icon icon icon
icon icon icon

Assembly Election Results: మూడు రాష్ట్రాల్లో భాజపా జోరు.. ట్వీట్ చేసిన మోదీ

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. ట్విటర్ వేదికగా ఆ రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

Updated : 03 Dec 2023 17:47 IST

దిల్లీ: ఆదివారం వెలువడుతోన్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఈ తీర్పుపై ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. (Assembly Election Results)

‘దేశ ప్రజలు సుపరిపాలన, అభివృద్ధిపైనే విశ్వాసం ఉంచుతారని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాల వెల్లడిచేస్తున్నాయి. భాజపాపై నమ్మకం ఉంచిన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, యువఓటర్లకు నా కృతజ్ఞతలు. మీ సంక్షేమం కోసం మేం చేస్తోన్న పనిని కొనసాగిస్తామని హమీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భాజపా అభివృద్ధి కార్యక్రమాలను, పేదల సంక్షేమ పథకాలను మీరు ప్రజల్లోకి తీసుకెళ్లిన తీరు అభినందనీయం. అభివృద్ధి చెందిన భారతాన్ని సృష్టించే లక్ష్యంతో మన పయనాన్ని కొనసాగిస్తున్నాం. ఈ ప్రయాణంలో మనం ఆగిపోకూడదు. అలసిపోకూడదు. ఈ దిశగా ఈ రోజు మనం ఒక అడుగు వేశాం’ అని మోదీ ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకానికి నిదర్శనం: షా

నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు.‘‘ బుజ్జగింపు, కుల, కుటుంబ రాజకీయాలను నవ భారతం అంగీకరించదు. ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజలు ఓటేస్తారనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం’’ అని అమిత్‌ షా అన్నారు. మధ్యప్రదేశ్‌లో భాజపా డబుల్‌ ఇంజిన్‌  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలనకు రాష్ట్ర ప్రజలు మద్దతు తెలిపి, గొప్ప విజయాన్ని అందించారని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని అమిత్‌ షా పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన, పేద, రైతు సోదరసోదరీమణులు ప్రధాని మోదీపై విశ్వాసంతో భాజపాకు సంపూర్ణ మెజార్టీని అందించారని తెలిపారు. తెలంగాణ ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు చెబుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో భాజపా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img