icon icon icon
icon icon icon

Janasena: ‘ఇదే నా ఇజం.. హ్యూమనిజం’: పవన్‌ కల్యాణ్‌

తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘ఇదే నా ఇజం.. హ్యూమనిజం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated : 23 Nov 2023 15:20 IST

కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘ఇదే నా ఇజం.. హ్యూమనిజం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘ నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులనే తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో భాజపాతో కలిసి ఎన్నికల బరిలో నిలిచినట్లు గుర్తు చేశారు. కొత్తగూడెం జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో భాజపా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరముందని చెప్పారు.

భాజపా పోటీ చేస్తున్న స్థానాల్లో జనసైనికులు మద్దతివ్వాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని, దాని కోసం భారాస, కాంగ్రెస్‌, భాజపా, వామపక్షాలు కష్టపడ్డాయని అన్నారు. ‘‘ తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు ఇచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నా. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న యువతకు జనసేన అండగా నిలబడుతుంది’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

ఫ్లోరోసిస్‌ సమస్య చూసి చలించిపోయా

సూర్యాపేట: జనసేన పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం నల్గొండ జిల్లా అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సూర్యాపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్‌ పాల్గొన్నారు. ‘‘నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ సమస్య చూసి చలించిపోయాను. ఫ్లోరోసిస్‌ బాధితులకు మంచినీరు అందించకపోవడం బాధ కలిగించింది. తెలంగాణ యువత దగా పడిందని భావించి.. వారి పక్షాన నిలబడేందుకు వచ్చాను. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అందరిని సమానంగా చూసే నేత ప్రధాని మోదీ’’ అని పవన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img