icon icon icon
icon icon icon

Chhattisgarh Elections: మహిళలకు రూ.15 వేల ఆర్థిక సాయం.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ కీలక ప్రకటన

Chhattisgarh Elections: అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఛత్తీస్‌గఢ్‌లో కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా రూ.15 వేలు అందజేస్తామని సీఎం బఘేల్‌ ప్రకటించారు.

Updated : 12 Nov 2023 14:40 IST

రాయ్‌పూర్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ఆదివారం కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మహిళలకు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తామని తెలిపారు. దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్లకు తాము ఇస్తున్న కానుక ఇదని ఆయన పేర్కొన్నారు. ‘ఛత్తీస్‌గఢ్‌ గృహలక్ష్మీ పథకం’గా దీన్ని అమలు చేస్తామని వెల్లడించారు. వివాహిత మహిళలకు ఏటా రూ.12 వేలు అందజేస్తామని భాజపా ఇప్పటికే ప్రకటించింది. దీనికి కౌంటర్‌గానే కాంగ్రెస్‌ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 శాసన సభ స్థానాలు ఉన్నాయి. నవంబర్‌ 7న 20 సీట్లకు పోలింగ్‌ పూర్తయింది. మరో 70 స్థానాలకు 17న పోలింగ్‌ జరగనుంది. ‘భరోసే కా ఘోషణ పత్ర్‌ 2023-28’ పేరిట.. ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh Elections) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. కులగణన, రైతు రుణమాఫీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ వంటి హామీలను అందులో పొందుపర్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలు అన్నింటినీ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. వీటికి అదనంగా తాజాగా మహిళలకు రూ.15 వేల ఆర్థిక సాయం పథకాన్ని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img