icon icon icon
icon icon icon

Telangana Elections: ఓటుకు ముందు ఏమైనా సందేహాలా? సమాధానాలివిగో..!

ఓటేయని పౌరులు వ్యవస్థలో అలుసైపోతారు. చివరికి ఓడిపోతారు. అందుకే గురువారం పోలింగ్‌ కేంద్రానికి వెళ్లండి.. మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి.

Updated : 29 Nov 2023 17:08 IST

ఓటు... ఇందులో అక్షరాలు రెండే అయినా... ప్రజాస్వామ్యంలో వాటి విలువ అమూల్యం. మెరుగైన పాలనకు బాటలు వేసేది... పౌరుల బంగారు భవితను నిర్దేశించేది ఓటే. వ్యవస్థలో మార్పునకు నాంది పలికేది... వ్యక్తి అస్తిత్వానికి గుర్తింపునిచ్చేదీ ఓటే. మనం ఒక్కరమే వేయకుంటే ఏమవుతుందిలే అనుకుంటే పొరపాటే. ఒక్క ఓటే ప్రభుత్వాలను మారుస్తుందన్న విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది. ఓటేయని పౌరులు వ్యవస్థలో అలుసైపోతారు. చివరికి ఓడిపోతారు. అందుకే గురువారం పోలింగ్‌ కేంద్రానికి వెళ్లండి. మెరుగైన సమాజ నిర్మాణానికి మేలిమిదారులు పరచండి. ఓటుకు ముందు కొందరికి ఎన్నో సందేహాలు... వాటికి సమాధానాలివిగో...!

ఓటరు జాబితాలో పేరు లేకుంటే.. ఓటేయలేనా?

ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటర్ల జాబితా రూపొందిస్తారు. అందులో పేరు లేకుంటే ఓటు వేయడం సాధ్యం కాదు. ఇలాంటి వారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక.. కొత్తగా ఓటుకోసం ఫారమ్‌ 6 దరఖాస్తు చేసుకోవాలి.

ఓటు వచ్చింది. కార్డు రాలేదు. ఓటరు సమాచారం స్లిప్పును ఎవరూ ఇవ్వలేదు. ఓటు వేయవచ్చా?

మీకు ఓటు హక్కు వస్తే.. ఆన్‌లైన్‌లో ఓటరు ఫొటో గుర్తింపుకార్డు (ఈ-ఎపిక్‌)ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఎన్నికల సంఘం నిర్ధారించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపి ఓటు వేయవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకున్న ఈ-ఎపిక్‌ కార్డును ఓటు వేసేందుకు ధ్రువీకరణ పత్రంగా ఎన్నికల సంఘం ఆమోదించలేదు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో మీ పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

అమ్మానాన్నలకు 80 ఏళ్లు దాటాయి. ఇంటికి వచ్చి వారితో ఓట్లు వేయించుకొని వెళతారా?

ఆ గడువు ముగిసింది. రాష్ట్రంలో ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న సుమారు 27 వేల మంది వయోవృద్ధులు ఈ ఎన్నికల్లో ఇంటివద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు. చేసుకోని వారు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాల్సిందే.

జాబితాలో పేరుంది. కానీ ఓటరు కార్డు లేదు. ఓటు వేయడానికి ఏమి తీసుకెళ్లాలి?

ఓటరు కార్డు లేకపోతే ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్‌, ఫొటోతో ఉన్న బ్యాంకు పాస్‌బుక్‌, ఉపాధి హామీ పథకం కార్డు, కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, ఫొటోతో కూడిన పింఛను పత్రం, సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన గుర్తింపు కార్డు, ఎన్‌పీఆర్‌ కింద ఆర్బీఐ జారీ చేసిన గుర్తింపు కార్డు. వీటిలో ఏదో ఒకటి చూపి ఓటువేయవచ్చు.

గత ఎన్నికల్లో ఓటు వేసినా ఈసారి ఎవరూ ఓటరు స్లిప్‌ ఇవ్వలేదు. ఓటుందో లేదో ఎలా తెలుసుకోవాలి?

 https://electoralsearch.eci.gov.in/ లేదా https://eci.gov.in లేదా ceotelangana.nic.in లేదా voterhelplineApp వీటిలో ఏదోఒక దాని ద్వారా పరిశీలించుకోవచ్చు. పోలింగ్‌ బూత్‌లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.  

ఎన్నికల వేళ ఎవరైనా అక్రమాలకు పాల్పడుతుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. 100 నంబరుకు, ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన 1950 హెల్ప్‌లైన్‌ నంబరుకు ఫోన్‌చేసి చెప్పవచ్చు. సి-విజిల్‌ యాప్‌ ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చు.

గత ఎన్నికల్లో వెళ్లేసరికే ఎవరో నా ఓటు వేశారు. ఈసారీ అలా జరిగితే ఏం చేయాలి?

పోలింగ్‌ కేంద్రంలోని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి ఛాలెంజ్‌ ఓటు కోరవచ్చు. అధికారులు నిర్ధారించుకుని బ్యాలెట్‌ పత్రం ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ ఓటును ప్రత్యేకంగా నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తరవాత విచారణ నిర్వహిస్తారు.

ఎలాంటి గుర్తింపు కార్డు లేదు. అది చూపించకుంటే ఓటు వేయనివ్వరా?

ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి లేకుంటే ఓటు వేసేందుకు అనుమతించరు.

ఊర్లో ఓటుంది. హైదరాబాద్‌లోనూ ఉంది. ఉదయం హైదరాబాద్‌లో వేసి.. సాయంత్రంలోపు ఊరికి వెళ్లి అక్కడ వేయవచ్చా? అంగీకరిస్తారా?

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒకటికి మించి ఓటు ఉండటం నేరం. పొరపాటున ఓటు ఉన్నా ఒకటికి మించి ఓటు వేయడమూ నేరమే. ఒక్క ప్రాంతంలోనే ఓటు హక్కు వినియోగించుకోవాలి.

ఓటు వేసినట్లు ఏదైనా రసీదు ఇస్తారా?

అలాంటి అవకాశం లేదు. ఓటు వేసినట్లు చూపుడు వేలిపై వెంటనే చెరిగిపోని ఇంకుతో వేసే గుర్తే ప్రామాణికం.

గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంటున్నాం. ఓటరు కార్డులు ఉన్నాయి. స్లిప్పులు అందలేదు. ఓటరు కార్డులను తీసుకుని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లవచ్చా? అక్కడ ఏజెంట్లు  గుర్తు పట్టకుంటే ఏం చేయాలి?

ఓటర్ల జాబితాలో పేరు ఉండటమే ప్రామాణికం. ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. మీరు చూపించే గుర్తింపు కార్డులో ఫొటోను, ఓటరు కార్డులోని ఫొటోను అధికారులు సరిపోల్చుకుంటారు.

పొరపాటున ఈవీఎంలో ఒకే గుర్తుపై రెండుసార్లు నొక్కితే ఓటు పడుతుందా?

తొలిసారి నొక్కిన గుర్తుపైనే ఓటు పడుతుంది. రెండో దఫా బటన్‌ నొక్కినా పనిచేయదు. బ్యాలెట్‌ యూనిట్‌ ఆటోమేటిక్‌గా లాక్‌ అవుతుంది.


మనకు ఉత్తమ సేవలందించేందుకు అన్నివిధాలా అర్హులైన వ్యక్తులను ఎన్నుకోవడానికి ఇదే అనువైన సమయం. ఎలాంటి ప్రలోభాలకు ప్రభావితం కావద్దు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆత్మ పరిశీలనతో నిర్ణయం తీసుకోవాలి.

జస్టిస్‌ కె.శరత్‌, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి


మనదేశం 2030 నాటికి ఎనిమిది ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారగల సామర్థ్యాన్ని కలిగుంది. ఇది సాకారం కావాలంటే... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఉపాధి కల్పన, తయారీ, సెమీకండక్టర్‌ నైపుణ్యం, వ్యవసాయ పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన, విద్య మొదలైన వాటిలో తెలంగాణ సహా ప్రతి రాష్ట్రం పురోగమించాలి. అధికారంలో సరైన ప్రభుత్వాన్ని కలిగి ఉండటం ఒక సంపూర్ణ అవసరం. అందుకే ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవడం తప్పనిసరి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లోని ఉద్యోగులంతా ఎన్నికల్లో పాల్గొనాలి.

వి.రాజన్న, సీనియర్‌ ఉపాధ్యక్షుడు, టీసీఎస్‌


మన భవిష్యత్తును నిర్ణయించేది మన ఓటే. బాగా ఆలోచించి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నా. గురువారం జైపుర్‌లో మరో కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ ఓటేసేందుకు గురువారం హైదరాబాద్‌ వస్తున్నా.

- పుల్లెల గోపీచంద్‌, బ్యాడ్మింటన్‌ దిగ్గజం


అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ఓటు వేస్తామో... అప్పుడే రాష్ట్రమైనా, దేశమైనా నిజమైన ప్రగతిని సాధిస్తుంది. నా ఓటు గచ్చిబౌలిలో ఉంది. 29న వైజాగ్‌ వెళుతున్నా... 30న ఉదయం కల్లా హైదరాబాద్‌కు వచ్చి.. ఓటు వేస్తా.

నాని, సినీ నటుడు


మన డబ్బులను భద్రంగా దాచే, పెట్టుబడులను రెట్టింపు చేసే ఉత్తమ బ్యాంకును ఎలాగైతే ఎంచుకుంటామో అదేవిధంగా సరైన నాయకుడినే ఎంచుకోవాలి. మనం చెల్లించే పన్నులను అవినీతికి ఆస్కారం లేకుండా సమర్థంగా ఖర్చు పెడుతూ మనకు ఉత్తమమైన భవిష్యత్తును నిర్మించే వారినే ఎన్నుకోవాలి.

టీవీఎస్‌ రావు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img