DK Shivakumar: ఖరారు బాధ్యత హైకమాండ్‌దే..

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి (సీఎల్పీ నేత) ఎవరనే విషయంలో కాంగ్రెస్‌లోని అత్యధిక ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డివైపు మొగ్గు చూపినా సోమవారం రాత్రి వరకు పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాలేదు.

Updated : 05 Dec 2023 08:17 IST

సీఎంగా రేవంత్‌వైపే మెజార్టీ ఎమ్మెల్యేల మొగ్గు
డీకేతో భట్టి, ఉత్తమ్‌, కోమటిరెడ్డి భేటీ
తమ పేర్లూ పరిశీలించాలని వినతి
సందిగ్ధావస్థలో అధిష్ఠానానికి నివేదన
గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో ప్రమాణ స్వీకారం వాయిదా
దిల్లీ వెళ్లి ఖర్గేను కలిసిన పరిశీలకులు
నేడు మరోసారి భేటీ
సోనియాతో సంప్రదించాక తుది నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి (సీఎల్పీ నేత) ఎవరనే విషయంలో కాంగ్రెస్‌లోని అత్యధిక ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డివైపు మొగ్గు చూపినా సోమవారం రాత్రి వరకు పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాలేదు. కొందరు సీనియర్లు సీఎం అభ్యర్థిత్వానికి తమ పేర్లూ పరిశీలించాలని కోరడం, ఎమ్మెల్యేల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో విషయం అధిష్ఠానం పరిధిలోకి వెళ్లింది. అక్కడి నుంచి అధికారికంగా అనుమతి రాకపోవడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సోమవారం మధ్యాహ్నమే సీఎల్పీ సమావేశంలో చర్చించి.. సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసి పంపారు. కానీ రాత్రి వరకు అధిష్ఠానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పాటు పరిశీలకులను దిల్లీకి పిలిపించారు. దీంతో మాణిక్‌రావ్‌ ఠాక్రే, డి.కె.శివకుమార్‌(DK Shivakumar) దిల్లీ వెళ్లి ఖర్గేను కలిశారు. సీఎల్పీ సమావేశ వివరాలను ఆయనకు నివేదించారు. మంగళవారం మరోసారి భేటీ అయి చర్చిద్దామని ఖర్గే వారికి సూచించినట్లు సమాచారం. ఆ సమావేశం అనంతరం విషయాన్ని  సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయాన్ని వెలువరించే అవకాశమున్నట్లు తెలిసింది. దిల్లీలోని ముఖ్యనేతలు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉన్న కారణంగా జాప్యం జరిగిందని, రేవంత్‌రెడ్డి పేరునే అధికారికంగా వెల్లడించనున్నారని కాంగ్రెస్‌ ముఖ్యనాయకుడొకరు తెలిపారు. రేవంత్‌రెడ్డి సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరిగినా, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఆ పదవికి పోటీ పడటంతో ఎమ్మెల్యేలతో విడివిడిగా చర్చించిన అంశాలతో కూడిన నివేదికను పరిశీలకులు అధిష్ఠానానికి పంపారు.

మేమూ పోటీలో ఉన్నాం..

సీఎం అభ్యర్థిని ఎన్నుకునేందుకు సోమవారం ఉదయం 9.30 గంటలకు గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. పరిశీలకులుగా డి.కె.శివకుమార్‌, బోసురాజు, అజయ్‌కుమార్‌, జార్జి, దీపా దాస్‌మున్షీలను కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించింది. సీఎల్పీ సమావేశానికి ముందే మరో హోటల్‌లో బస చేసిన డి.కె.శివకుమార్‌తో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి సోదరులు సమావేశమయ్యారు. వీరిలో కొందరు తమకు అవకాశమివ్వాలని కోరుతూ అందుకు గల కారణాలను నివేదించినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు కాకుండా ఒక్కరే ఉండాలని ఒక నాయకుడు సూచించినట్లు తెలిసింది. సమావేశంలో పాల్గొన్న ఒకరి పేరు స్పీకర్‌ పదవికి చర్చకు రాగా.. ఆయన తిరస్కరించినట్లు తెలిసింది.

అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

శివకుమార్‌ ఇక్కడ చర్చ ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌కు వెళ్లారు. ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలను పరిశీలకులు విడివిడిగా తెలుసుకున్నారు. సీఎం అభ్యర్థిగా ఒక్కరి పేరే చెప్పాలని సూచించారు. ఈ ప్రక్రియలో కొందరు ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి పేరు చెప్పగా.. మరికొందరు భట్టి, ఉత్తమ్‌, కోమటిరెడ్డిల పేర్లు చెప్పినట్లు తెలిసింది. ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాకు చెందిన మరో నాయకుడి పేరు చెబుతూనే.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నట్లు తెలిసింది. కొందరు రాహుల్‌గాంధీ నిర్ణయమే శిరోధార్యమని చెప్పినట్లు సమాచారం. ఈ భిన్నాభిప్రాయాలతోపాటు.. ముగ్గురు సీనియర్‌ నాయకులు తమకే అవకాశం కల్పించాలని గట్టిగా కోరడం, కొందరు సీనియర్లు రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించడంతో పరిశీలకులకు సందిగ్ధత ఎదురైంది. దీంతో అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి అప్పగిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ ఏకవాక్య తీర్మానాన్ని భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో సహా ఎనిమిది మంది బలపరిచినట్లు సమావేశం అనంతరం డి.కె.శివకుమార్‌ విలేకరులకు తెలిపారు. పార్టీకి విజయాన్ని చేకూర్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ ఇంకో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేతో పాటు మురళీధరన్‌, మునియప్ప, రోహిత్‌చౌదరి తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారానికి సన్నద్ధం చేసినా..

రాజ్‌భవన్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభయ్యాయి. రెండో శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను సీఈవో వికాస్‌రాజ్‌ గవర్నర్‌కు సమర్పించడంతోపాటు గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ కావడంతో కొత్త మంత్రివర్గం ప్రమాణం చేయడానికి మార్గం ఏర్పడింది. సీఎల్పీ సమావేశం తర్వాత ఫలానా వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకున్నామని, ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని గవర్నర్‌కు లేఖ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత సీఎం డిజిగ్నేట్‌గా ఆ వ్యక్తిని పేర్కొంటూ గవర్నర్‌ లేఖ జారీ చేశాక.. ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తారు. ఆ కార్యక్రమం సోమవారం రాత్రి 8- 8.30 గంటల మధ్యలో నిర్వహిస్తున్నట్లు సాధారణ పరిపాలన శాఖ నుంచి కొందరు ఎమ్మెల్యేలకు ఫోన్లు కూడా వెళ్లాయి. కానీ కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి సమాచారం రాకపోవడంతో వాయిదా పడింది.

రేవంత్‌రెడ్డి నివాసం వద్ద భద్రత పెంపు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం, ముఖ్యమంత్రి పదవి రేసులో ఆయన ఉండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి తరలివస్తుండటంతో వారిని అదుపు చేసేందుకు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జూబ్లీహిల్స్‌ పోలీసులు ఇక్కడ రెండు ప్లటూన్‌ల సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరితోపాటు ఒక ఎస్సై, మరికొంత మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. సాయుధ సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు. రేవంత్‌ నివాసానికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీ అనంతరమే అనుమతిస్తున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడి దారులను శుభ్రం చేస్తున్నారు. వివిధ శాఖలకు     చెందిన అధికారులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాకపోకలు సాగించే దారుల్లో ఉన్న సమస్యలను పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు