icon icon icon
icon icon icon

Rajasthan: సంప్రదాయానికే జై.. రాజపుత్రుల కోటలో ‘కాషాయం’ రెపరెపలు!

హోరాహోరీగా సాగిన రాజస్థాన్‌ అసెంబ్లీ పోరులో (Rajasthan Assembly Polls) సంప్రదాయానికే ఓటర్లు జై కొట్టారు. వరుసగా రెండోసారి ఏ పార్టీకి అధికారం కట్టపెట్టని రాజస్థాన్‌ ఓటర్లు.. ఈసారి కాషాయ పార్టీకి పగ్గాలు అప్పజెప్పారు.

Updated : 03 Dec 2023 22:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతోన్న సంప్రదాయానికే రాజస్థాన్ ఓటర్లు జై కొట్టారు. వరుసగా రెండోసారి ఒకే పార్టీకి అధికారం కట్టబెట్టేది లేదని తేల్చిచెప్పారు. రాజపుత్రుల కోటలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ పోరులో.. చివరకు కాషాయ పార్టీనే విజయం వరించింది. ముఖ్యమంత్రి ముఖాన్ని పరిచయం చేయకుండానే బరిలో దిగిన ‘కమలం’ మరోసారి వికసించింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో కాలం గడిపిన కాంగ్రెస్‌ అగ్రనేతలు.. చివర్లో కలిసే ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు మాత్రం కాషాయానికే అధికారాన్ని కట్టబెట్టారు. 2018లో 73 స్థానాలకే పరిమితమైన భాజపా.. ఈసారి మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి 115 సీట్లతో స్పష్టమైన మెజార్టీ సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

30 ఏళ్లుగా అదే సంప్రదాయం..

రాజస్థాన్‌లో ఎన్నికల రాజకీయాలు గత మూడు దశాబ్దాలుగా ఒకే రీతిలో కొనసాగుతున్నాయి. 1990 నుంచి అక్కడి ఓటర్లు స్పష్టమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు. 1990ల్లో భాజపా నేత భైరాన్‌సింగ్‌ షెకావత్‌ పాలన తర్వాత నుంచి ఈ ట్రెండ్‌ స్పష్టంగా కనిపిస్తోంది. 1990 నుంచి 1992, 1993 నుంచి 1998 వరకు షెకావత్‌ సీఎంగా కొనసాగారు. మధ్యలో ఏడాదిపాటు రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో ఒకసారి భాజపా, మరోసారి కాంగ్రెస్‌ అధికారాన్ని చేపడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో అశోక్‌ గహ్లోత్‌ మూడుసార్లు ముఖ్యమంత్రి కాగా.. భాజపా తరఫున వసుంధర రాజే రెండుసార్లు పాలనా పగ్గాలు చేపట్టారు. తాజాగా మరోసారి కాషాయ పార్టీ అధికారం కైవసం చేసుకుంది.

మోదీ సునామీ.. సీఎం ‘ఫేస్‌’ లేకున్నా..!

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలో దిగిన భాజపా.. ఆ లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఓవైపు రాష్ట్రంలో అవినీతి, శాంతిభద్రతల వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. మరోవైపు హిందుత్వ ఎజెండాతో ప్రజల్లోకి దూసుకెళ్లింది. భాజపా అగ్రనేతలతో పాటు ప్రధాని మోదీ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా ఉదయ్‌పుర్‌లో టైలర్‌ హత్యోదంతం, మహిళలపై దాడులు, పేపర్‌ లీకేజీల వంటి అంశాలను కాషాయ నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. ప్రభుత్వ అవినీతిపై మండిపడుతూ.. ‘రెడ్‌ డైరీ’ని ఉదహరించారు. కాంగ్రెస్‌ ఓటమికి ఈ రెడ్‌ డైరీనే ప్రధాన కారణం కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ కొన్ని వర్గాలకే మద్దతుగా ఉంటుందనే వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ప్రతిష్ఠను పెంచడంలో ప్రధాని మోదీ కృషి చేస్తున్నారంటూ స్థానిక భాజపా నేతలు ముమ్మర ప్రచారం చేశారు. గహ్లోత్‌ హయాంలోని ప్రతికూల అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ.. వాటినే తమకు అనుకూలంగా మార్చుకోవడంలో భాజపా నేతలు సఫలీకృతమైనట్లు కనిపిస్తోంది.

వ్యూహం మార్చిన భాజపా..

కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓటమి అనుభవాలతో భాజపా.. తాజా ఎన్నికల్లో వ్యూహం మార్చింది. ఈ క్రమంలో జాతీయ స్థాయి నేతలను అసెంబ్లీ బరిలో దింపింది. రాష్ట్రంలో వసుంధర రాజే వంటి అగ్రనేతలతోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలనూ పోటీలో నిలిపింది. స్థానిక నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వ్యతిరేకతను అధిగమించేందుకు ఈ వ్యూహం అమలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, కర్ణాటకలో ప్రకటించిన ‘గ్యారంటీలు’ కలిసివచ్చాయని భావించిన కాంగ్రెస్‌ ఇతర రాష్ట్రాల్లోనూ అటువంటి హామీలే గుప్పించింది. ఈ క్రమంలో రాజస్థాన్‌లో చిరంజీవి యోజనతోపాటు ఏడు గ్యారంటీలతో ప్రచారం నిర్వహించింది. పాత పెన్షన్‌ పద్ధతి మొదలు.. చిరంజీవి ఆరోగ్య పథకం, వంట గ్యాస్‌పై భారీ సబ్సిడీ, సామాజిక భద్రత పేరుతో ఆర్థిక సాయం, ఉచిత కరెంటు వంటి హామీలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం కాంగ్రెస్‌ చేసినప్పటికీ.. అవన్నీ పనిచేయనట్లే కనిపిస్తున్నాయి.

పీఠం వీడనన్న గహ్లోత్‌.. ఆధిపత్య పోరుతోనే..

2018 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. సీఎం అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ల మధ్య వర్గ పోరు పతాక స్థాయికి చేరుకుంది. గహ్లోత్‌కు సీఎం పదవి ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న పైలట్‌.. ఒకదశలో తిరుగుబాటు కూడా చేశారు. అనంతరం కాంగ్రెస్‌ అధిష్ఠానం బుజ్జగించినప్పటికీ.. అవకాశం వచ్చినప్పుడల్లా సొంతపార్టీపై విమర్శలు గుప్పించారు. గతంలో వసుంధర రాజే నేతృత్వంలోని భాజపా ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో సీఎం గహ్లోత్‌ ప్రభుత్వం విఫలమైందని సొంత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. 

మరి ముఖ్యమంత్రి ఎవరు..?

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా రాజస్థాన్‌లో కాషాయ పార్టీ అధికారం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎవరనేది ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పదేళ్లు పాలించిన వసుంధర రాజేకే మళ్లీ రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగిస్తారా..? లేక కొత్త ముఖాన్ని రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img