Rajasthan Election Result: రాజస్థాన్‌లో భాజపా విజయం.. సీఎం రేసులో ఎవరెవరు?

రాజస్థాన్‌లో భాజపా అధికారంలోకి వచ్చింది. అయితే, అక్కడ ఎవరిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. మాజీ సీఎం వసుంధరా రాజేతోపాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

Updated : 03 Dec 2023 18:49 IST

ఇంటర్నెట్‌డెస్క్: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly Elections) భాజపా ఘన విజయం సాధించింది. మొత్తం 200 స్థానాల్లో  199 నియోజకవర్గాలకు  ఎన్నికలు జరగ్గా.. ఇప్పటికే 112 స్థానాలను కైవసం చేసుకున్న కమలం పార్టీ మరో 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.  ప్రారంభం నుంచి స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన కాషాయ దళం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే ముఖ్యమంత్రిగా అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై సందిగ్ధత నెలకొంది. అయితే కొందరి పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

1. వసుంధరా రాజే

రాజస్థాన్‌కు ఈమె 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. భాజపాలో సీనియర్‌ నాయకురాలు. అయితే, అధిష్ఠానంతో విభేదాల నేపథ్యంలో తాజా ఎన్నికల్లో ఈమెకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ, పార్టీలో వర్గ విభేదాలు పొడచూపే అవకాశం ఉండటంతో రాజేతోపాటు ఆమె వర్గీయులకు కూడా టికెట్లు కేటాయించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అంతర్గత చర్చల ద్వారా విభేదాలను పక్కన పెట్టిన అధిష్ఠానం రాజేకే మళ్లీ పగ్గాలు అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు రాజస్థాన్‌లో జాట్‌, రాజ్‌పుత్‌ వర్గాల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. అయితే, మరాఠా రాజకుటుంబానికి చెందిన రాజే.. జాట్‌ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడం కూడా ఆమెకు కలిసొచ్చే అంశం. ఒకవేళ ఆమెకు సీఎం పగ్గాలు ఇస్తే.. రెండు వర్గాల వారికీ న్యాయం చేసిట్లవుతుందని అధిష్ఠానం భావించొచ్చు.

2. గజేంద్రసింగ్‌ షెకావత్‌

మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు అధిష్ఠానంతో విభేదాల నేపథ్యంలో ఒక వేళ భాజపా అధికారంలోకి వస్తే సీఎం పగ్గాలను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు అప్పగిస్తారనే ఊహాగానాలు గతంలోనే వినిపించాయి. రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి చెందిన ఆయన.. వసుంధరా రాజే స్థానాన్ని భర్తీ చేయగలరని పలువురు విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో రాజ్‌పుత్‌ ఓటు బ్యాంక్‌ కూడా ఎక్కువే. అయితే, రాజ్‌పుత్‌, జాట్ల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఒకవేళ రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన వ్యక్తిని సీఎంని చేస్తే.. జాట్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానం కచ్చితంగా ఆచితూచి అడుగు వేయాల్సిందే. అయితే, తాజా ఎన్నికల్లో గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పోటీ చేయకపోడం గమనార్హం.

3. బాలక్‌ నాథ్‌

అళ్వార్‌ ఎంపీ మహంత్‌ బాలక్‌నాథ్‌ ప్రస్తుతం తిజారా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. రాజస్థాన్‌ యోగిగా ఈయనకు పేరుంది. ఓబీసీ వర్గానికి చెందిన వారు. ఓబీసీ వర్గానికి దగ్గరవ్వాలన్న భాజపా ప్రణాళికలు, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆశీస్సులు ఈయనకు కలిసొచ్చే అంశాలు. యూపీ తరహాలో పక్కా హిందుత్వవాదిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని.. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పార్టీ భావిస్తే రేసులో ముందుంటారు.  బ్రహ్మచారి కావడం బాలక్‌నాథ్‌కు మరో సానుకూలాంశం. కానీ పక్కపక్కనే ఉన్న రెండు రాష్ట్రాలకు ఏకకాలంలో ఇద్దరు ఒకేరకమైన వ్యక్తులను (యోగి, బాలక్‌నాథ్‌) సీఎంలుగా ఉంచేందుకు పార్టీ సుముఖత చూపిస్తుందో లేదో చూడాలి.

4. దియా కుమారి

తాజా ఎన్నికల్లో ఎక్కువగా వినిపించిన పేరు ఇది. ఈమె రాజ్‌సమంద్‌ ఎంపీగా ఉన్నారు. జైపుర్‌ రాజవంశ వారసురాలు. వసుంధరా రాజే స్థానాన్ని ఈమె భర్తీ చేయగలదని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో విద్యాధర్‌ నగర్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజ్‌పుత్ర వంశానికి చెందినవారు కావడం సీఎం రేసులో ప్రతికూలాంశంగా మారొచ్చు. మరోవైపు తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన దియా కుమారి అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. అయితే, అంతగా అనుభవం లేని ఈమెను సీఎం స్థానంలో కూర్చో బెట్టేందుకు అధిష్ఠానం అంగీకరిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

వీళ్లతోపాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌, ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షనేత రాజేంద్ర రాథోర్‌, రాజస్థాన్‌ భాజపా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ పునియా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, వీళ్లలో సీఎం అయ్యే అదృష్టం ఎవరికి ఉందో పార్టీ అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని