icon icon icon
icon icon icon

Rajasthan polls: టోంక్‌పై మరోసారి ‘పైలట్‌’ గురి.. స్థానికతే భాజపా అస్త్రం!

టోంక్‌ నియోజకవర్గంలో స్థానికతతోపాటు హిందుత్వ అంశాన్ని భాజపా ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్‌ మాత్రం స్థానికంగా చేసిన అభివృద్ధి, సచిన్‌ పైలట్‌ ఛరిష్మాపైనే ఆధారపడింది.

Published : 19 Nov 2023 18:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు (Rajasthan Assembly) సమయం దగ్గరపడుతోన్న వేళ.. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష భాజపాలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖులు పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా ‘టోంక్‌’ సెగ్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ కీలక నేత, రాజస్థాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) పోటీ చేస్తున్నారు. దీంతో స్థానికత అంశంతోపాటు హిందుత్వను భాజపా (BJP) ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్‌ మాత్రం అభివృద్ధి, కొన్ని వర్గాల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించేందుకు సచిన్‌ చేసిన కృషిని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ ఎన్నికల్లో (Rajasthan polls) ఇవే ఆయన్ను విజేతగా నిలుపనున్నాయని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది.

టోంక్‌లో ముస్లిం, గుర్జర్ల జనాభా అధికం. ఈ జిల్లా పరిధిలో నాలుగు నియోజకవర్గాలుండగా.. క్రితం ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌ మూడు చోట్ల విజయం సాధించింది. టోంక్‌ అసెంబ్లీ స్థానంలో 2.4లక్షల మంది ఓటర్లున్నారు. ఇక్కడి నుంచి 2018లో పోటీ చేసిన సచిన్‌ పైలట్‌.. ప్రత్యర్థిపై 54వేల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి కూడా పైలట్‌ ఇదేస్థానం నుంచి బరిలో దిగారు. గతంలో భాజపా నుంచి యూనస్‌ ఖాన్‌ పోటీ చేయగా.. ఈసారి మాజీ ఎమ్మెల్యే అజిత్‌ సింగ్‌ మెహతా మళ్లీ పోటీలో నిలిచారు.

BJP-Congress: జైపుర్‌ జైకొడితే అందలమే!

ఈ ఎన్నికల్లో సచిన్‌ స్థానికత అంశాన్నే అజిత్‌ సింగ్‌ మెహతా ప్రధానంగా లేవనెత్తుతున్నారు. స్థానికుడికి-బయట వ్యక్తికి మధ్య పోటీ జరుగుతోందంటోన్న ఆయన.. క్రితం ఎన్నికల్లో మాదిరిగా సచిన్‌ పైలట్‌ ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థి కాదంటున్నారు. స్థానికుడిని కావడంతో ఇక్కడి సమస్యలపై తనకెంతో అవగాహన ఉందంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన సచిన్‌ పైలట్‌ బయటి వ్యక్తి అని.. గతంలో ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోవడం కలిసివచ్చిందన్నారు.

రెండుసార్లు ఎంపీగా పనిచేసిన సచిన్‌ పైలట్‌.. ఈసారి కూడా టోంక్‌ ఓటర్ల ఆశీస్సులు తనకే ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా స్థానికంగా చేసిన అభివృద్ధితోపాటు అన్ని వర్గాల ప్రజలను ఒకేరకంగా చూడటం తనకు కలిసి వచ్చే అంశమని సచిన్‌ పైలట్‌ పేర్కొంటున్నారు. మరోవైపు బీఎస్పీ నుంచి నామినేషన్‌ వేసిన అశోక్‌ బైర్వా.. చివరకు కాంగ్రెస్‌ అభ్యర్థి సచిన్‌ పైలట్‌కే మద్దతు ప్రకటించారు. ఇదిలాఉంటే, నవంబర్‌ 25న రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాలకు ఒకేరోజు పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img