Elon musk: ఎలాన్‌ మస్క్‌లో ‘అపరిచితుడు’.. బయోగ్రఫీ రచయిత

Elon musk biography: ఎలాన్‌ మస్క్‌ బయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఈ పుస్తకం విడుదలైంది. అమెరికాలో బెస్ట్‌ సెల్లింగ్‌ పుస్తకంగా నిలుస్తోంది.

Updated : 12 Sep 2023 18:05 IST

Elon musk biography | ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌కు (Elon musk) సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆయన జీవితంపై వాల్టర్‌ ఐజాక్సన్‌ రాసిన ‘ఎలాన్‌ మస్క్‌’ (Elon musk book) పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. మస్క్‌ బాల్యం, ఆయన వైవాహిక బంధాలు, ఉక్రెయిన్‌కు స్టార్‌ లింక్‌ సేవలను నిరాకరించడం, ట్విటర్‌ కొనుగోలు వంటి కూడిన విశేషాలను అందులో పొందపరిచారు.

ఎలాన్‌ మస్క్‌ (Elon musk) పుస్తకం అమెరికాలో విడుదలైంది. 600 పేజీల ఈ పుస్తకం అమెజాన్‌లో బెస్ట్‌ సెల్లింగ్‌ బుక్‌గా నిలుస్తోంది. ఇప్పటికే పలు మీడియా హౌస్‌లకు ఈ పుస్తకప్రతులు చేరడంతో వాటిలో సారాంశాన్ని ప్రచురించాయి. అయితే, ఈ పుస్తకం పూర్తి చేయడానికి తాను మూడేళ్ల పాటు ఎలాన్‌ మస్క్‌ వెంట పడినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రచయిత ఐజాక్సన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎలాన్‌ మస్క్‌ అప్పుడప్పుడూ అపరిచితుడిలా వ్యవహరిస్తుండేవాడని పేర్కొన్నారు.

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పెంపు.. కొత్త డెడ్‌లైన్‌ ఇదే..!

ఎలాన్‌ మస్క్‌లో తాను అనేక పార్శ్వాలు చూశానని ఐజాక్సన్‌ పేర్కొన్నారు. ఎలాన్‌ మస్క్‌లో మల్టిపుల్‌ పర్సనాలిటీలు ఉన్నాయని చెప్పారు. ఒక్కోసారి ఆయన తన తండ్రిలా మస్క్‌ వ్యవహరిస్తుంటాడని, ఆయనలోనూ రెండు పార్శ్వాలు ఉన్నాయని పేర్కొన్నారు. మస్క్‌ ఒక్కోసారి చపలచిత్తంగా వ్యవహరిస్తుంటాడని, మరోసారి మస్క్‌లో ఓ ఇంజినీర్‌ కనిపిస్తుంటాడని తెలిపారు. ఇంజినీర్‌ మోడ్‌లో ఉన్నప్పుడు రాప్టర్‌ ఇంజిన్‌ వాల్వ్‌ను కూడా ఆయన సరిచేయగలడని, మళ్లీ అంతలోనే కామ్‌ అయిపోతాడని పేర్కొన్నారు. కొన్నిసార్లు దెయ్యంపట్టిన వాడిలా జనాల మీద అరుస్తాడని.. ‘ఏమైందని’ అది అడిగితే ఆయన్నుంచి ‘గుర్తులేదు’ అనే సమాధానం వచ్చేదని ఐజాక్సన్‌ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, అంతరిక్షంలోకి మనుషుల పంపించే విషయంలో ఎలాన్‌ మస్క్‌కు ఉన్న సాంకేతిక అవగాహన చూస్తుంటే తనకు ముచ్చటేసేది అంటూ చెప్పుకొచ్చారు.

అన్నదమ్ముల మధ్య గొడవ

ఎలాన్‌ మస్క్‌ సోదరుడు కింబల్‌ మస్క్‌ మధ్య ఓ రోజు పెద్ద గొడవ జరిగిందని, ఆ ఘర్షణలో ఎలాన్‌ మస్క్‌ తీవ్రంగా గాయపడడంతో ఆయన్ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించాల్సి వచ్చిందని ఐజాక్సన్ తన పుస్తకంలో పేర్కొన్నారు. తొలుత ఎలాన్‌ మస్క్‌ కింబల్‌ను ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో.. కింబల్‌ అతడి చేతిని కొరికారట. ఈ క్రమంలో చేతి నుంచి చిన్న మాంసం ముక్క కూడా బయటకొచ్చిందని రచయిత రాసుకొచ్చారు. ఇద్దరూ కలిసి జిప్‌2 అనే స్టార్టప్‌ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని రచయిత పేర్కొన్నారు. ఒక్కోసారి ఎక్స్‌లో (ట్విటర్‌) ఎలాన్‌ మస్క్‌ పెట్టే పోస్టులు తనకు ఇబ్బందికరంగా అనిపించేవని, కొన్ని పోస్టులు చూసినప్పుడు సోదరుడి అకౌంట్‌ను అన్‌ఫాలో చేద్దామని నిర్ణయించకున్నానని కింబల్‌ తెలిపినట్టు రచయిత తన పుస్తకంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని