Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Aug 2023 13:14 IST

1. ₹13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో మహాలక్ష్మికి అలంకరణ

శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతోన్నాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ముసలమ్మ తల్లి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు సుమారు ₹13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో జగన్మాతను ప్రత్యేకంగా అలంకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వరంగల్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. తెల్లవారుజామున 4.45 నిమిషాలకు సుమారు 5 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. దీంతో పలుచోట్ల ఇళ్లలోని వస్తువులు కదిలాయి. నిద్రలో  ఉన్న ప్రజలు ఆందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మోదీ-జిన్‌పింగ్‌ సంభాషణపై చైనా రాజకీయం.. తిప్పికొట్టిన భారత్‌

దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ (BRICS) సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi i Jinping) కొంతసేపు మాట్లాడుకున్నారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చినా అది జరగలేదు. ఈ క్రమంలోనే చర్చల విషయంలో భారత్‌ (India)పై చైనా (China) నోరుపారేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జాబిల్లి ఉపరితలంపైకి రోవర్‌ దిగిందిలా.. వీడియో షేర్‌ చేసిన ఇస్రో

జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 (Chandrayaan-3) సురక్షితంగా దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్‌-3 ల్యాండర్‌ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపగా.. కొన్ని గంటల తర్వాత అందులో నుంచి రోవర్‌ బయటకు వచ్చి తన అధ్యయనాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇస్రో (ISRO) తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తొలి చర్చతోనే మార్మోగిన వివేక్‌ పేరు.. మొదటి గంటలోనే..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతల మధ్య తొలి బహిరంగ చర్చ(Republican Debate) వాడీవేడీగా జరిగిన సంగతి తెలిసిందే. రిపబ్లికన్‌ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఆరుగురు బుధవారం జరిగిన ప్రాథమిక బహిరంగ చర్చలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మగ్‌షాట్‌తో రికార్డు సృష్టించిన ట్రంప్‌.. ట్విటర్‌లో ఇప్పటికీ తగ్గని హవా..!

అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) రికార్డు సృష్టించారు. ఎన్నికల్లో జోక్యం ఆరోపణల్లో ఆయన నేడు జార్జియాలోని ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. ఆ దేశ చరిత్రలో మగ్‌షాట్‌ తీయించుకొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. ఆయనకు ఖైదీ నంబర్‌  P01135809 కేటాయించారు. ఈ సందర్భంగా పోలీసు రికార్డుల కోసం ఆయన ఫొటో (మగ్‌షాట్‌) కూడా తీశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు

ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఆమెపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ పిటిషన్‌పై జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత కంపెనీలపై మరో రిపోర్ట్‌.. జార్జిసోరోస్‌ మద్దతున్న గ్రూప్‌ రెడీ!

అదానీ గ్రూప్‌ (Adani Group) తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఇచ్చిన నివేదిక భారతీయ స్టాక్‌ మార్కెట్లను కుదిపేసిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఇది చర్చనీయాంశంగా మారింది. తాజాగా హిండెన్‌ బర్గ్‌ తరహా మరో సంస్థ భారత కార్పొరేట్ల ఆర్థిక అవకతవకలపై త్వరలోనే నివేదిక విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. WWE మాజీ ఛాంపియన్‌ బ్రేవ్‌ వయెట్‌ హఠాన్మరణం

ప్రపంచ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) స్టార్‌ బ్రేవ్‌ వయెట్‌ (36) హఠాన్మరణం చెందాడు. అతడు గుండెపోటుతో కన్నుమూసినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ చీఫ్ కంటెంట్ ఆఫీసర్‌ పాల్ ‘ట్రిపుల్ హెచ్’ లెవెస్కీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బ్రేవ్‌ వయెట్‌ (Bray Wyatt) కొంతకాలంగా అనారోగ్యం కారణంతో పోటీలకు దూరంగా ఉంటున్నాడు. WWEతో 2009లో ఒప్పందం చేసుకున్న బ్రేవ్‌ వయెట్‌ గతేడాది వరకు పోటీల్లో పాల్గొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కవితకు ఇస్తే..మహిళలకు 33 శాతం టికెట్లు ఇచ్చినట్లే: బండి సంజయ్‌

భారాస నేతల్లో చాలా మంది భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. సర్వేలన్నీ భారాస ఓడిపోతుందని చెబుతున్నాయని చెప్పారు. భారాస ఎమ్మెల్సీ కవితకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ టికెట్‌ ఇస్తే 33 శాతం మహిళలకు టికెట్‌ ఇచ్చినట్లేనని ఎద్దేవా చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని