icon icon icon
icon icon icon

సింధియాలదే ‘గుణ’

సార్వత్రిక ఎన్నికల సమరంలో గ్వాలియర్‌ రాజ కుటుంబానికి కంచుకోటగా ఉన్న గుణ (మధ్యప్రదేశ్‌) లోక్‌సభ స్థానంలో పోటీ ఉత్కంఠ రేపుతోంది.

Published : 04 Apr 2024 15:54 IST

పార్టీ, గుర్తు మారినా రాజ కుటుంబానిదే గెలుపు
2019లో మాత్రం జ్యోతిరాదిత్య ఓటమి
ఈసారి గెలిచి సత్తా చాటాలని ప్రయత్నం

భోపాల్‌: సార్వత్రిక ఎన్నికల సమరంలో గ్వాలియర్‌ రాజ కుటుంబానికి కంచుకోటగా ఉన్న గుణ (మధ్యప్రదేశ్‌) లోక్‌సభ స్థానంలో పోటీ ఉత్కంఠ రేపుతోంది. గుణ నుంచి భాజపా తరఫున పౌర విమానయానశాఖ మంత్రి   జ్యోతిరాదిత్య సింధియా బరిలో నిలిచారు. 2019లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి అనూహ్యంగా ఓటమిపాలైన ఆయన ఈ ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. 2019లో భాజపా అభ్యర్థి, ఒకప్పటి తన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణపాల్‌ సింగ్‌ యాదవ్‌ చేతిలో ఓడిపోవడంవల్ల జ్యోతిరాదిత్య ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచి గుణలో సింధియా రాజ కుటుంబం పట్టును చాటిచెప్పాలని జ్యోతిరాదిత్య పట్టుదలగా ఉన్నారు.


మూడో తరం నేత

53 ఏళ్ల జ్యోతిరాదిత్య భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజమాత విజయరాజే సింధియా మనవడు. కేంద్ర మాజీ మంత్రి మాధవరావ్‌ సింధియా కుమారుడు. గుణ లోక్‌సభ పరిధిలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. గుణలో 18.8లక్షల మంది ఓటర్లున్నారు. ఇక్కడ మూడో విడతలో మే  7న పోలింగ్‌ జరగనుంది.


2019దాకా వాళ్లదే ఆధిపత్యం

సింధియా కుటుంబం స్వాతంత్య్రానికి పూర్వం గ్వాలియర్‌ రాజ్యాన్ని పరిపాలించింది. స్వాతంత్య్రం వచ్చాక 1957లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయరాజే సింధియా గెలిచారు. 1967లో ఆమె స్వతంత్ర పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 1989లో భాజపా తరఫున గెలిచారు. జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావ్‌ సింధియా 1971లో తొలిసారిగా భారతీయ జనసంఘ్‌ తరఫున పోటీ చేసి గెలిచారు. 1999లో చివరిసారిగా విజయం సాధించారు. 2001లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. గుణ పార్లమెంటు స్థానం నుంచి విజయరాజే సింధియా 6సార్లు గెలుపొందారు. మాధవరావ్‌ సింధియా 4 సార్లు విజయం సాధించారు. గుణలోనే కాకుండా గ్వాలియర్‌లోనూ ఒకసారి విజయరాజే సింధియా గెలుపొందారు. మాధవరావ్‌ సింధియా 5సార్లు గ్వాలియర్‌ నుంచి గెలిచారు. ఆయన కాంగ్రెస్‌తోపాటు మధ్యప్రదేశ్‌ వికాస్‌ కాంగ్రెస్‌ స్థాపించి ఆ పార్టీ తరఫునా విజయం సాధించారు. రాజమాత కుమార్తె, జ్యోతిరాదిత్య మేనత్త యశోధర రాజే గ్వాలియర్‌ నుంచి రెండు సార్లు గెలిచారు. జ్యోతిరాదిత్య గుణ సీటు నుంచి 2002, 2014 మధ్య నాలుగు సార్లు గెలుపొందారు. 2019లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2020లో భాజపాలో చేరారు.


రెండుసార్లే ఓటమి

సింధియా కుటుంబంలోని వారు ఇప్పటిదాకా రెండు సార్లే ఓటమి చవిచూశారు. 1984లో వసుంధర రాజే భింద్‌ లోక్‌సభ సీటులో ఓడిపోయారు. ఆమె భాజపా తరఫున పోటీ చేశారు. 2019లో కాంగ్రెస్‌ తరఫున గుణ నుంచి పోటీ చేసిన జ్యోతిరాదిత్య ఓటమి రెండోది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img