపగా ఓటమి పాలయ్యారు. గోషామహల్‌ స్థానంలో గత ఎన్నికల్లో ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ పోటీ  చేసి ఓడిపోగా.. ఈసారి నందకిశోర్‌ వ్యాస్‌కు అవకాశమిచ్చినా ఆ సీటును కూడా భారాస కోల్పోయింది. ములుగులో కొత్త అభ్యర్థి   బడే నాగజ్యోతికి అవకాశమివ్వగా ఆమె ఓటమి పాలయ్యారు.


బెడిసిన కామారెడ్డి వ్యూహం

భారాస అధినేత కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీచేయాలనే వ్యూహం బెడిసికొట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కామారెడ్డిలో పోటీ వెనుక వ్యూహం ఉందని కేసీఆరే వెల్లడించారు. కామారెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌పై వ్యతిరేకత కారణంగా ఆయన ఓడిపోయే అవకాశాలున్నాయనే సర్వే నివేదికల ఆధారంగా కొత్త వ్యూహానికి తెరలేపినట్లు తెలిసింది. దీంతో పాటు పరిసర నియోజకవర్గాల్లోనూ భారాసకు ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వేల్లో తేలిందని సమాచారం. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో కేసీఆర్‌ బరిలోకి దిగితే.. ఆ ఇమేజ్‌తో కామారెడ్డితో పాటు సమీపంలో ఉన్న దుబ్బాక, అందోలు, మెదక్‌, నిజామాబాద్‌ గ్రామీణ, ఎల్లారెడ్డి, జుక్కల్‌ తదితర నియోజకవర్గాల్లోనూ సానుకూల ప్రభావం ఉంటుందని పార్టీ భావించినట్లు తెలుస్తోంది. అందుకే కేసీఆర్‌ను కామారెడ్డి నుంచి బరిలోకి దించాలనే నిర్ణయం భారాస కోర్‌ కమిటీ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఫలితాలు తారుమారయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img