icon icon icon
icon icon icon

Harish Rao: కాంగ్రెస్‌ పార్టీ రైతు వ్యతిరేకి.. మండిపడ్డ హరీశ్‌రావు

కాంగ్రెస్‌ పార్టీ రైతుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైతుబంధు ఆపాలని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయలేదా? అని ప్రశ్నించారు.

Updated : 27 Nov 2023 20:18 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ రైతుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. రైతుబంధు ఆపాలని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయలేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో (Telangana Assembly Elections) ఆయన మాట్లాడారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో రైతుబంధు ఆపేశారని విమర్శించారు. ఇక్కడ కూడా రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు.

‘‘కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలవగానే రైతుబంధు రద్దయ్యింది. తెలంగాణలోనూ అదే కుట్ర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులకు రైతుబంధు దక్కకూడదన్నదే కాంగ్రెస్‌ ఆలోచన. అందుకే అక్టోబర్‌ 23న కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే, రైతు బంధు కొత్తపథకం కాదని, ఇప్పటివరకు 11 సార్లు ఇచ్చామని, మరోసారి పంపిణీ చేసేందుకు అనుమతివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరితే.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. దీనికి భారాస, భాజపా, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని రేవంత్‌ ఆరోపించారు. పోలింగ్‌కు 4 రోజుల ముందు రైతుబంధు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రైతులపై ప్రేమే ఉంటే.. ఈసీ నిర్ణయాన్ని స్వాగతించొచ్చు కదా’’ అని హరీశ్‌ అన్నారు.

ఈసీ అనుమతిని రద్దు చేసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ మరోసారి ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి వాస్తవం కాదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతుల నోటి దగ్గరి ముద్దను లాక్కున్న పార్టీ కాంగ్రెస్‌ అని మండిపడ్డారు. ఈసీని రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేయడానికి ప్రయత్నించారని, ఈసీ అనుమతి రద్దు చేశాక.. రైతులపై రేవంత్‌ కపట ప్రేమ నటిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img