icon icon icon
icon icon icon

Telangana Election Results: భార్యాభర్తలు, మామా అల్లుళ్ల గెలుపు.. ఆ పార్టీ ఎంపీలంతా ఓటమి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర సంగతులు చోటుచేసుకున్నాయి. ఆ వివరాలు ఇవీ..

Updated : 04 Dec 2023 08:00 IST

హైదరాబాద్: తెలంగాణ తెచ్చిన పార్టీగా దాదాపు 10 ఏళ్ల పాటు భారాసకు అధికారం ఇచ్చిన ఓటర్లు.. ఈసారి స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన పార్టీగా హస్తం గుర్తుకు ఓటేశారు. రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు తలపడిన ఈ ఎన్నికల్లో(telangana election results) హంగ్‌కు తావు లేకుండా విస్పష్టమైన తీర్పు వెలువడింది. ఈ క్రమంలో కొందరు మంత్రులకు షాక్‌ తగలడమే కాదు.. మరికొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. 

భారత రాష్ట్ర సమితి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేశారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో బరిలో నిలిచారు. తమ సొంత స్థానాల్లో గెలుపొందిన వీరు రెండు స్థానాల్లోనూ ఓటమి చవిచూశారు. కామారెడ్డిలో స్థానిక అభ్యర్థి గెలుపొందారు. వీరిలో ఎవరు రెండు స్థానాల్లో గెలుపొందిన ఉప ఎన్నిక అనివార్యమయ్యేది. ఓటమితో ఉప ఎన్నిక తప్పింది.

  • 2018 ఎన్నికల తర్వాత మధ్యలో నాలుగు ఉప ఎన్నికలు జరిగాయి. దుబ్బాక, హుజూర్‌నగర్‌, మునుగోడు, నాగార్జున సాగర్‌. ఆయా ఉప ఎన్నికల్లో గెలుపొందిన వారు ఈసారి ఓటమి చవిచూడడం గమనార్హం.
  • ఈ సారి ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. మరికొందరు గెలుపొందినప్పటికీ.. మెజారిటీలు మాత్రం తగ్గాయి. 
  • ఈసారి ఎన్నికల్లో 30 ఏళ్లలోపు వయసు వారు ముగ్గురు గెలుపొందారు. మైనంపల్లి రోహిత్‌, చిట్టెం పర్ణికారెడ్డి, మామిడాల యశస్వినిరెడ్డి విజయం సాధించారు. ఈ ముగ్గురూ కాంగ్రెస్‌ నుంచే విజయం సాధించడం విశేషం.
  • భాజపాకు చెందిన ముగ్గురు ఎంపీలు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ముగ్గురికీ పరాభవం ఎదురైంది.
  • కాంగ్రెస్‌ ఎంపీలుగా ఉన్న రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచారు. ఈ ముగ్గురూ విజయం సాధించడం గమనార్హం.
  • స్పీకర్‌గా పనిచేసిన వారు ఓడిపోతారనే ఓ అపోహ ఉంది. ఈసారి భారాస అభ్యర్థి పోచారం శ్రీనివాస రెడ్డి విజయం సాధించి అపోహలను పటాపంచలు చేశారు. ప్రజలతో మమేకమై ఉండటం వల్లే తాను ఈ ఎన్నికల్లో గెలుపొందానని పోచారం చెప్పారు. 
  • మునుగోడులో సిట్టింగ్ స్థానాన్ని వీడిన రాజగోపాల్‌ రెడ్డికి ఉప ఎన్నికల్లో చేదు ఫలితం ఎదురైంది. తాజా ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆయన గెలుపొందడం విశేషం. 
  • ఈ ఎన్నికల్లో కోమటి రెడ్డి బ్రదర్స్ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు.
  • టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన భార్య పద్మావతి కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. భార్యాభర్తలిద్దరూ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
  • అసెంబ్లీ ఎన్నికల్లో మామా అల్లుళ్లు గెలుపొందారు. చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి ఇద్దరు భారాస టికెట్‌పై విజయం సాధించారు.
  • భాజపాను వీడి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన గడ్డం వివేక్‌, ఆయన సోదరుడు వినోద్‌ ఇద్దరూ ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలుపొందారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img