icon icon icon
icon icon icon

Assembly polls: ఛత్తీస్‌గఢ్‌ పోరు.. విజేతను నిర్ణయించే ‘బిలాస్‌పుర్‌ బెల్ట్‌’!

ఛత్తీస్‌గఢ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 17న పోలింగ్‌ (Assembly Elections) జరగనున్న నేపథ్యంలో అక్కడి బిలాస్‌పుర్‌ డివిజన్‌పైనే (Bilaspur Belt) అన్ని పార్టీల కళ్లు కేంద్రీకృతమయ్యాయి.

Published : 16 Nov 2023 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రెండోదశ పోలింగ్‌కు (Assembly Elections) సిద్ధమైన ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 17న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో బిలాస్‌పుర్‌ డివిజన్‌పైనే (Bilaspur Belt) అన్ని పార్టీల కళ్లు కేంద్రీకృతమయ్యాయి. రాష్ట్రంలో (Chhattisgarh polls) మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా.. ఇందులో 25వరకు ఈ డివిజన్‌ పరిధిలోనే ఉండటం గమనార్హం. రాష్ట్ర రాజకీయ వేదికపై ‘విజేత’ను నిర్ణయించే ఈ బెల్ట్‌పైనే ప్రధాన రాజకీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో ఐదు పరిపాలనా డివిజన్లు ఉండగా.. అందులో బిలాస్‌పుర్‌ డివిజన్‌ సెంట్రల్‌ రీజియన్‌లో ఉంది. ఈ బెల్టు పరిధిలోనే అత్యధికంగా 25 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈసారి ఎన్నికల్లో విజేతను నిర్ణయించడంలో ఇవి కీలక పాత్రను పోషించనున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో 68చోట్ల ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌.. ఈ డివిజన్‌ను మాత్రం స్వీప్‌ చేయలేకపోయింది. కేవలం 15 స్థానాలకే పరిమితమైన భాజపా మాత్రం.. ఈ ఒక్క డివిజన్‌లోనే ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్పీ రెండు, దివంగత అజిత్‌ జోగి స్థాపించిన జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) మూడు స్థానాల్లో విజయం సాధించింది. గతంలో ఈ డివిజన్‌లో 24 స్థానాలు ఉండగా కాంగ్రెస్‌ 12 స్థానాల్లో విజయం సాధించింది. తాజాగా మరో డివిజన్‌కు చెందిన సీట్‌ను బిలాస్‌పుర్‌ డివిజన్‌లో కలపడంతో ఇక్కడ సీట్ల సంఖ్య 25కు పెరిగింది.

అగ్రనేతలు రంగంలోకి..

ఈ బెల్టులో ఉన్న 25 నియోజకవర్గాలు ఎనిమిది జిల్లాల పరిధిలోకి వస్తాయి. ఇందులో ఐదు అసెంబ్లీ స్థానాలు ఎస్టీ, మరో ఐదు ఎస్సీ రిజర్వు స్థానాలుగా ఉన్నాయి. ఎన్నికల్లో మెజార్టీ మార్కును సాధించడంలో దోహదం చేసే ఈ డివిజన్‌పైనే ప్రధాన పార్టీలు కన్నేశాయి. రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేసిన భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు తమ అగ్రనేతలను రంగంలోకి దింపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకా గాంధీలు ముమ్మర ప్రచారం చేశారు. మరోవైపు బీఎస్పీ మాత్రం గోండ్వానా గణతంత్ర పార్టీ (జీజీపీ)తో కలిపి పోటీ చేస్తుండగా.. అటు ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా బరిలో నిలిచింది. జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) కూడా పలుచోట్ల పోటీ ఇవ్వనుంది.

విజయంపై ధీమా..

ఈసారి ఈ డివిజన్‌ నుంచి 20 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తామని అంతర్గత సర్వేల్లో తేలినట్లు బిలాస్‌పుర్‌ ఎంపీ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అరుణ్‌ సావో పేర్కొన్నారు. ఇక్కడి లోమ్రీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్న ఆయన.. ఈ డివిజన్‌లో తాము సీనియర్లతోపాటు కొత్తవారిని బరిలో దించామన్నారు. జంజ్‌గిర్‌-చాంపా నుంచి విపక్ష నేత నారాయణ్‌ చందేల్‌ పోటీ చేస్తుండగా.. మాజీ ఐఏఎస్‌ అధికారి ఓపీ చౌధరీ రాయ్‌గఢ్‌ స్థానం నుంచి బరిలో ఉన్నారు. వీరితోపాటు భాజపా సీనియర్‌ నేత దిలీప్‌సింగ్‌ జుదేవ్‌ కుటుంబం నుంచి ఇద్దరు నేతలు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అధికారానికి చేరువ చేయడంలో కీలకంగా ఉన్న ఈ డివిజన్‌లో క్రితం ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు రాలేదని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో ముమ్మర ప్రచారం చేయించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

రైతులపై దృష్టి..

వ్యవసాయ ఆధారిత కేంద్రంగా బిలాస్‌పుర్‌ ఉంది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వరికి మద్దతు ధర కల్పిస్తోంది. ఎన్‌వైఏవై పథకం కింద క్వింటాలుకు రూ.2600 ధరతో ధాన్యం సేకరిస్తుండగా.. మళ్లీ అధికారంలోకి వచ్చాక దీన్ని రూ.3200 పెంచుతామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది. దీంతోపాటు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అటు ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ఛరిష్మా కూడా కాంగ్రెస్‌ పార్టీకి కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు.

ఈ డివిజన్‌లో ద్విముఖ పోరు ఉంటుందని భాజపా, కాంగ్రెస్‌లు పేర్కొంటున్నప్పటికీ.. జేసీసీ, బీఎస్పీ పార్టీల ప్రభావం కూడా ఉంటుందని అంచనా. అయితే, జేసీసీకి చెందిన 95శాతం మంది నేతలు తమ పార్టీలో చేరిపోయారని కాంగ్రెస్‌ నేత, బిలాస్‌పుర్‌ ఎమ్మెల్యే శైలేష్‌ పాండే పేర్కొన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ చరణ్‌దాస్‌ మహంత్‌, రాష్ట్ర మంత్రులు ఉమేశ్‌ పటేల్‌, జైసింగ్‌ అగర్వాల్‌ వంటి అధికార పార్టీ నేతలు పోటీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img