icon icon icon
icon icon icon

ఈసారైనా అమృతం దక్కేనా?

గత రెండు పర్యాయాలుగా దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నా.. అక్కడ హస్తానిదే పైచేయి. భాజపా నుంచి హేమాహేమీలు బరిలోకి దిగుతున్నా విజయం కాంగ్రెస్‌దే.

Updated : 16 Apr 2024 17:29 IST

హేమాహేమీలకే దక్కని విజయం.. తరణ్‌జీత్‌ సొంతమయ్యేనా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత రెండు పర్యాయాలుగా దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నా.. అక్కడ హస్తానిదే పైచేయి. భాజపా నుంచి హేమాహేమీలు బరిలోకి దిగుతున్నా విజయం కాంగ్రెస్‌దే. అదే స్వర్ణ దేవాలయానికి నిలయమైన పంజాబ్‌లోని అమృత్‌సర్‌ లోక్‌సభ నియోజకవర్గం. అమెరికాలో భారత రాయబారిగా పని చేసిన తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూ ఈసారి భాజపా తరఫున ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌కు మంచి పట్టున్న ఈ స్థానంలో తరణ్‌జీత్‌ తీవ్రంగా పోరాడాల్సి ఉంటుంది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున దివంగత అరుణ్‌ జైట్లీ పోటీ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సిక్కుల అభిమానాన్ని చూరగొనేందుకు కాషాయ దళం హర్‌దీప్‌ సింగ్‌ పురీని ఈ స్థానం నుంచి బరిలోకి దింపింది. ఆయనా ఘోర పరాభవాన్ని చవి చూశారు.  స్థానిక కాంగ్రెస్‌ నేత గుర్జీత్‌ సింగ్‌ ఔజలా చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటీవల పార్లమెంటులో గందరగోళం చోటు చేసుకున్న సమయంలో ఔజలా పేరు బాగా వినిపించింది. గ్యాలరీ నుంచి కిందకు దూకిన ఇద్దరు నిందితులను ఆయన, మరో ఎంపీ పట్టుకుని అక్కడి సిబ్బందికి అప్పగించారు. రాజకీయ వర్గాల్లో ఆయనను ‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’ అని పిలుస్తారు.


మూలాలు ఇక్కడివే..

తనకు టికెట్‌ కేటాయించడానికి ముందు నుంచే అమృత్‌సర్‌లో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యేందుకు  తరణ్‌జీత్‌ ప్రయత్నిస్తున్నారు. స్థానికేతరుడని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఆయన పంజాబ్‌ మూలాలు కలిగిన వ్యక్తే. ఆయన పూర్వీకులు ఇక్కడే పుట్టి పెరిగారు. సిక్కుల మినీ పార్లమెంటుగా వ్యవహరించే శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) వ్యవస్థాపక సభ్యుల్లో తరణ్‌జీత్‌ తాత సర్దార్‌ తేజా సింగ్‌ సముంద్రి ఒకరు. ఆయన తండ్రి గురునానక్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా పని చేశారు.

ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన తరణ్‌జీత్‌ 1988లో ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు ఎంపికై ఉక్రెయిన్‌, శ్రీలంక, అమెరికాలో భారత రాయబారిగా సేవలందించారు. ఇటీవల భారత్‌, కెనడా మధ్య చోటుచేసుకున్న దౌత్య సంబంధమైన సమస్య పరిష్కారానికి విశేష కృషి చేశారు. అమృత్‌సర్‌లో విజయం సాధించాలంటే జాట్‌ సిక్కు వర్గానికి చెందిన తరణ్‌జీత్‌ సరైన వ్యక్తి అని భాజపా అధిష్ఠానం గట్టిగా నమ్మింది. అంతేకాకుండా ఆయన కుటుంబ నేపథ్యం, దార్శనికతే విజయం దిశగా అడుగులు వేయిస్తాయని స్థానిక నేతలు అంటున్నారు. ఈ స్థానానికి చివరి విడతలో జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img