Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 12 Sep 2023 20:56 IST

1. అక్రమ కేసులతో తెదేపా శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు

తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా పెట్టిన అక్రమ కేసులు తెలుగుదేశం శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని నందమూరి, నారా కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. నందమూరి రామకృష్ణ, నారా రోహిత్‌, భరత్‌ మంగళవారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, తామంతా ఒకరికొకరం అండగా ఉంటూ ముందుండి నడిపిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు చంద్రబాబు క్లీన్‌ చిట్‌తో బయటకు వస్తారన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.ఎలాన్‌ మస్క్‌లో ‘అపరిచితుడు’.. బయోగ్రఫీ రచయిత

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌కు (Elon musk) సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆయన జీవితంపై వాల్టర్‌ ఐజాక్సన్‌ రాసిన ‘ఎలాన్‌ మస్క్‌’ (Elon musk book) పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. మస్క్‌ బాల్యం, ఆయన వైవాహిక బంధాలు, ఉక్రెయిన్‌కు స్టార్‌ లింక్‌ సేవలను నిరాకరించడం, ట్విటర్‌ కొనుగోలు వంటి కూడిన విశేషాలను అందులో పొందపరిచారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. పార్లమెంట్‌లో వేధింపులు ఎదుర్కొన్నా: ఆస్ట్రేలియా మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

ఆస్ట్రేలియా(Australia) దేశ పార్లమెంట్ వేదికగా వేధింపులకు గురైనట్లు హోం శాఖ మాజీ మంత్రి కరెన్‌ ఆండ్రూస్‌ వెల్లడించారు. సహచర నేత ఒకరు వెనక నుంచి తనకు అత్యంత సన్నిహితంగా వచ్చారని వెల్లడించారు. అయితే ఆయన పేరు మాత్రం వెల్లడించలేదు.  ‘ప్రశ్నోత్తరాల సమయంలో నేను పార్లమెంట్‌లో మాట్లాడుతున్నప్పుడు ఒక కొలీగ్ వెనక నుంచి నాకు అత్యంత సన్నిహితంగా వచ్చారు’ అంటూ ఆండ్రూస్‌ మీడియాతో మాట్లాడుతూ తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. అమిత్‌ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో  పాల్గొనేందుకు ఒక్కరోజు ముందే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు రానున్నారు. ఈనెల 16న రాత్రి 7.55 గంటలకు ఔరంగాబాద్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఆర్పీఎఫ్‌ సెక్టార్స్‌ ఆఫీసర్స్‌ మెస్‌కు చేరుకుని ఆరోజు రాత్రి  అక్కడే బస చేస్తారు. 17న ఉదయం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదాన్‌కు చేరుకుని తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం తెలంగాణ ప్రజల నుద్దేశించి అమిత్‌ షా ప్రసంగించనున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ట్రంప్‌పై కేసులు రాజకీయ ప్రేరేపితం: అమెరికా మాజీ అధ్యక్షుడికి మద్దతుగా పుతిన్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin) మద్దతు పలికారు. ఆయనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు. రష్యా(Russia), ట్రంప్‌(Trump) మధ్య స్నేహపూరిత వాతావరణం కనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజా వ్యాఖ్యలు వినిపించాయి. మరోసారి అమెరికా(America) అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని చూస్తున్న ట్రంప్‌.. కేసుల సుడిగుండంలో చిక్కుకుపోతున్నారు. 2020 ఎన్నికల సందర్భంగా ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. 3 సంవత్సరాలు, 17 మంది వైద్యులు కనిపెట్టలేకపోయారు.. చాట్‌జీపీటీ చేసేసింది

కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ (ChatGPT) చేసే అద్భుతాల్ని వింటూనే ఉంటాం. దీని వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రంగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీని సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. అనేక పరిశ్రమలు పునరావృతమయ్యే పనులను మరింత  సులభంగా, తక్కువ సమయంలో చేయటానికి దీని సాయం తీసుకుంటున్నాయి. ఈ చాట్‌జీపీటీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యంతో ఎంత క్లిష్ట ప్రశ్నకైనా అవలీలగా సమాధానం చెప్పేస్తోంది. తన బిడ్డను వచ్చిన జబ్బును తెలుసుకోవటంలో ఓ తల్లికి చాట్‌జీపీటీ సాయం అందించింది. మూడేళ్లుగా ఏ డాక్టరు కనుగొనలేని విషయాన్ని ఈ ఏఐ చేసి చూపించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7.  ఏపీలో 27 లక్షల ఓట్ల తనిఖీ.. ఎంపీ రఘురామ లేఖపై స్పందించిన ఈసీ

ఒకే డోర్‌ నెంబర్‌లో 10మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాల సంఖ్య 1,57,939గా ఎన్నికల సంఘం తేల్చింది. ఇందులో 24,61,676 మంది ఓటర్లు ఉంటున్నట్టుగా తేలిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామ కృష్ణ రాజు రాసిన లేఖ మేరకు ఏపీలో ఓటర్ల సంఖ్యపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సమాధానం ఇచ్చారు. గుర్తు తెలియని డోర్ నెంబర్లు, జీరో నెంబర్లపైనా 2,51,767 మంది ఓటర్లు నమోదు అయి ఉన్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. 40% సిట్టింగ్‌ ఎంపీలపై క్రిమినల్‌ కేసులు.. వైకాపా ఎంపీల్లో 13 మందిపై!

పార్లమెంట్‌ ఉభయ సభల్లో సిట్టింగ్‌ ఎంపీలపై 40 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ సంస్థ (ADR Report) వెల్లడించింది. అందులో 25 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు వంటివి ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థతో కలిసి సిట్టింగ్‌ ఎంపీల అఫిడవిట్‌లను పరిశీలించి వివరాలను వెల్లడించింది. ఉభయ సభల్లో మొత్తం 776 ఎంపీలకు గానూ 763 మంది ఎంపీలు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి నివేదికను రూపొందించింది. కొన్ని స్థానాలు ఖాళీగా ఉండడం, అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో కొన్నింటిని పక్కనపెట్టింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. కేరళలో మళ్లీ ‘నిఫా వైరస్‌’ కలకలం.. ఇద్దరి మృతి

కేరళ (Kerala)లో మళ్లీ నిఫా వైరస్‌ (Nipah Virus) కలకలం రేగింది. ఇక్కడి కొయ్‌కోడ్‌ (Kozhikode) జిల్లాలో ఇటీవల మృతి చెందిన ఇద్దరు.. ఈ వైరస్‌ బారిన పడే ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) ప్రకటించారు. ఈ క్రమంలోనే నిఫా వైరస్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడానికి, పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని కేరళకు పంపినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ప్రపంచ రికార్డు సృష్టించిన విరాట్ - రోహిత్ జోడీ

ఆసియా కప్‌ సూపర్ -4లో (Asia Cup 2023) భాగంగా శ్రీలంకతో టీమ్ఇండియా (IND vs SL) తలపడుతోంది. అయితే, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ప్రపంచ రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. వన్డేల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులను జోడించిన బ్యాటర్లుగా నిలిచారు. ఇంతకుముందు వరకు వెస్టిండీస్‌ దిగ్గజ ద్వయం గార్డన్ గ్రీనిడ్జ్‌ - డెస్మాండ్ హేన్స్‌ పేరిట ఈ రికార్డు ఉండేది. వారిద్దరూ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను తాకారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని