Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jun 2024 13:14 IST

1. చంద్రబాబు కోసం సిద్ధమైన నూతన కాన్వాయ్‌

తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈక్రమంలో ఆయన కోసం నూతన కాన్వాయ్‌ సిద్ధమైంది. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో రెండింటిని సిగ్నల్ జామర్ కోసం కేటాయించారు. పూర్తి కథనం

2. బాధ్యతలు స్వీకరించిన మోదీ.. తొలి సంతకం దేనిపైఅంటే..?

భారత ప్రధానిగా నరేంద్రమోదీ(PM Modi) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని సౌత్‌బ్లాక్‌లోని పీఎంఓ కార్యాలయంలో మూడో దఫా తన విధుల్ని మొదలుపెట్టేశారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం చేశారు. దీంతో 9.30 కోట్లమంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం అందుతుంది.పూర్తి కథనం

3. రాజధాని ప్రాంతంలో వేగంగా జంగిల్‌ క్లియరెన్స్‌

రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారు వంద జేసీబీలతో గత నాలుగు రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.  109 కి.మీ నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయింబవళ్లు తొలగిస్తున్నారు.పూర్తి కథనం

4. ఏపీలో కీలక దస్త్రాల మాయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి: సీపీఐ రామకృష్ణ

కీలక దస్త్రాల మాయంపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. వైకాపా హయాంలో ఇసుక, మైనింగ్, ఎక్సైజ్‌ తదితర శాఖల్లో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు. అవినీతి, అక్రమాలతో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు.పూర్తి కథనం

5. ఎన్నికల్లో ఓడినా.. పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా.. కేంద్రమంత్రిగా

ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన రవనీత్ సింగ్‌ బిట్టు (Ravneet Singh Bittu).. పంజాబ్‌లో లుథియానా నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. రాజ్యసభలోనూ ఆయన సభ్యుడు కాడు. అయితే ఆదివారం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం విశేషం.పూర్తి కథనం

6. విభజన చట్టం అమలుకు తెలుగు రాష్ట్రాల కేంద్రమంత్రులు కృషి చేయాలి: సీఎం రేవంత్‌

కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ నుంచి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాస్‌వర్మకు అభినందనలు తెలియజేశారు. విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని కోరారు.పూర్తి కథనం

7. తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా ఈటల రాజేందర్?

తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా భాజపా జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. భాజపాలో ఒకరికి రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని, కిషన్‌రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని తెలుస్తోంది.పూర్తి కథనం

8. శాశ్వత నివాస హోదా వచ్చిన కొద్దిరోజులకే.. కెనడాలో భారతీయుడి హత్య

కెనడా(Canada)లో నివసిస్తున్న ఇండియన్‌ యువరాజ్‌ గోయల్‌ (28) హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 7న ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.పూర్తి కథనం

9. గొర్రెల పంపిణీ పథకం కేసు.. ఇద్దరు ఉన్నతాధికారులను కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ

గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ ఇద్దరిని కస్టడీలోకి తీసుకోనుంది. పశుసంవర్ధక మాజీ సీఈవో రామచందర్‌ నాయక్‌, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. వీరిద్దిరికి ఏసీబీ కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈక్రమంలో అధికారులు వారిని సోమవారం చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించనున్నారు.పూర్తి కథనం

10. పాక్‌పై బుమ్రా అదుర్స్‌.. హార్దిక్‌ పాండ్య రికార్డు బద్దలు

టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించడంలో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బ కొట్టాడు. పొదునైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. కేవలం 120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ 113/7 స్కోరుకే పరిమితమైంది. ఈ క్రమంలో బుమ్రా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని