icon icon icon
icon icon icon

Assembly Polls: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ముగిసిన పోలింగ్‌

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.

Updated : 17 Nov 2023 18:37 IST

(ఓటు వేసిన అనంతరం సిరాతో ఉన్న వేలిని చూపిస్తున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌)

Assembly Elections| ఇంటర్నెట్‌ డెస్క్‌:  మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్‌లో సాయంత్రం 5గంటల వరకు 71.16శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఛత్తీస్‌గఢ్‌ (రెండో దశ)లో 67.70శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్‌ సమయం ముగిసే సమయానికి ఓటు కోసం క్యూలైన్‌లో ఉన్నవారికి అవకాశం కల్పించడంతో పోలింగ్‌ శాతం మరింతగా పెరగనుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌, భాజపా మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఆప్‌ సహా ఇతర పార్టీలు బరిలో ఉన్నప్పటికీ అంత ప్రభావంచూపే పరిస్థితిలో లేవు.

కుటుంబంతో కలిసి వచ్చి ఓటేసిన సీఎం చౌహాన్‌

మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 నియోజకవర్గాల్లో 2533 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ 64,626 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే,  కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌ వర్గియ, మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రాతో పాటు పలువురు ప్రముఖులు పోలింగ్‌ కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు పీసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్‌ ఛింద్వాడాలో తన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో  భాజపా మద్యం, డబ్బులు పంపిణీ పెద్ద ఎత్తున పంపిణీ చేసిందని ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద వీడియో ఆధారాలు ఉన్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో నక్సల్‌ ప్రభావిత జిల్లాల్లో బాలాఘాట్‌, మండ్ల, దిండోరి జిల్లాల్లో మధ్యాహ్నం 3గంటలకే పోలింగ్‌ నిర్వహించగా.. మిగతా అన్ని చోట్ల సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది.

ఎన్నికలు ఏకపక్షమే.. 75 సీట్లు గెలుస్తాం.. బఘేల్‌

మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7న  తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్‌ జరగ్గా..  మిగిలిన 70 స్థానాలకు శుక్రవారం రెండో దశ పోలింగ్‌ నేటితో ముగిసింది. 22 జిల్లాల పరిధిలో 70 స్థానాలకు 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారులు మొత్తం 18,833 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ విశ్వాసంతో ఉంది. 75 సీట్లకు పైగా సాధించడమే తమ టార్గెట్‌ అని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ అన్నారు. కుర్ది గ్రామంలో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  తదుపరి సీఎం ఎవరో పార్టీ హైకమాండే నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ ఎన్నికలు వన్‌ సైడేనని.. తమకు పోటీయే లేదన్నారు. మరోవైపు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌ సావో బిలాస్‌పుర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు మార్పు కోరుకొంటున్నారని.. అందుకనుగుణంగానే ఓటు వేస్తారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img