icon icon icon
icon icon icon

పశ్చిమ యూపీలో మొగ్గెవరికి?

తొలి విడత పోలింగ్‌ జరగనున్న పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాంపుర్‌, మొరాదాబాద్‌, సంభల్‌తోపాటు మిగిలిన నియోజకవర్గాలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

Updated : 04 Apr 2024 16:01 IST

ముస్లిం ఓట్లు చీలనున్నాయా..
మళ్లీ భాజపా లాభపడనుందా..
ఇండియా కూటమి నెగ్గుకు రాగలదా..
మారిన పొత్తులతో ఆసక్తికరం
తొలి విడతలో 8 స్థానాలకు పోలింగ్‌

లఖ్‌నవూ: తొలి విడత పోలింగ్‌ జరగనున్న పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాంపుర్‌, మొరాదాబాద్‌, సంభల్‌తోపాటు మిగిలిన నియోజకవర్గాలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం అధికం. ఈ నియోజకవర్గాల్లో 23శాతం నుంచి 42 శాతం వరకూ ఓటర్లు ముస్లింలే. దీంతో ఎన్డీయే, ఇండియా కూటములకు ఈ ప్రాంతం కీలకంగా మారింది.

తొలి విడతలో ఏప్రిల్‌ 19న పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని  8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో సహారన్‌పుర్‌, కైరానా, ముజఫర్‌నగర్‌, బిజ్నౌర్‌, నగీనా, మొరాదాబాద్‌, రాంపుర్‌, పీలీభీత్‌ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో సమాజ్‌వాదీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) కలిసి పోటీ చేశాయి. మంచి ఫలితాలనే సాధించాయి. ఈసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. జాట్‌లలో ప్రాబల్యం ఉన్న ఆర్‌ఎల్‌డీ ఈసారి భాజపాతో జట్టుకట్టింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తున్నాయి. మళ్లీ గత వైభవాన్ని పొందాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారీ ఈ ప్రాంతంలో ఒక్క ముస్లింకూ భాజపా టికెట్‌ ఇవ్వలేదు. సమాజ్‌వాదీ, బీఎస్పీలు పలువురు మైనారిటీ అభ్యర్థులను బరిలో నిలిపాయి.

2019లో

గత లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు, దళితుల ప్రాబల్యమున్న సహారన్‌పుర్‌, బిజ్నోర్‌, నగీనా, అమ్రోహ్‌ నియోజకవర్గాలను బీఎస్పీ గెలుచుకుంది. మొరాదాబాద్‌, రాంపుర్‌, సంభల్‌ సీట్లలో సమాజ్‌వాదీ విజయం సాధించింది. ముస్లిం ఓట్లలో చీలిక రావడంతో ముజఫర్‌నగర్‌, కైరానా, మేరఠ్‌, బులంద్‌శహర్‌, బాగ్‌పత్‌, అలీగఢ్‌లను భాజపా గెలుచుకుంది.

చీలిక రానుందా?

మారిన పరిస్థితుల్లో ముస్లిం ఓట్లలో చీలిక రాకుండా కాపాడుకోవడం కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ కూటమికి పెద్ద సవాలే. గంపగుత్తగా ముస్లింల ఓట్లన్నీ పడితేనే ఈ కూటమి విజయం సాధించగలదు. ముస్లిం ఓట్లను చీలకుండా కాపాడుకోవడం అనేది సమాజ్‌వాదీకి అత్యంత కీలకమని రాజకీయ విశ్లేషకుడు పర్వేజ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. 2019 నుంచి తమ తరపున గట్టిగా వాదన వినిపించడంలో సమాజ్‌వాదీ విఫలమైందనే భావన ముస్లింలలో ఉందని తెలిపారు. దీంతోపాటు బీఎస్పీ ముస్లిం అభ్యర్థులను ఈ నియోజకవర్గాల్లో నిలుపుతోంది. ఇక్కడ ముస్లింల తర్వాత దళితులే అధిక సంఖ్యలో ఉన్నారు. జాట్‌లలో ప్రాబల్యమున్న ఆర్‌ఎల్‌డీ ఈసారి భాజపాతో జట్టు కట్టడంతో వారంతా ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపే అవకాశముంది. ముస్లిం ఓట్లలో చీలిక, జాట్‌ల మద్దతు, బీఎస్పీ ఒంటరిపోరాటం తమకు లాభిస్తాయని భాజపా భావిస్తోంది.


ముస్లిం మద్దతు తమకేనంటున్న ఎస్పీ

ముస్లిం ఓటర్లు ఇంకా తమవైపే ఉన్నారని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధికార ప్రతినిధి ఫక్రుల్‌ హసన్‌ తెలిపారు. భాజపా, ఆర్‌ఎల్‌డీ కూటమి ప్రభావం తమపై పెద్దగా పడదని అంటున్నారు. అవి రెండూ అవసరాల కోసం కలిశాయే తప్ప సహజ భాగస్వాములు కావని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఆర్‌ఎల్‌డీ పెద్దగా ప్రభావం చూపడం లేదని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమతో పొత్తువల్ల ముస్లిం ఓట్లను సాధించుకుని బీఎస్పీ లాభపడిందని చెప్పారు. 10 సీట్ల వరకూ గెలుచుకున్నామని వివరించారు. అదే 2022 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి బీఎస్పీతో పొత్తు లేకుండా విడిగా పోటీ చేశామని, ఆ ఎన్నికల్లో ముస్లిం ప్రాబల్యమున్న ప్రాంతాల్లో తమ పార్టీ ఎక్కువ స్థానాలను సాధించిందని సమాజ్‌వాదీ నేత వెల్లడించారు. దీనిని బట్టి ముస్లింలు తమతోనే ఉన్నారని స్పష్టమవుతోందని తెలిపారు.


భాజపా ప్రణాళిక ఇదీ..

గత లోక్‌సభ ఎన్నికల్లో 20,000 పోలింగ్‌ బూత్‌లలో భాజపా నష్టపోయిందని భాజపా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు కున్వర్‌ బాసిత్‌ తెలిపారు. వీటిపై ఈసారి దృష్టి సారించామని వెల్లడించారు. ఒక్కో బూత్‌కు 11 మందితో కమిటీ వేశామని చెప్పారు. వీరిలో మహిళలూ ఉన్నారని, వీరంతా ముస్లిం ఓట్లను సాధించేందుకు కృషి చేస్తారని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వారికి వివరించి ఓట్లు అడుగుతామని తెలిపారు. ఒక్కో బూత్‌లో 50 ముస్లిం ఓట్లను సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. గతంలో ఇక్కడ ఒక్కో బూత్‌లో రెండు, మూడు, ఐదు చొప్పున ఓట్లు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 10శాతం ముస్లిం ఓట్లను సాధించిందని, ఈసారి 15శాతం లక్ష్యంగా పనిచేస్తున్నామని బాసిత్‌  తెలిపారు. ముఖ్యంగా పస్మందా ముస్లింలే లక్ష్యంగా తమ ప్రచారం ఉంటుందని వివరించారు. వారికి ప్రభుత్వ పథకాలను అందించామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img