icon icon icon
icon icon icon

lok sabha election 2024: ఎడారి రాష్ట్రం ఎవరిపరం?

రాజకోటలకు, ఎడారి ప్రాంతానికి ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి కోట కట్టనుందనేది ఆసక్తికరంగా మారింది.

Published : 04 Apr 2024 15:59 IST

రాజస్థాన్‌లో 25 స్థానాలకు ఈ నెలలోనే పోలింగ్‌
6 చోట్ల హోరాహోరీ

జైపుర్‌: రాజకోటలకు, ఎడారి ప్రాంతానికి ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి కోట కట్టనుందనేది ఆసక్తికరంగా మారింది. గత రెండు ఎన్నికల్లో ఏకఛత్రాధిపత్యంగా క్లీన్‌స్వీప్‌ చేసిన భాజపాకు మళ్లీ పట్టం కట్టనుందా.. కాంగ్రెస్‌ ఆశలను నిలబెట్టనుందా.. అనేది ఈ నెలలో జరిగే పోలింగ్‌లో తేలనుంది. రాష్ట్రంలోని 25 స్థానాలకు ఈ నెలలోనే రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. వాటిలో ముఖ్యంగా 6 చోట్ల హోరాహోరీ పోరు సాగే అవకాశం కనిపిస్తోంది. చురు, కోటా-బూందీ, సీకర్‌, నాగౌర్‌, బాంస్‌వాఢా, బాఢ్‌మేర్‌ నియోజకవర్గాల్లో గట్టి పోటీ నెలకొంది.


భాజపా అన్నిచోట్లా పోటీ

గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం స్థానాలను గెలుచుకున్న భాజపా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. 25 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది.


22 చోట్ల కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ 22 స్థానాల్లో పోటీ చేస్తోంది. నాగౌర్‌, సీకర్‌ స్థానాలను ఆర్‌ఎల్‌పీ, సీపీఎంలకు కేటాయించింది. బాంస్‌వాఢా సీటును పెండింగ్‌లో పెట్టింది.


వలస నేతలకు టికెట్లు

బాఢ్‌మేర్‌లో వలస నేత ఉమ్మేదారామ్‌కు కాంగ్రెస్‌ టికెటిచ్చింది. ఆయనతోపాటు వలస వచ్చిన నేతలైన రాహుల్‌ కాస్వాంకు చురులో, కోటా-బూందీలో ప్రహ్లాద్‌ గుంజాల్‌లకూ కాంగ్రెస్‌ టికెట్లిచ్చింది. భాజపా కూడా బాంస్‌వాఢాలో వలస నేత మహేంద్రజీత్‌ సింగ్‌ మాలవీయను బరిలో నిలిపింది.


అమిత్‌ షా ప్రత్యేక దృష్టి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజస్థాన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సన్నద్ధతపై ఆయన సమీక్ష జరిపారు. నాగౌర్‌, చురుసహా పోటాపోటీగా ఉన్న 5 నియోజకవర్గాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. సీకర్‌లో రోడ్డు షో నిర్వహించారు. శెఖావటీ ప్రాంతంలోని సీకర్‌, ఝంఝునూ, చురు, నాగౌర్‌ల నుంచే ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఆయన జోధ్‌పుర్‌, పాలీ, జలోర్‌-సిరోహీ, బాఢ్‌మేర్‌లపై సమీక్ష జరిపారు.


పొత్తుల్లేకుండానే..

2014, 2019 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 స్థానాలనూ భాజపా కూటమి గెలుచుకుంది. అప్పట్లో పొత్తుల్లో భాగంగా ఒక సీటును హనుమాన్‌ బేనీవాల్‌ నేతృత్వంలోని ఆర్‌ఎల్‌పీకి ఇచ్చింది. ఈసారి భాజపా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. దీంతో బేనీవాల్‌.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. నాగౌర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క లోక్‌సభ సీటునూ గెలుచుకోలేకపోయింది.


నాగౌర్‌

జాట్‌ల ప్రాబల్యమున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ జ్యోతి మిర్ధా ఈసారి భాజపా తరఫున బరిలో నిలిచారు. ఆయన కూటమి అభ్యర్థి, ఆర్‌ఎల్‌పీ నేత హనుమాన్‌ బేనీవాల్‌ను ఎదుర్కోనున్నారు. 2019లోనూ వారిద్దరే పోటీపడ్డారు. కాకపోతే కాంగ్రెస్‌ నుంచి మిర్ధా, భాజపా కూటమి నుంచి బేనీవాల్‌ పోటీ చేశారు. బేనీవాల్‌ గెలిచారు. 2023లో భాజపాలో చేరిన మిర్ధా నాగౌర్‌ అసెంబ్లీ సీటులో పోటీ చేశారు. ఆయన తన బంధువు, కాంగ్రెస్‌ అభ్యర్థి హరేంద్ర మిర్ధా చేతిలో ఓడిపోయారు.


బాఢ్‌మేర్‌

రాజస్థాన్‌ పశ్చిమ ప్రాంతంలో ఉండే బాఢ్‌మేర్‌లోనూ ఆసక్తికర పోరు సాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్‌.. ఉమ్మేదారామ్‌కు టికెటిచ్చింది. ఆయన ఆర్‌ఎల్‌పీ నుంచి వచ్చారు. ఆయన భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి కైలాశ్‌ చౌధరిని ఢీకొననున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే, యువ నేత రవీంద్ర భాటీ పోటీ చేస్తున్నారు. భాజపా రెబల్‌గా ఈ ప్రాంతంలో భాటీ ప్రాచుర్యం పొందారు. విద్యార్థుల హక్కులపై పోరాడే నేతగా గుర్తింపు పొందారు. ఆయన సభలకు జనం భారీగా తరలివస్తున్నారు.


బాంస్‌వాఢా

దక్షిణ రాజస్థాన్‌లోని గిరిజన ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం బాంస్‌వాఢా. ఈసారి భాజపా ఇక్కడ కాంగ్రెస్‌ మాజీ నేత, గిరిజనుల్లో పేరున్న మహేంద్రజీత్‌ సింగ్‌ మాలవీయను బరిలో నిలిపింది. ఈ ప్రాంతంలో పట్టున్న భారత్‌ ఆదివాసీ పార్టీతో (బీఏపీ) పొత్తుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. బీఏపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ రోట్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆయనకే కాంగ్రెస్‌ మద్దతు పలికే అవకాశముంది.


చురులో..

భాజపాలో అంతర్గత విభేదాలతో ఆ పార్టీ చురు నియోజకవర్గ ఎంపీ రాహుల్‌ కాస్వాం కాంగ్రెస్‌లో చేరి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. దీంతో భాజపా పారా ఒలింపియన్‌ దేవేంద్ర ఝాంఝరియాను బరిలో నిలిపింది. ఉత్తర రాజస్థాన్‌లో ఉండే చురులో జాట్‌ల ప్రాబల్యం అధికం. పోటీపడుతున్న ఇద్దరు అభ్యర్థులూ ఆ వర్గానికి చెందినవారే. చురు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 8 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. అందులో ఐదింటిని కాంగ్రెస్‌ గెలుచుకుంది. భాజపా రెండు చోట్ల, బీఎస్పీ ఒక చోట గెలిచాయి. గత రెండు ఎన్నికల్లో మోదీ వేవ్‌లో కాస్వాం గెలిచారు. ఈసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న ఆయన అసెంబ్లీ ఎన్నికల బలాన్ని వినియోగించుకుంటున్నారు.


సీకర్‌

ఇక్కడ సీపీఎం మాజీ ఎమ్మెల్యే అమరారామ్‌ కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భాజపా తరఫున రెండు సార్లు ఎంపీగా పని చేసిన స్వామీ సుమేధానంద్‌ బరిలో నిలిచారు. పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ డోటాస్రా అసెంబ్లీ నియోజకవర్గమైన లక్ష్మణ్‌గఢ్‌ దీని పరిధిలోనే ఉంది.


కోటా-బూందీ

హఢోతీ ప్రాంతంలోని ఈ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున స్పీకర్‌ ఓం బిర్లా పోటీ చేస్తున్నారు. ఆయనపై భాజపా నుంచి వచ్చిన నేత ప్రహ్లాద్‌ గుంజాల్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దించింది. మాజీ ఎమ్మెల్యే అయిన గుంజాల్‌.. మాజీ సీఎం వసుంధర రాజెకు అత్యంత సన్నిహితుడు. ఆయన రెండు సార్లు ఎంపీ అయిన ఓం బిర్లాకు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు.


19న తొలి విడత పోలింగ్‌ జరిగేవి

 గంగానగర్‌, బీకనేర్‌, చురు, ఝుంఝునూ, సీకర్‌, జైపుర్‌ రూరల్‌, జైపుర్‌, అలవర్‌, భరత్‌పుర్‌, కరౌలీ-ధోల్‌పుర్‌, దౌసా, నాగౌర్‌.


26న రెండో విడత పోలింగ్‌ జరిగేవి

 టోంక్‌-సవాయీ మాధోపుర్‌, అజ్‌మేర్‌, పాలీ, జోధ్‌పుర్‌, బాఢ్‌మేర్‌, జలోర్‌, ఉదయ్‌పుర్‌, బాంస్‌వాఢా, చిత్తోర్‌గఢ్‌, రాజ్‌సమంద్‌, భిల్వారా, కోటా, ఝాలావాఢ్‌ బారా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని