ChatGPT: 3 సంవత్సరాలు, 17 మంది వైద్యులు కనిపెట్టలేకపోయారు.. చాట్‌జీపీటీ చేసేసింది

ChatGPT: తన బిడ్డను వచ్చిన జబ్బును తెలుసుకోవటం కోసం ఓ తల్లి పడిన అన్వేషణకు చాట్‌జీపీటీ సమాధానం చెప్పింది.

Published : 13 Sep 2023 02:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ (ChatGPT) చేసే అద్భుతాల్ని వింటూనే ఉంటాం. దీని వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రంగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీని సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. అనేక పరిశ్రమలు పునరావృతమయ్యే పనులను మరింత  సులభంగా, తక్కువ సమయంలో చేయటానికి దీని సాయం తీసుకుంటున్నాయి. ఈ చాట్‌జీపీటీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యంతో ఎంత క్లిష్ట ప్రశ్నకైనా అవలీలగా సమాధానం చెప్పేస్తోంది. తన బిడ్డను వచ్చిన జబ్బును తెలుసుకోవటంలో ఓ తల్లికి చాట్‌జీపీటీ సాయం అందించింది. మూడేళ్లుగా ఏ డాక్టరు కనుగొనలేని విషయాన్ని ఈ ఏఐ చేసి చూపించింది.

మూడు సంవత్సరాలు, 17 మంది డాక్టర్లు ఎంత శ్రమించినా 4 సంవత్సరాల బాబుకు వచ్చిన జబ్బును గుర్తించలేకపోయారు. కానీ, చాట్‌జీపీటీ సులువుగా ఆ పని చేసి పెట్టింది. అసలు ఏం జరిగిందంటే.. కోర్ట్నీ అనే మహిళ తన కొడుకు అలెక్సాకు వచ్చిన జబ్బును తెలుసుకోవాలని చాలా ప్రయత్నించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో తన బిడ్డకు ఓ జబ్బు వచ్చింది. ఏం తిన్నా పంటి నొప్పి రావటం, ఎత్తు పెరగకపోవటం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమె జబ్బును గుర్తించి చికిత్స అందించాలని చాలా ప్రయత్నించింది. దాదాపు మూడేళ్లు ఎంతో మంది డాక్టర్లను సంప్రదించింది. ఎవరూ తన బిడ్డ జబ్బును కనిపెట్టలేకపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక ఒక రోజు మొత్తం కంప్యూటర్‌ ముందే కూర్చొని చాట్‌జీపీటీ సాయం కోరింది.

కాస్త ఊరట! ఆగస్టులో స్వల్పంగా దిగొచ్చిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

ఎంఆర్‌ఐ రిపోర్డులో ఉన్న ప్రతి అంశం గురించి చాట్‌జీపీటీని వివరంగా అడిగింది. అలాగే తన బిడ్డకున్న లక్షణాలు పంచుకుంది. చివరకు, ‘టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ (tethered cord syndrome)’ అనే అరుదైన న్యూరోలాజికల్ కండిషన్‌తో తన కొడుకు బాధపడుతున్నట్లు గుర్తించింది. వెంటనే న్యూరోసర్జన్‌ను సంప్రదించింది తన తనయుడికి టెథర్డ్‌ కార్డ్‌ సిండ్రోమ్‌తో బాధ పడుతున్నాడనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇక ఆ డాక్టర్‌ అలెక్స్‌ జబ్బుని నిర్థారించి శస్త్రచికిత్స చేశారు. దీంతో తన కొడుకు జబ్బు నుంచి బయటపడినట్లు,  కొంచెం ఎత్తు పెరిగాడంటూ ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. అయితే రోగనిర్ధారణను కనుక్కోవటంలో చాట్‌జీపీటీ సహాయపడటం ఇది మొదటి సారి కాదు.  ఈ ఏడాది మార్చిలో ఇలాంటి విషయాన్నే ఓ వ్యక్తి ‘ఎక్స్‌’వేదికగా పంచుకున్నాడు. తన పెంపుడు కుక్కకు ఉన్న జబ్బును వైద్యులు కూడా కనిపెట్టలేకపోయారు. కానీ, ఏఐ కనిపెట్టిందంటూ రాసుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు