Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 23 Apr 2024 16:59 IST

1.పవన్‌ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ.114 కోట్లు.. అప్పులు రూ.64 కోట్లు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు. ఐదేళ్లలో ఆయన సంపాదన రూ.114,76,78,300. ఇందుకు ఆదాయపన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీ కింద రూ.26,84,70,000 చెల్లించినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ప్రతి ఆడబిడ్డను లక్షాధికారిని చేసే బాధ్యత నాది: చంద్రబాబు

ఆడ పిల్లలకు పుట్టినిల్లు తెలుగుదేశం అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు రాగానే మోసగాళ్లు వస్తారు.. రకరకాల మాటలు చెప్తారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి దివంగత నేత ఎన్టీఆర్. కానీ జగన్ మాత్రం ఆయన చెల్లెమ్మకు ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారు అని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. కేజ్రీవాల్‌, కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మళ్లీ పొడిగింపు

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal), భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఇద్దరికీ మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 7న ఈ నేతలిద్దరినీ కోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. జీపీఎస్‌ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?

బాల్టిక్‌ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్‌ జామ్‌ (GPS Jam) సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీని వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని తాజా కథనం పేర్కొంది. దాని పేరు టోబోల్‌ (Tobol). గతంలో నాటో తూర్పు ప్రాంతంలో నౌకల సిగ్నల్స్‌ను అడ్డుకునేందుకు ఈ సాంకేతిక ఆయుధాన్ని రష్యా (Russia) ఉపయోగించినట్లు సమాచారం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. నూడుల్స్‌లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!

 వజ్రాలను అక్రమంగా విదేశాలకు రవాణా చేసేందుకు కొందరు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. రూ.కోట్ల విలువైన డైమండ్స్‌ను నూడుల్స్‌ ప్యాకెట్లలో దాచి అధికారుల కళ్లు గప్పి బ్యాంకాక్‌కు తరలించే ప్రయత్నం చేశారు కొందరు ప్రయాణికులు. వారిని కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నూడుల్స్‌ ప్యాకెట్లలో ఏర్పాటుచేసిన వజ్రాలను ముంబయి ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. కాంగ్రెస్‌ హయాంలో హనుమాన్‌ చాలీసా విన్నా నేరమే: మోదీ

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ (Congress) పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) మరోసారి ధ్వజమెత్తారు. ఆ పార్టీ హయాంలో ప్రజలు తమ విశ్వాసాలను పాటించడానికి కూడా కష్టపడాల్సి వస్తోందన్నారు. రాజస్థాన్‌ (Rajasthan) ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన ‘సంపద పునఃపంపిణీ’ ప్రకటనను మళ్లీ ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. ఇంటర్నెట్‌ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్‌-ఇన్‌-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగా కొత్త కొత్త ఫీచర్లు జోడిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సదుపాయాన్ని తీసుకొచ్చిన ఈ యాప్‌.. మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమవుతోంది. ఇంటర్నెట్‌ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను షేర్‌ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్‌

తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్రనగర్‌లో జరిగిన రోడ్‌ షోలో కేటీఆర్‌ ప్రసంగించారు. భారాసకు 8 నుంచి 10 సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనం చెప్పినట్లే వింటుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండే ఎవరైనా మన వద్దకు రావాలంటే భారాసకు ఎక్కువ సీట్లు కావాలన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులను కోరారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి.. ముఖ్యనేతల నామినేషన్లు

 తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు (ఆర్వో) సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కోలాహలం నెలకొంది. ఏపీలో పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌, గుడివాడ అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్‌ దాఖలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. తెదేపా నేతపై ఎస్‌ఐ అనుచిత వ్యాఖ్యలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్‌ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సాంబశివరావుతోపాటు ప్రపోజర్‌, పర్చూరు మండల తెదేపా అధ్యక్షుడు ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయనపై ఎస్సై అసభ్య పదజాలంతో దూషించారు. ఎస్సై తీరుపై ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని