icon icon icon
icon icon icon

నటుల రాజకీయ రణస్థలం.. లోక్‌సభ ఎన్నికల్లో 20 మందికి పైగా పోటీ

లోక్‌సభ ఎన్నికల బరిలో సినీ, టీవీ నేపథ్యమున్న నటులు 20 మందికి పైగా వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది భాజపా తరఫున రంగంలోకి దిగారు.

Updated : 16 Apr 2024 17:18 IST

పలు రాష్ట్రాల నుంచి బరిలోకి..
తొలిసారిగా కంగన

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ ఎన్నికల బరిలో సినీ, టీవీ నేపథ్యమున్న నటులు 20 మందికి పైగా వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది భాజపా తరఫున రంగంలోకి దిగారు. ఇప్పటికే రాజకీయంగా అనుభవం సంపాదించి పార్లమెంటు ఎగువ, దిగువ సభలకు ప్రాతినిధ్యం వహించిన వారితోపాటు, తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నవారూ ఇందులో ఉన్నారు. వీరిలో డ్రీమ్‌ గర్ల్‌ హేమమాలిని అందరి కంటే ముందు వరుసలో ఉన్నారు. తమిళనాడులో పుట్టి హిందీ చిత్రసీమను ఏలిన ఆమె భాజపా తరఫున రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మథుర నుంచి వరుసగా మూడోసారి పోటీ పడుతున్నారు. సినీ, టీవీ నటిగా, మోడల్‌గా గుర్తింపు పొంది రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం రాహుల్‌ గాంధీని ఓడించే స్థాయికి ఎదిగిన 48 ఏళ్ల స్మృతి ఇరానీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి మూడోసారి భాజపా తరఫున బరిలోకి దిగారు. 2014లో ఇదే నియోజకవర్గంలో రాహుల్‌ గాంధీ చేతిలో 1.07 లక్షల తేడాతో ఓడిపోయిన ఆమె 2019లో 54,731 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

  • హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ నుంచి బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ప్రధాని మోదీ మద్దతుదారుగా బలమైన ముద్ర పొందిన ఆమె ఆ పార్టీలో చేరక ముందే కమలం టికెట్‌ దక్కించుకున్నారు.
  • మేరఠ్‌ నుంచి టీవీ రాముడు అరుణ్‌ గోవిల్‌ భాజపా తరఫున అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
  • రేసు గుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పాత్రతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన రవికిషన్‌ గోరఖ్‌పుర్‌ నుంచి వరుసగా రెండోసారి బరిలోకి దిగారు.
  • యమదొంగ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి నాట్యం చేసిన పంజాబీ అమ్మాయి నవనీత్‌ కౌర్‌ రాణా మహారాష్ట్రలోని అమరావతి నుంచి వరుసగా రెండోసారి తలపడుతున్నారు.
  • పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి భాజపా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ నటి, సిట్టింగ్‌ ఎంపీ లాకెట్‌ ఛటర్జీకి పోటీగా టీఎంసీ ప్రముఖ నటీమణి రచనా బెనర్జీని రంగంలోకి దింపింది. ఈమె ఇదివరకు తెలుగులో చాలా సినిమాలు చేశారు.
  • ఘటల్‌ నుంచి తృణమూల్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్‌ అధికారి అలియాస్‌ దేవ్‌ మూడోసారి రంగంలోకి దిగారు. ఆయనను అడ్డుకోవడానికి భాజపా ఖరగ్‌పుర్‌ టౌన్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన మరో సినీ నటుడు హిరణ్మయి ఛటోపాధ్యాయను బరిలోకి దింపింది.
  • తూటాలా పేలే డైలాగులతో షాట్‌గన్‌గా పేరు తెచ్చుకున్న సీనియర్‌ సినీ నటుడు, అసన్‌సోల్‌ సిట్టింగ్‌ ఎంపీ శతృఘ్న సిన్హా వరుసగా రెండోసారి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా తొలుత భోజ్‌పురి గాయకుడు, సినీ నటుడు పవన్‌సింగ్‌ను భాజపా నిలిపింది. మహిళలను కించపరిచేలా పాటలు పాడారన్న ఆరోపణలతో ఆయనను తప్పించింది. బర్దమాన్‌ దుర్గాపుర్‌ ఎంపీ ఎస్‌ఎస్‌ అహ్లూవాలియాకు ఇక్కడ టికెటిచ్చింది.  
  • నార్త్‌ ఈస్ట్‌ దిల్లీ నుంచి భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ భాజపా అభ్యర్థిగా వరుసగా మూడోసారి తలపడుతున్నారు. పార్టీ నాయకత్వం దిల్లీలోని ఏడుగురు సిట్టింగ్‌ ఎంపీల్లో ఆరుగుర్ని మార్చినా ఆయనను కొనసాగిస్తోంది.
  • ఉత్తర్‌ ప్రదేశ్‌లో మైనారిటీల ప్రాబల్యం అధికంగా ఉన్న ఆజంగఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి భోజ్‌పురి స్టార్‌ దినేష్‌లాల్‌ యాదవ్‌ వరుసగా రెండోసారి భాజపా తరఫున రంగంలోకి దిగారు. 2019లో ఇదే నియోజకర్గం నుంచి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌పై పోటీచేసి ఓడిపోయారు. అయితే అఖిలేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలకు మారడంతో 2022లో జరిగిన ఉప ఎన్నికలో దినేష్‌లాల్‌.. ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌పై గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు.
  • తమిళనాడులోని విరుదు నగర్‌ స్థానం నుంచి తెలుగు, తమిళ సీనియర్‌ నటి రాధిక భాజపా తరఫున, దివంగత నటుడు విజయకాంత్‌ కుమారుడు, నటుడు విజయ్‌ ప్రభాకర్‌ ఏఐఏడీఎంకే మద్దతుతో డీఎండీకే తరఫున తలపడుతున్నారు.
  • కేరళలోని త్రిశ్శూర్‌ నుంచి రాజ్యసభ సభ్యుడు, పోలీస్‌ చిత్రాలకు మారుపేరైన సీనియర్‌ మలయాళ నటుడు సురేశ్‌ గోపి భాజపా తరఫున బరిలో నిలిచారు.
  • సినీ నటుడు కృష్ణ కుమార్‌ కొల్లంలో యూడీఎఫ్‌ కూటమికి చెందిన సీనియర్‌ నేత ఎన్‌కే ప్రేమచంద్రన్‌, సీపీఎం నుంచి పోటీ చేస్తున్న సిటింగ్‌ ఎమ్మెల్యే, సినీ నటుడు ఎం.ముఖేశ్‌తో తలపడుతున్నారు.
  • ఒడిశాలోని బొలంగీర్‌ నుంచి ప్రముఖ ఒడియా నటుడు మనోజ్‌ మిశ్ర కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచారు.
  • తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ, తమిళ నటుడు విజయ్‌ వసంత్‌ వరుసగా రెండోసారి బరిలో దిగారు.
  • కడలూర్‌ నుంచి భాజపా మిత్రపక్షం పీఎంకే తరఫున సినీ నటుడు, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ తంగర్‌ బచన్‌ రంగంలోకి దిగారు.
  • కర్ణాటకలోని శివమొగ్గ నుంచి కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ సతీమణి గీతా శివరాజ్‌ కుమార్‌ పోటీ చేస్తున్నారు. ఆమె మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రను ఢీకొంటున్నారు.
  • పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి ఆప్‌ తరఫున నటుడు, కమెడియన్‌, గాయకుడు, నిర్మాత కరంజీత్‌ అనుమోల్‌, భాజపా తరఫున వాయవ్య దిల్లీ సిట్టింగ్‌ ఎంపీ, పంజాబీ జానపద, సినీ నేపథ్య గాయకుడు హన్స్‌రాజ్‌ హన్స్‌ తలపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img