icon icon icon
icon icon icon

Telangana elections 2023: ‘గ్రేటర్‌’ విద్యావంతుల ఓటింగ్‌ శాతం పెరిగేనా?

తమ ఆశలకు అనుగుణంగా నాయకులను ఎన్నుకోవడంలో హైదరాబాద్‌ వాసులు ఉదాసీనంగా ఉంటున్నారు. గత మూడు ఎన్నికల్లో ఇదే ట్రెండ్‌ కనిపించింది. గ్రామాల నుంచి పనుల కోసం నగరానికి వచ్చిన వారు కూడా స్వస్థలాలకు వెళ్లి ఓట్లు వేస్తున్నా.. హైదరాబాద్‌ వాసి చలించడంలేదని గణంకాలు చెబుతున్నాయి.

Updated : 29 Nov 2023 17:26 IST

తెలంగాణ అంటేనే జన చైతన్యానికి పెట్టింది పేరు.. అలాంటి రాష్ట్రంలో గుండెకాయ వంటి హైదరాబాద్‌ ప్రజలు మాత్రం ప్రజాస్వామ్య పండుగకు దూరంగా ఉంటున్నారు. మహానగరంలో సమస్యలు ఉన్నప్పుడు సామాజిక మాధ్యమాల్లో  ప్రశ్నించేవారే.. ఎన్నికలప్పుడు నాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ట్రెండ్‌ గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఓ రెండ్రోజులు సెలవులొస్తే హాయిగా కుటుంబంతో కాలక్షేపం చేస్తున్నారేగానీ.. ఐదేళ్లు తమని పాలించే నాయకుడిని ఎన్నుకోవడానికి మాత్రం ఆసక్తి చూపడంలేదు. ఓటింగ్‌ కోసం ఇచ్చిన సెలవును వ్యక్తిగత పనుల కోసం.. విశ్రాంతి తీసుకోవడానికి వాడుకొంటున్నారన్న అపవాదు ఉంది. 

రాష్ట్ర రాజధానితో పోలిస్తే తెలంగాణ మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నికల విషయంలో అత్యంత చైతన్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కసారి అక్షరాస్యత ప్రకారం చూస్తే.. హైదరాబాద్‌ 83 శాతం, రంగారెడ్డి 71, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి 82 శాతం ఉంది. 2009, 2014, 2018 ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 24 అర్బన్‌ నియోజక వర్గాల్లో ఒక్క పటాన్‌చెరు మినహా మరెక్కడా పోలింగ్‌ 60 శాతాన్ని మించలేదు.

పటాన్‌చెరులో 2014 ఎన్నికల్లో 68 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2018లో మరికొంత మెరుగుపడి 75.99 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. గ్రేటర్‌ పరిధిలో నమోదైన అత్యధిక ఓటింగ్‌ శాతం ఇదే. ఇక అత్యంత సంపన్న ప్రాంతంగా పేరున్న జూబ్లీహిల్స్‌లో కేవలం 45 శాతం మందే ఓటుహక్కు వినియోగించుకున్నారు. యాకుత్‌పురా, మలక్‌పేట నియోజక వర్గాల్లో ఇది మరీ 42 శాతానికే పరిమితమైంది. మిగిలిన అన్ని నియోజక వర్గాల్లో 45-60 శాతంలోపే పోలింగ్‌ నమోదైంది. వీరిలో కూడా అత్యధిక మంది పట్టణ పేదలే ఉండటం గమనార్హం.

ప్రజస్వామ్యానికి అండగా నిరక్షరాస్యుడే..

అక్షరాస్యత శాతం అతి తక్కువ ఉన్న కొమరంభీమ్‌ జిల్లా ఒకటి. ఇక్కడ కేవలం 56 శాతం మంది మాత్రమే అక్షరాస్యులున్నారు. కానీ, ఈ జిల్లాలోని సిర్పూర్‌ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో 85 శాతం ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు కదలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఇక యాదాద్రి జిల్లా అక్షరాస్యత శాతం కేవలం 65. కానీ, ఈ జిల్లాలోని భువనగిరిలో 90 శాతం మంది ఓటర్లు గత ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌లకు కదిలి వచ్చారు. నల్గొండ జిల్లాలో కేవలం 63 శాతం మంది విద్యావంతులున్నారు. కానీ, ఇక్కడ మునుగోడు అసెంబ్లీ స్థానంలో 91 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. పాలేరు 92 శాతం, మధిర 92, ఆంధోల్‌, కోదాడ, పాలకుర్తి, డోర్నకల్‌, పార్కల్‌, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 89 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. ఇవేవీ హైదరాబాద్‌తో పోలిస్తే లిటరసీ రేటులో ముందున్న ప్రాంతాలు కాదు. పైగా ఇక్కడి నుంచి నగరానికి వలస వచ్చి పనులు చేసుకొనే వారు చాలా మంది ఉన్నారు. వారు కూడా ఎన్నికల కోసం స్వస్థలాలకు వెళ్తుండడం విశేషం. 

ఆన్‌లైన్‌లో వీడియో చూసినంతసేపు సెర్చి చేస్తే చాలు..

ఇప్పటికే నవంబర్‌ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పెయిడ్‌ హాలిడేగా ప్రకటించింది. వాస్తవానికి చాలా మంది అర్బన్‌ ఓటర్లు రాజకీయాల తీరుతో విసిగిపోయి ఉండటంతో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారన్న వాదనలు ఉన్నాయి. దీనికి తోడు పోలింగ్‌ బూత్‌లకు వెళ్లిన సమయంలో ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే అక్కడ వారితో వాదనలు పడలేక దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి అర్బన్‌ ఓటర్లు తమ పోలింగ్‌ స్టేషన్‌ను మొబైల్‌లో నేషనల్‌ ఓటర్స్ సర్వీస్‌ పోర్టల్‌లో వెతుక్కోవచ్చు. ఓటర్‌ ఐడీ (ఎపిక్‌) లేకపోతే ప్రభుత్వం జారీ చేసిన 12 రకాల కార్డులను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఆధార్‌, ఉపాధి హామీ జాబ్‌కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డ్‌, ఇండియన్‌ పాస్‌పోర్టు, ఫొటోతో కూడిన పెన్షన్‌ పత్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐడీకార్డులు, ఫొటో ఉన్న పాస్‌బుక్‌లు, ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌ కార్డు, కార్మికశాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డులు, సామాజిక న్యాయశాఖ జారీ చేసిన యూనిక్‌ డిజెబిలిటీ ఐడీ వంటివి చూపించవచ్చు. ఈ సారి గ్రామీణ ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచేట్లు హైదరాబాద్‌ వాసులు పోలింగ్‌ బూత్‌లకు ఓటెత్తాలని ఆశిద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img