icon icon icon
icon icon icon

దిగువ సభకు పెద్దల పోటీ!

ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న, ఇటీవలి వరకూ ఆ సభ సభ్యులుగా ఉన్న 10 మంది కేంద్రమంత్రులు ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు.

Updated : 16 Apr 2024 17:25 IST

ఎన్నికల సమరాంగణం.. బహుముఖ వ్యూహాల సమాహారం. సాధారణంగా రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రజాక్షేత్రంలో నిలిచి గెలిచే నేపథ్యం లేనివారిని రాజ్యసభకు పంపడం ఆనవాయితీ. అలా పెద్దలసభకు ప్రాతినిధ్యం వహించినవారు మళ్లీ లోక్‌సభ బరిలో నిలిచే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఈసారి.. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన/వహిస్తున్న వారిలో 10 మందిని లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దింపింది. కేంద్ర మంత్రులుగా కూడా పనిచేసిన వీరిలో సగం మంది తొలిసారిగా లోక్‌సభకు పోటీ పడుతుండడం విశేషం. మరోవైపు.. ఆ పార్టీ తరఫున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 9 మంది కేంద్ర మంత్రులకు సర్దుబాట్లు, ప్రయోగాల కారణంగా ఈసారి ఎన్నికల్లో టికెట్లు దక్కలేదు.

ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న, ఇటీవలి వరకూ ఆ సభ సభ్యులుగా ఉన్న 10 మంది కేంద్రమంత్రులు ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో ఏడుగురు కేబినెట్‌ మంత్రులుకాగా, ముగ్గురు సహాయ మంత్రులు. పార్టీలో బాగా పేరున్నవారు.. లోక్‌సభకు ఎన్నికవడమే మంచిదని ప్రధాని మోదీ భావించడంతో భాజపా తరఫున ఈ దఫా వీరందర్నీ సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపారు. వారి వివరాలివీ..


పీయూష్‌ గోయల్‌

ప్రస్తుతం రాజ్యసభాపక్ష నేత. తొలిసారి ముంబయి(ఉత్తర) స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈయన తల్లి చంద్రకాంత గోయల్‌ మహారాష్ట్ర నుంచి మూడుసార్లు భాజపా ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి వేద్‌ప్రకాశ్‌ గోయల్‌ 2001 నుంచి 2003 వరకు వాజ్‌పేయీ మంత్రివర్గంలో నౌకాయాన మంత్రిగా పనిచేశారు. పీయూష్‌ 2010లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి పెద్దల సభకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2028 జులై వరకు రాజ్యసభ పదవీకాలం ఉంది.


ధర్మేంద్ర ప్రధాన్‌

ఒడిశాకు చెందిన ఈయన మోదీ సర్కారులోని కీలక నేతల్లో ఒకరు. 2004-09 మధ్య లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. 2012 నుంచి 2024 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ నెల 2తో పదవీకాలం ముగియడంతో భాజపా నాయకత్వం ఈయన్ను లోక్‌సభ బరిలో నిలిపింది. ఈయన తండ్రి దేబేంద్ర ప్రధాన్‌ 1999 నుంచి 2004 వరకు వాజ్‌పేయీ మంత్రివర్గంలో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.  ప్రస్తుతం సంబల్‌పుర్‌ స్థానం నుంచి ధర్మేంద్ర పోటీ చేస్తున్నారు.


భూపేంద్ర యాదవ్‌

భాజపా ప్రధాన వ్యూహకర్తల్లో ఒకరు. రాజస్థాన్‌లోని అళ్వర్‌ నుంచి ప్రస్తుతం తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. 2000లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈయన.. 2010లో భాజపా జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2021లో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగిసింది.


వి.మురళీధరన్‌

2018 నుంచి ఇటీవలి వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు కేరళలోని అట్టింగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన 2010-15 మధ్య కేరళ భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో కోజికోడ్‌ లోక్‌సభ, 2016లో కళాకూటం అసెంబ్లీ స్థానాలకు పోటీచేసి ఓడిపోయారు.


ఎల్‌.మురుగన్‌

తమిళనాడు భాజపా మాజీ అధ్యక్షుడు. ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం తమిళనాడులోని నీలగిరీస్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎ.రాజా (డీఎంకే) రూపంలో బలమైన ప్రత్యర్థి ఉన్నారు. 2021లో ధర్మపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి డీఎంకే అభ్యర్థి చేతిలో 1,393 ఓట్ల తేడాతో ఓడిపోయారు.


జ్యోతిరాదిత్య సింధియా

రాజకుటుంబానికి చెందిన సింధియా రాజ్యసభ పదవీకాలం 2026 జూన్‌ వరకు ఉన్నప్పటికీ ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం గుణ నుంచి తొలిసారి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు.  2002లో జరిగిన ఉపఎన్నికలో గెలిచి మొదటిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ఈయన.. 2004, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున వరుసగా గెలుపొందారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి భాజపా అభ్యర్థి కృష్ణపాల్‌ యాదవ్‌ చేతిలో ఓడిపోయారు. తర్వాత కమలదళంలో చేరి 2020లో రాజ్యసభకు ఎన్నికై కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


సర్బానంద సోనోవాల్‌

ఈయన అస్సాం మాజీ ముఖ్యమంత్రి. రాజ్యసభ పదవీకాలం 2026 వరకూ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం దిబ్రూగఢ్‌ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. 2001లో ఎమ్మెల్యేగా అస్సాం గణపరిషత్‌ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఈయన.. 2004లో అదే పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో ఓడిపోయిన తర్వాత భాజపాలో చేరారు. 2014లో లోక్‌సభకు ఎన్నికై 2016 వరకు ప్రాతినిధ్యం వహించారు. 2016లో అస్సాంలో తొలిసారి భాజపా ప్రభుత్వం ఏర్పాటవడంతో ముఖ్యమంత్రిగా అయిదేళ్లు పనిచేశారు. 2021లో ఆ పదవి నుంచి వైదొలిగిన తర్వాత రాజ్యసభకు ఎన్నికై కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


పరుషోత్తమ్‌ రూపాలా

ఈయన గుజరాత్‌ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియడంతో రాజ్‌కోట్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. బ్రిటిష్‌ పాలకులకు లొంగిపోయారని, వారితో కుటుంబసంబంధాలు ఏర్పరుచుకున్నారని క్షత్రియ సామాజికవర్గంపై ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.


మన్‌సుఖ్‌ మాండవీయ

పార్లమెంటుకు సైకిల్‌పై వచ్చే మంత్రిగా ఈయనకు పేరుంది. ఇప్పుడు పోర్‌బందర్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. 2012, 2018ల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రధాని మోదీకి నమ్మకస్తుడిగా పేరుంది. మాండవీయ రాజ్యసభ పదవీకాలం ఈ నెల 2తో పూర్తయింది. 1991 నుంచి వరుసగా (2009లో మినహాయించి) భాజపా గెలుస్తూ వస్తున్న పోర్‌బందర్‌ను ఈయనకు సురక్షిత స్థానంగానే చెప్పొచ్చు.


రాజీవ్‌ చంద్రశేఖర్‌

ఈయన 2006 నుంచి వరుసగా మూడుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటిదాకా భాజపా ఒక్కసారి కూడా గెలవని తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల గోదాలో దిగారు. శశిథరూర్‌ (కాంగ్రెస్‌), పన్యన్‌ రవీంద్రన్‌ (సీపీఐ)ల రూపంలో అక్కడ బలమైన ప్రత్యర్థులు ఉన్నారు.


వారికి మొండిచేయి

లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 9 మంది కేంద్ర సహాయ మంత్రులకు భాజపా నాయకత్వం ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదు. వారి జాబితా ఇదీ..

  • అశ్వినీకుమార్‌ చౌబే, బక్సర్‌
  • జనరల్‌ వీకే సింగ్‌, గాజియాబాద్‌
  • దర్శన విక్రం జర్దోస్‌, సూరత్‌
  • మీనాక్షి లేఖి, కొత్త దిల్లీ
  • ఎ.నారాయణస్వామి, చిత్రదుర్గ
  • ప్రతిమా భౌమిక్‌, త్రిపుర వెస్ట్‌
  • రాజ్‌కుమార్‌ రంజన్‌సింగ్‌, ఇన్నర్‌ మణిపుర్‌
  • బిశ్వేశ్వర్‌ టుడు, మయూర్‌భంజ్‌
  • ముంజపారా మహేంద్రభాయ్‌, సురేంద్రనగర్‌

ఈనాడు, దిల్లీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img