icon icon icon
icon icon icon

Revanth reddy: కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకోవచ్చు: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఈరోజు నుంచే సంబరాలు చేసుకోవచ్చని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated : 30 Nov 2023 20:41 IST

కామారెడ్డి: కాంగ్రెస్‌ (Congress) పార్టీ శ్రేణులు ఈరోజు నుంచే సంబరాలు చేసుకోవచ్చని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (Telangana Assembly Elections 2023) ముగిసిన తర్వాత కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేతలతో కలిసిమాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ చైతన్యవంతమైనదని కామారెడ్డి ప్రజలు నిరూపించారన్నారు. ఓటమి ఖాయమని తెలిసినప్పుడల్లా కేసీఆర్‌ నియోజకవర్గం మార్చారని విమర్శించారు. భారాసకు 25 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాదన్నారు.

‘‘డిసెంబరు 3కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆరోజే శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారు. శ్రీకాంతాచారి త్యాగంతో దేశమంతా ఉలిక్కిపడింది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. నవంబరు 29న మొదలైన ఎన్నికల కార్యాచరణ డిసెంబరు 3న ముగియనుంది. డిసెంబరు 3న దొరల తెలంగాణ అంతమవుతుందని చెప్పాం. చాలా మంది మేం చెప్పింది నమ్మలేదు. కానీ, తెలంగాణ ప్రజల చైతన్యంపై మాకు నమ్మకం ఉంది.  తెలంగాణకు పట్టిన పదేళ్ల పీడ తొలగిపోనుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls) అన్నీ కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. గతంలో పోలింగ్‌ ముగియగానే కేసీఆర్‌ మీడియా ముందుకు వచ్చేవారు. ఎన్నికల ఫలితాలు వారికి అనుకూలంగా లేవని భారాస అధినేత కేసీఆర్‌ మీడియా ముందుకు కూడా రాలేదు. ఆ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ప్రజలంటే వారికి చిన్నచూపు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమే. కాంగ్రెస్‌ పార్టీ పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయాల్లో విపక్షాల అభిప్రాయాలకు విలువ ఉంటుంది. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా కేసీఆర్‌ వ్యవహరించారు. ఆయన వలే నియంతృత్వంగా కాంగ్రెస్‌ నేతలు ఉండరు. అధిష్ఠానం సూచన ప్రకారం సీఎల్పీ సమావేశం నిర్వహిస్తాం. సీఎల్పీ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుంది. పార్టీలో చర్చించి ప్రభుత్వ ఏర్పాటు తేదీని నిర్ణయిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img