icon icon icon
icon icon icon

Harish Rao: తిరుగులేని నేత.. ‘తన్నీరు’

సిద్దిపేట.. ఈ ప్రాంతం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే పేరు భారాస నేత తన్నీరు హరీశ్‌రావు. నిరంతరం ప్రజల మధ్య ఉండే నేతగా, రోజులో 18 గంటలపాటు శ్రమించే నాయకుడిగా గుర్తింపు పొందారు.

Updated : 04 Dec 2023 07:25 IST

సిద్దిపేటలో 82,308 ఓట్ల
ఆధిక్యంతో హరీశ్‌రావు గెలుపు

సిద్దిపేట, న్యూస్‌టుడే: సిద్దిపేట.. ఈ ప్రాంతం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే పేరు భారాస నేత తన్నీరు హరీశ్‌రావు(Harish Rao). నిరంతరం ప్రజల మధ్య ఉండే నేతగా, రోజులో 18 గంటలపాటు శ్రమించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఓటమి ఎరుగని వ్యక్తిగా సిద్దిపేట నియోజకవర్గంలో నూతన అధ్యాయాన్ని లిఖించారు. తాజా ఎన్నికల్లో(telangana election results) 82,308 ఓట్ల ఆధిక్యత సాధించారు. మొత్తం 21 మంది అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్య 1,81,834 కాగా ఆయన 1,05,514(58%) సాధించారు. 2018 ఎన్నికల్లో 1,18,699 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నాడు 78.50% ఓట్లు ఆయన ఖాతాలో పడ్డాయి. అభ్యర్థుల ధరావతు గల్లంతయింది. ప్రస్తుత ఫలితాల్లోనూ ప్రత్యర్థులది అదే పరిస్థితి. పార్టీ రాష్ట్ర స్టార్‌ క్యాంపెయినర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన హరీశ్‌రావు.. ఈసారి ఎన్నికల సమయంలో రెండుసార్లు నియోజకవర్గానికి వచ్చినా సిద్దిపేట పట్టణం, చిన్నకోడూరులలో కొన్ని గంటలు మాత్రమే ప్రచారం చేశారు.

వరుసగా ఏడుసార్లుతో రికార్డు

రాష్ట్రంలో ఓటమి లేకుండా వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతలుగా ఉమ్మడి మెదక్‌ జిల్లా నేత, దివంగత బాగారెడ్డి, భాజపా నాయకుడు ఈటల రాజేందర్‌ రికార్డు నెలకొల్పగా తాజా ఎన్నికల్లో భారాస నేత హరీశ్‌రావు కూడా ఆ ఘనతను సొంతం చేసుకున్నారు. జహీరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున 1957 నుంచి 1985 వరకు వరుసగా ఏడుసార్లు బాగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ సైతం 2021లో జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో కలిపి వరుసగా ఏడుసార్లు విజయం సాధించి బాగారెడ్డి రికార్డును సమం చేశారు. ఆరుసార్లు భారాస నుంచి.. ఏడోసారి భాజపా నుంచి పోటీ చేసి గెలిచారు. హరీశ్‌రావు 2004 (ఉప ఎన్నిక) నుంచి 2018 వరకు సిద్దిపేట నుంచి భారాస అభ్యర్థిగా.. మూడు ఉప ఎన్నికలతో కలిపి వరుసగా ఆరుసార్లు విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం ఏడోసారి అదే స్థానం నుంచి బరిలో నిలిచి భారీ మెజార్టీతో విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img