icon icon icon
icon icon icon

2-2 ఫలితాన్నిచ్చిన జోడో

కాంగ్రెస్‌ శ్రేణుల్లో పునరుత్తేజం నింపేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఆ పార్టీకి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది.

Updated : 04 Dec 2023 05:49 IST

రాహుల్‌ యాత్ర సాగిన రాష్ట్రాల్లో రెండేసి చోట్ల విజయం, పరాజయం

దిల్లీ: కాంగ్రెస్‌ శ్రేణుల్లో పునరుత్తేజం నింపేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఆ పార్టీకి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. ఈ యాత్ర సాగిన రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణల్లో పార్టీ విజయం సాధించగా.. హిందీ ప్రాబల్యమున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో పరాజయం తప్పలేదు. ఈ లెక్కన చూస్తే ఓటర్లు ఈ కార్యక్రమానికి 2-2 ఫలితాన్ని కట్టబెట్టినట్లయింది.

రాహుల్‌ యాత్ర సాగిన రాష్ట్రాల్లో కర్ణాటకలో ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో 20 అసెంబ్లీ స్థానాల గుండా పాదయాత్ర వెళ్లగా.. అందులో 15 చోట్ల హస్తం పార్టీ విజయఢంకా మోగించింది. ఆ తర్వాత.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో పోలింగ్‌ జరిగింది. ఈ రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌లో యాత్ర నిర్వహించలేదు. మిగతా మూడు రాష్ట్రాల్లో తెలంగాణలోనే కాంగ్రెస్‌ విజయం సాధించింది. మొత్తం మీద చూస్తే రెండు దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని యాత్ర నింపిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. అక్కడ ప్రజల అభిమానాన్నీ పార్టీ చూరగొందని తెలిపారు. అందువల్లే అక్కడ గట్టి ప్రత్యర్థులను ఎదుర్కొని పార్టీ విజయం సాధించిందని వివరించారు. ఈ యాత్ర.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో సుదీర్ఘంగా సాగింది. అయినా ఆశించిన ప్రయోజనం దక్కలేదు. హిందీ ప్రాబల్య రాష్ట్రాల్లో హిందుత్వవాదం ఊపందుకున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుడు సంజయ్‌ ఝా తెలిపారు. భాజపా ప్రయోగిస్తున్న మతం కార్డును కాంగ్రెస్‌ సమర్థంగా ఎదుర్కోలేకపోతోందని చెప్పారు. ఆ రాష్ట్రాలకు భిన్నంగా కర్ణాటక, తెలంగాణలో ఎక్కువగా స్థానిక సంక్షేమ పథకాలపైనే ప్రధాన దృష్టి ఉందని, అందువల్లే హస్తం పార్టీ అక్కడ విజయం సాధించగలిగిందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపునకు యాత్ర ఒక్కటే కారణం కాదని మరో విశ్లేషకుడు రషీద్‌ కిద్వాయ్‌ తెలిపారు. భారత్‌ జోడో యాత్రలో ఆర్భాటం ఎక్కువగా, పస తక్కువగా ఉందన్నారు. ప్రధాని మోదీ, భాజపా తెస్తున్న సానుకూల హిందుత్వవాదం, సాంస్కృతిక జాతీయవాదాన్ని రాహుల్‌, కాంగ్రెస్‌ సమర్థంగా ఎదుర్కోలేదని వివరించారు.

భారత్‌ జోడో యాత్ర.. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 4వేల కిలోమీటర్లు సాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img