icon icon icon
icon icon icon

PM Modi: కాంగ్రెస్‌ హయాంలో హనుమాన్‌ చాలీసా విన్నా నేరమే: మోదీ

PM Modi: కాంగ్రెస్‌ పాలనలో హనుమాన్‌ చాలీసా విన్నా దాన్ని నేరంగానే చూస్తున్నారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఇటీవల కర్ణాటకలో చోటుచేసుకున్న ఘటనను గుర్తుచేశారు.

Published : 23 Apr 2024 13:20 IST

జైపుర్‌: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ (Congress) పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) మరోసారి ధ్వజమెత్తారు. ఆ పార్టీ హయాంలో ప్రజలు తమ విశ్వాసాలను పాటించడానికి కూడా కష్టపడాల్సి వస్తోందన్నారు. రాజస్థాన్‌ (Rajasthan) ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన ‘సంపద పునఃపంపిణీ’ ప్రకటనను మళ్లీ ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.

‘‘మూడు రోజుల క్రితం కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలను నేను బయటపెట్టా. సంపదను దోచుకుని కొంతమంది వ్యక్తులకు పంచిపెట్టాలన్న వారి కుట్రలను దేశ ప్రజల ముందుంచా. దీంతో కాంగ్రెస్‌, విపక్ష కూటమి ఆగ్రహానికి గురైంది. అందుకే ఇప్పుడు వారు మోదీపై నిందలు వేయడం మొదలుపెట్టారు. సంపద పునఃపంపిణీ కోసం సర్వే చేస్తామని వారి నేతలే చెప్పారు. ఇప్పుడు ఆ రహస్యాన్ని బయటపెడితే వణుకుతున్నారు’’ అని మోదీ ఎద్దేవా చేశారు.

రెండిళ్లు ఉంటే ఒకటి కాంగ్రెస్‌ లాక్కొంటుంది: మోదీ

కర్ణాటకలో ఓ యువకుడిపై జరిగిన దాడి ఘటనను మోదీ ప్రస్తావించారు. ‘‘కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు తమ విశ్వాసాలను స్వేచ్ఛగా అనుసరించలేకపోతున్నారు. కనీసం హనుమాన్‌ చాలీసా విన్నా అది నేరం అయిపోయింది’’ అని మండిపడ్డారు. గతంలో రాజస్థాన్‌లోనూ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామనవమి ఉత్సవాలపై నిషేధం విధించారని ప్రధాని ఆరోపించారు. ఇటీవల కర్ణాటకలో ఓ దుకాణదారుపై కొందరు మూక దాడికి పాల్పడ్డారు. తన దుకాణంలో హనుమాన్‌ చాలీసా వినడం వల్లే అతడిపై దాడి జరిగిందని కథనాలు వచ్చాయి.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘యువరాజు’ చెప్పినట్టు ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు? ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, అమ్మానాన్నలకు, అక్కచెల్లెళ్లకు ఎంత బంగారం ఉందో విచారణ జరుపుతారని మోదీ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img