మిజోరంలో జడ్‌పీఎం జోరు

ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఒకే పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చే సంప్రదాయానికి తెరపడింది.

Published : 05 Dec 2023 05:40 IST

27 సీట్లతో అధికార పీఠం కైవసం
పరాజయం పాలైన సీఎం, డిప్యూటీ సీఎం

ఆయిజోల్‌: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఒకే పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చే సంప్రదాయానికి తెరపడింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌), కాంగ్రెస్‌లకు గట్టి షాక్‌ ఇస్తూ.. జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జడ్‌పీఎం) పార్టీ తొలిసారి పాలనా పగ్గాలు దక్కించుకుంది. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తాజా ఎన్నికల్లో జడ్‌పీఎం 27 చోట్ల విజయం సాధించింది. అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైన ఎంఎన్‌ఎఫ్‌ కేవలం 10 సీట్లతో సరిపెట్టుకుంది. భాజపా రెండు చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్‌ ఒకే ఒక్క చోట విజయం సాధించగలిగింది. రాష్ట్రంలో గత నెల 7న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగగా.. సోమవారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. జడ్‌పీఎం, ఎంఎన్‌ఎఫ్‌, కాంగ్రెస్‌ 40 చోట్లా పోటీ చేయగా.. భాజపా 23 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసింది. రాష్ట్రంలో 2018 నాటి ఎన్నికల్లో జడ్‌పీఎం కేవలం 8 సీట్లు గెల్చుకోవడం గమనార్హం.

9 మంది మంత్రుల పరాజయం

మిజోరం ముఖ్యమంత్రి జొరాంథంగా, ఉప ముఖ్యమంత్రి తాంవలుయియా సహా మొత్తం 9 మంది మంత్రులు ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. వారందరికీ జడ్‌పీఎం అభ్యర్థుల చేతుల్లోనే భంగపాటు ఎదురైంది. జొరాంథంగా (ఎంఎన్‌ఎఫ్‌ అధినేత) ఆయిజోల్‌ తూర్పు-1 స్థానంలో 2,101 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. జొరాంథంగా కేబినెట్‌లో మంత్రుల మొత్తం సంఖ్య 12 కాగా.. వారిలో 11 మంది ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేశారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి లాల్‌చందమా రాల్టే (తుయ్‌వాల్‌ నియోజకవర్గం), పర్యాటక శాఖ మంత్రి రాబర్ట్‌ రోమావియా రోయ్టే (హాచెక్‌) మాత్రమే విజయం సాధించారు. జడ్‌పీఎం అధినేత లాల్‌దుహోమా సెర్చిప్‌ స్థానం నుంచి 2,982 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

జొరాంథంగా రాజీనామా

మిజోరం సీఎం పదవికి జొరాంథంగా రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబును సోమవారం సాయంత్రం కలిసి తన రాజీనామా లేఖ సమర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేకత వల్లే తాము ఓడిపోయామని చెప్పారు. మరోవైపు- సర్కారు ఏర్పాటుకు అవకాశమివ్వాలంటూ మంగళవారం తాము గవర్నర్‌ను కోరే అవకాశముందని జడ్‌పీఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.సప్‌డాంగా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని