KCR: పదేళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లుంది?: కేసీఆర్‌

త్వరలో జరగనున్న ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వారి పార్టీల దృక్పథం, చరిత్ర చూడాలని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ కోరారు.

Updated : 27 Nov 2023 19:33 IST

షాద్‌నగర్‌: త్వరలో జరగనున్న ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వారి పార్టీల దృక్పథం, చరిత్ర చూడాలని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ కోరారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని పిలుపునిచ్చారు. రాయేదో.. రత్నమేదో చూసి ఓటేయాలన్నారు. షాద్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. 

‘‘మంచివాళ్లకు ఓటేస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. అందుబాటులో ఎవరుంటారు? నియోజకవర్గం కోసం ఎవరు పనిచేస్తారు? అనే విషయాలను ప్రజలు ఆలోచించాలి. 2004లో కాంగ్రెస్‌తో భారాస (నాటి తెరాస) పొత్తు పెట్టుకుంటే నాడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. 2005లో తెలంగాణ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ‘కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని దిగితే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఉన్న తెలంగాణను 1956లో ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అప్పుడు ఆకలి కేకలు తప్ప ఏమీ లేదు. ఇందిరమ్మ పాలన బాగుంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2కే కిలో బియ్యం ఎందుకిచ్చారు?పదేళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లుందో ప్రజలు గమనించాలి’’అని కేసీఆర్‌ అన్నారు.

ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి..

‘‘ఉన్న తెలంగాణను 1956లో ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణను ఆంధ్రలో కలపడం వల్ల 50 ఏళ్లు వెనక్కి పోయాం. ఏన్నో గోసలు పడ్డాం. గులాబీ జెండా పట్టి అందరం పోరాడితే 2004లో తెలంగాణ ప్రకటించారు. 2004లో ప్రకటించిన తెలంగాణను 2014 వరకు ఇవ్వలేదు. నేను తిరిగి ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నాక కాంగ్రెస్‌ పార్టీ దిగివచ్చింది. అలా సాధించుకున్న తెలంగాణను ఈ పదేళ్లు ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ అనేక రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి. అందుకే ఈసారి ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలి. మీరు వేసే ఓటు.. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

ఒకే విడతలో చేవెళ్లకు ‘దళితబంధు’..

రైతుబంధు ఆపాలని కాంగ్రెస్‌ గత నెలలో ఈసీకి ఫిర్యాదు చేసింది. నేను విజ్ఞప్తి చేస్తే.. ఈ నెల 28న రైతుబంధు ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్ నేతలు మరోసారి ఫిర్యాదు చేయడంతో రైతుబంధు చెల్లింపులను నిలుపుదల చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే, డిసెంబర్ 3 తర్వాత భారాస ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుంది. డిసెంబర్ 6 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేస్తాం. రైతుబంధు నిలిపివేస్తే కాంగ్రెస్‌కు ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. రైతులు ఈ విషయాన్ని ఆలోచించాలి. రైతుబంధు ఇప్పుడు కొత్తగా ఇచ్చేది కాదు.. ఇప్పటికే ఆరుసార్లు ఇచ్చాం. షాద్ నగర్ వరకు మెట్రోరైలును విస్తరిస్తాం. చేవెళ్లలో 111జీవో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాం. భారాస ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఒకే విడతలో చేవెళ్లకు దళితబంధు మంజూరు చేస్తాం’’ అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని