icon icon icon
icon icon icon

KTR: యాదాద్రి కంటే గొప్పగా భద్రాద్రిని అభివృద్ధి చేస్తాం: కేటీఆర్‌

చిన్న చిన్న అసంతృప్తులను పక్కనపెట్టి భారాస అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు.

Updated : 19 Nov 2023 15:27 IST

ఇల్లెందు: చిన్న చిన్న అసంతృప్తులను పక్కనపెట్టి భారాస అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం, ఇల్లెందులో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో 11 సార్లు గెలిచిన కాంగ్రెస్‌ 24 గంటల కరెంట్‌ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. భారాస అధికారంలోకి వచ్చిన తొలి విడతలోనే 24 గంటల విద్యుత్‌ ఇచ్చామన్నారు. తెలంగాణలో మరోసారి రాబోయేది భారాస ప్రభుత్వమేనని, మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

భద్రాచలం వచ్చినప్పుడు రాముడి పాదాలకు నమస్కరించాలనుకున్నానని, అయితే అధికారుల విజ్ఞప్తి మేరకు వెళ్లలేదని చెప్పారు. తొందర్లోనే మళ్లీ వచ్చి రామయ్య దర్శనం చేసుకుంటానని అన్నారు. ‘‘కారణాలు ఏమైనప్పటికీ భద్రాచలంలో ప్రజలు మాకు అవకాశం ఇవ్వలేదు. కానీ, ఈసారి మాత్రం కచ్చితంగా గులాబీ వనంలోకి భద్రాచలం చేరాలి. కారు గుర్తు అభ్యర్థి గెలవాలి. గత రెండు పర్యాయాలు భారాస ఎమ్మెల్యే అభ్యర్థి గెలవలేదు. దానివల్ల కొంత గ్యాప్ వచ్చింది,  ఈసారి పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించండి, వరదల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. యాదాద్రి కంటే గొప్పగా.. భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అడుగుతోంది. ఇప్పటివరకు 11 ఛాన్స్‌లు ఇచ్చారు.  కొంతమంది డబ్బు సంచులతో వస్తున్నారు. అలాంటి వాళ్ల మాటలు నమ్మొద్దు’’ అని కేటీఆర్‌ కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img