icon icon icon
icon icon icon

తలో పార్టీలో తండ్రీతనయులు.. ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి

ఒడిశాలో తండ్రీతనయులు వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. వారు ఒక పార్టీలో ఉంటే.. కుమారులు ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలోకి దిగారు.

Updated : 16 Apr 2024 17:26 IST

ఒక చోట కాంగ్రెస్‌ నేత ఇద్దరు కుమారుల ఢీ

భువనేశ్వర్‌: ఒడిశాలో తండ్రీతనయులు వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. వారు ఒక పార్టీలో ఉంటే.. కుమారులు ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ నేతలైన సురేశ్‌ రౌత్రాయ్‌, చింతామణి ధ్యాన సామంత్రాయ్‌ తనయులు, భాజపా నేత బిజయ్‌ మహాపాత్ర్‌ కుమారుడు ఇలా ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు

సురేశ్‌ రౌత్రాయ్‌

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, జాటణీ ఎమ్మెల్యే సురేశ్‌ రౌత్రాయ్‌కు కాంగ్రెస్‌ పార్టీ షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. ఆయన తన కుమారుడు, భువనేశ్వర్‌ లోక్‌సభ స్థానం నుంచి బిజూ జనతాదళ్‌ (బిజద) తరఫున పోటీ చేస్తున్న మన్మథ రౌత్రాయ్‌ పక్షాన ప్రచారం చేస్తుండటమే దీనికి కారణం. 80ఏళ్ల సురేశ్‌ కాంగ్రెస్‌ తరఫున 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అనంతరం కుమారుడి తరఫున ప్రచారం చేస్తున్నారు. ‘అవును.. నా కుమారుడికి ఓటేయాలని నేను ప్రచారం చేస్తున్నా. ప్రజలు ఏం చేయాలని అడుగుతుంటే నేను అలా చెప్పక తప్పడం లేదు. నాపై ఏఐసీసీ, పీసీసీ ఏం చర్యలు తీసుకున్నా అంగీకరిస్తా. నేను చనిపోయే వరకూ కాంగ్రెస్‌ వాదిగానే ఉంటా’ అని సురేశ్‌ రౌత్రాయ్‌ స్పష్టం చేశారు. తాను విలువలకు కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు.


చింతామణి ధ్యాన సామంత్రాయ్‌

గంజాం జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్‌ చింతామణి ధ్యాన సామంత్రాయ్‌ పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు కాంగ్రెస్‌ నుంచి, మరొకరు భాజపా నుంచి పోటీ చేస్తున్నారు. కుమారులిద్దరు ప్రధాన ప్రత్యర్థులు కావడంతో ఎవరికి ఓటేయాలో ఆయన ప్రజలకు చెప్పలేకపోతున్నారు. తాను ప్రాతినిధ్యం వహించిన చికితీ అసెంబ్లీ నియోజకవర్గంలో చింతామణి చిన్న కుమారుడు మనోరంజన్‌కు భాజపా టికెటిచ్చింది. పెద్ద కుమారుడు రబీంద్రనాథ్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. అంతకుముందు చింతామణి ఇక్కడి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ‘మా నాన్న కాలం నుంచి నేను రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నా. అందుకే కాంగ్రెస్‌ పార్టీ నాకు టికెట్‌ ఇచ్చింది. ఈ పోటీ ఇద్దరు సోదరుల మధ్య కాదు. రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతోంది’ అని కాంగ్రెస్‌ అభ్యర్థి రబీంద్రనాథ్‌ తెలిపారు. 2014లో కాంగ్రెస్‌ తరఫున, 2019లో భాజపా తరఫున పోటీ చేసిన మనోరంజన్‌ ఓడిపోయారు. భాజపా మరోసారి ఆయనకు టికెట్‌ ఇచ్చింది. తాను రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నందునే పార్టీ తనకు టికెట్‌ ఇచ్చిందని ఆయన అంటున్నారు. కుటుంబంలో గొడవలు పెట్టేందుకే తన సోదరుడికి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చిందని మనోరంజన్‌ విమర్శించారు. ‘నాకు ఆరోగ్యం బాగాలేదు. నేను ఏ కుమారుడి తరఫునా ప్రచారం చేయడం లేదు. నేను ఎప్పటికీ కాంగ్రెస్‌ వాదినే. భాజపా సిద్ధాంతాలను వ్యతిరేకిస్తా’ అని 84ఏళ్ల చింతామణి వెల్లడించారు.


బిజయ్‌ మహాపాత్ర్‌

కేంద్రపాడా జిల్లాలో సీనియర్‌ భాజపా నేత, మాజీ మంత్రి, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను తీవ్రంగా వ్యతిరేకించే బిజయ్‌ మహాపాత్రదీ అదే పరిస్థితి. ఆయన కుమారుడు అరవింద్‌ మహాపాత్ర్‌ బిజూ జనతాదళ్‌ తరఫున పట్‌కురా నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం బిజయ్‌ రాజకీయాల్లో క్రియాశీలంగా లేరు. ఇప్పటిదాకా భాజపాలో ఉన్న ఆయన తన కుమారుడికి తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతునిస్తున్నారు. రెండు దశాబ్దాలపాటు బిజదను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన ఈసారి ఆ పార్టీకి ప్రచారం చేయాల్సి రావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img