icon icon icon
icon icon icon

పనిచేయని గహ్లోత్‌ మ్యాజిక్‌!

అశోక్‌ గహ్లోత్‌.. రాజస్థాన్‌ విలక్షణ నేత. కాంగ్రెస్‌ అధిష్ఠానాన్నే బెదిరించగల నాయకుడు. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లో కల్లోలం సృష్టించిన నేత.. రాజస్థాన్‌కు కాంగ్రెస్‌ నుంచి తాను తప్ప మరొకరు ముఖ్యమంత్రి కాకూడదనే మొండిఘటం.

Updated : 04 Dec 2023 10:16 IST

జైపుర్‌: అశోక్‌ గహ్లోత్‌.. రాజస్థాన్‌ విలక్షణ నేత. కాంగ్రెస్‌ అధిష్ఠానాన్నే బెదిరించగల నాయకుడు. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లో కల్లోలం సృష్టించిన నేత.. రాజస్థాన్‌కు కాంగ్రెస్‌ నుంచి తాను తప్ప మరొకరు ముఖ్యమంత్రి కాకూడదనే మొండిఘటం. ముఖ్యమంత్రి పదవిని వదలాలనే అనుకుంటున్నానని, కానీ ఆ పదవే తనను వదలడం లేదని వ్యాఖ్యానించి తన ఉద్దేశాన్ని అధిష్ఠానానికి స్పష్టం చేశారాయన. అలాంటి నేత.. తాను ప్రవేశపెట్టిన పథకాలతో రాజస్థాన్‌లో మళ్లీ అధికారం చేపడతాననే అతి విశ్వాసంతో వెళ్లి బొక్క బోర్లా పడ్డారు. తాను నష్టపోవడంతోపాటు కాంగ్రెస్‌ పార్టీకీ తీరని నష్టం కలిగించారు. గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి గహ్లోత్‌ చేయని విన్యాసాలు లేవు. మేజీషియన్‌ అయిన తన తండ్రి రక్తం తన నరనరాల్లో పారుతోందని చెప్పే ఆయన పదవిని కాపాడుకునేందుకు పలు ప్రయత్నాలు చేశారు. గత ఏడాది ముఖ్యమంత్రి పదవిని సచిన్‌ పైలట్‌కు అప్పగించేందుకు శాసనసభాపక్ష సమావేశాన్ని అధిష్ఠానం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యేలు హాజరుకాకుండా అడ్డుకున్నారు. ఆయనను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేసి ముఖ్యమంత్రి పదవిని పైలట్‌కు ఇద్దామనుకుంటే దానినీ అడ్డుకున్నారు. ముఖ్యమంత్రిగానే కొనసాగుతానని తేల్చి చెప్పారు.

రాజస్థాన్‌లో ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాదనే సంప్రదాయాన్ని మార్చాలనే పట్టుదలతో తానే కాంగ్రెస్‌ పార్టీని ముందుండి నడిపిస్తానని అధిష్ఠానాన్ని ఒప్పించగలిగారు. ఇందుకోసం చౌక ధరకు వంట గ్యాస్‌, రూ.25 లక్షల ఆరోగ్య బీమా, ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ తననే ముఖ్యమంత్రిని చేస్తాయని నమ్మారు. ఈ సారి ముఖ్యమంత్రి కుర్చీ ఆయనను వదిలేసింది. ఆదివారం ఆయనకు ఫలితాలు షాకిచ్చాయి. ఈ పరాజయం ఆయన పాత విజయాలను మార్చివేయలేదు. 1998-2003, 2008-2013, 2018-2023 కాలాల్లో ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనకంటే అధికంగా మోహన్‌లాల్‌ సుఖాడియా మాత్రమే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. హరిదేవ్‌ జోషి, భైరాన్‌సింగ్‌ షెకావత్‌ మూడేసి సార్లు రాజస్థాన్‌ ముఖ్యమంత్రులుగా పని చేశారు. గహ్లోత్‌ 1974 నుంచి 1979 వరకూ ఎన్‌ఎస్‌యూఐ రాజస్థాన్‌ యూనిట్‌ అధ్యక్షుడిగా పని చేశారు. జోధ్‌పుర్‌ నుంచి 5సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1999 నుంచి వరుసగా సర్దార్‌పుర్‌ అసెంబ్లీ స్థానంలో గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఆరుసార్లు విజయం సాధించారు. తూర్పు బెంగాల్‌ శరణార్థుల కోసం చేసిన పనితో అప్పట్లో ఇందిరా గాంధీ మెప్పు పొందారు. ఆ తరువాత రాజీవ్‌ గాంధీతోనూ సన్నిహితంగా మెలిగారు. ఏఐసీసీ  ప్రధాన కార్యదర్శిగానూ ఆయన సేవలందించారు. 34ఏళ్ల వయసులోనే రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img