icon icon icon
icon icon icon

Madhya Pradesh Elections: మధ్యప్రదేశ్‌లో కమల ప్రభంజనం.. మరి సీఎం ఎవరో?

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమైన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Updated : 03 Dec 2023 17:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో (Madhyapradesh Assembly Elections) భాజపా స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మొత్తం 230 స్థానాలకుగానూ 157 స్థానాలకు పైగా కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారన్న దానిపై (Madhyapradesh CM) సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రచారంలో భాజపా అధిష్ఠానం జాతీయ స్థాయి నాయకుల్ని రంగంలోకి దించింది. ప్రధాని మోదీ, అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా కీలక నేతలంతా ప్రచారంతో హోరెత్తించారు. ఓట్ల కౌంటింగ్‌లో భాజపా విజయం సాధించడం దాదాపు ఖాయమైనా.. ముఖ్యమంత్రి పీఠంపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌తోపాటు, జ్యోతిరాదిత్య సింధియా, కైలాస్‌ విజయ్‌ వర్గీయ సీఏం పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం.

మళ్లీ శివరాజ్‌కే పట్టంగట్టేనా?

తాజా ఎన్నికల్లో భాజపా విజయం సాధించేందుకు శివరాజ్‌ చేసిన కృషిని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైపు జాతీయ స్థాయి నాయకులు బరిలో నిలిచినా, వారందరితో సమన్వయం చేసుకుంటూ తనదైన శైలిలో ప్రచారం చేపట్టారు. దాదాపు 4 దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన శివరాజ్‌కే భాజపా అధిష్ఠానం మళ్లీ పగ్గాలు అప్పగిస్తుందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు పార్టీ అధిష్ఠానంతో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి. పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈయనకు మద్దతుగా నిలుస్తారు. ఈ నేపథ్యంలో సీఎం పగ్గాలు శివరాజ్‌కే దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

రేసులో కైలాస్‌ విజయ్‌వర్గీయ

భాజపా నేషనల్‌ జనరల్‌ సెక్రెటరీ కైలాస్‌ విజయ్‌ వర్గీయ కూడా సీఎం రేసులో ఉన్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు ఇందౌర్‌ స్థానం కేటాయించినప్పటి నుంచే  తాను సీఎం రేసులో ఉన్నట్లు ఆయనే పలు సందర్భాల్లో పరోక్షంగా చెప్పారు. కేవలం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం లేదని, ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధమయ్యే వచ్చానని వివిధ ప్రచార సభల్లో కైలాస్‌ విజయ్‌ వర్గీయ్‌ చెప్పారు. ఆ వ్యాఖ్యలతో పార్టీలో అంతర్గతంగా దుమారం కూడా రేగింది. దీంతో ఓ వైపు తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే..  భాజపా అధికారంలోకి వస్తే.. అధిష్ఠానమే ముఖ్యమంత్రిని నిర్ణయిస్తుందని, ఎలాంటి  నిర్ణయం వెలువడినా కట్టుబడి ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి స్థానంలో తగిన వ్యక్తిని అధిష్ఠానం కూర్చోబెడుతుందని భావిస్తున్నానని ఎలాంటి నిర్ణయం వెలువడినా స్వాగతిస్తానని చెప్పారు.

జ్యోతిరాదిత్య సింధియా స్థానమేంటి?

గతంలో ముఖ్యమంత్రి విషయంలోనే మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌తో విభేదాలు ఏర్పడి.. జ్యోతిరాదిత్య సింధియా తన మద్దతు దారులతో కలిసి భాజపాలో చేరిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి భాజపా సర్కార్‌ ఏర్పాటుకు దోహదం చేశారు. తాజాగా మరోసారి భాజపా విజయం ఖాయమైన నేపథ్యంలో సింధియాకే సీఎం పగ్గాలు ఇస్తారని భాజపాలోని ఓ వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని ఉంటూ, పార్టీ అభివృద్ధికి  కృషి చేసిన సీనియర్‌ నేతలను కాదని సింధియాకు పగ్గాలు అప్పగిస్తారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇటీవల కాలంలో శివరాజ్‌పై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో అధిష్ఠానం సింధియాకు ఓటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే తాజా ఎన్నికల్లో సింధియా పోటీచేయకపోవడం గమనార్హం.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, ఫగ్గన్‌ సింగ్‌ కులస్థేలతో పాటు లోక్‌సభ ఎంపీలు రాకేశ్‌ సింగ్‌, గణేశ్‌ సింగ్‌, రితి పాఠక్‌, ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ తదితర జాతీయ స్థాయి నాయకులను కూడా భాజపా రంగంలోకి దించింది. వీళ్లలో ఎవరో ఒకర్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img