Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 16 Jun 2023 20:59 IST

1. దశాబ్ది ఉత్సవాలు ఎందుకంటున్న విపక్షాలకు నా సమాధానమిదే: కేటీఆర్‌

శిల్పకళా వేదికలో జరిగిన తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల్లో ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తొమ్మిదేళ్లలో ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వారందరికీ ఇదే నా సమాధానం. తెలంగాణలో జరుగుతున్నది సమగ్ర, సమతుల్య, సమీకృత, సమానమైన అభివృద్ధి’’ అని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాబోయేది తెదేపా ప్రభుత్వం.. కాబోయే సీఎం చంద్రబాబు: ఆనం రామనారాయణరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయేది తెదేపా ప్రభుత్వమే అని, సీఎం కాబోయేది చంద్రబాబు అని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యువతకు భవిష్యత్తును ఇచ్చేది నారా లోకేశ్‌ అని చెప్పారు. యువగళం పాదయాత్రలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నెల్లూరులోని అనంతసాగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విశాఖపట్నం-విజయవాడ మధ్య పలు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లోని తాడి- అనకాపల్లి స్టేషన్ల మధ్య ఈనెల 14న గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. దీంతో విశాఖపట్నం-విజయవాడ మధ్య తిరిగే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భద్రతా పనుల దృష్ట్యా రైల్వే అధికారులు ఈ మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. పోలీసు కస్టడీకి మరో నిందితుడు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సిట్ అధికారులు మహమ్మద్ ఖాలిద్ అనే నిందితుడిని ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 51కి చేరుకుంది. మహమ్మద్‌ ఖాలిద్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘కాంగ్రెస్‌ ఆ ఊహల్లో ఉండొద్దు’: శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

కర్ణాటక (Karnataka) గెలుపుతో కాంగ్రెస్‌ (Congress) సంతృప్తి చెంది ఉదాసీనంగా వ్యవహరించొద్దని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor) అన్నారు. ఒక రాష్ట్రంలో గెలిస్తే.. దేశమంతా గెలుస్తామనే ఊహల్లో ఉండొద్దని అన్నారు. ఎన్నికలను బట్టి ప్రజలు తమ అభిప్రాయాలను మార్చుకుంటారన్న ఆయన.. 2019 నాటి పరిస్థితులను ఉదాహరణగా చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు గడువు పొడిగింపు.. ఆ తేదీ దాటితే డబ్బులు కట్టాల్సిందే!

ఆధార్‌(Adhaar) వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు జూన్‌ 14తో ముగియడంతో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది.  ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. గతంలో మార్చి 15 నుంచి ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించగా.. ఆ గడువు జూన్‌ 14తో ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రాణనష్టం లేదు.. ఆస్తి నష్టం ఎక్కువే: అతుల్‌ కార్వాల్‌

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను (Cyclone Biparjoy) తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గురువారం అర్ధరాత్రి గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో తీరం దాటిన ఈ తుపాను ప్రభావంతో దాదాపు 800 చెట్లు కూలిపోయినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ అతుల్‌ కార్వాల్ వెల్లడించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 500 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. వీటి సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చిన్నారి మాటలు నమ్మి.. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ను చితక్కొట్టి..

ఫుడ్‌ డెలివరీ బాయ్‌ తనను టెర్రస్‌ మీదికి తీసుకెళ్లాడని ఎనిమిదేళ్ల చిన్నారి చెప్పడంతో బెంగళూరు నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌ వాసులు, అక్కడి గార్డులు కలిసి అతడిని చితక్కొట్టేశారు. దుర్భాషలాడి పోలీసులకు అప్పగించారు. అయితే, అసలు విషయం తెలుసుకొని పశ్చాత్తాపపడ్డారు. ఇంతకీ ఏమైందటే.. ఎలక్ట్రానిక్‌ సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న దంపతులు తమ కుమార్తె కనిపించకపోవడంతో  వెతకడం మొదలుపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. యుద్ధ ట్యాంకులను దెబ్బతీస్తే బోనస్.. సైనికులకు రష్యా ఆఫర్

గత ఏడాది ప్రారంభం నుంచి ఉక్రెయిన్‌(Ukraine), రష్యా(Russia) మధ్య యుద్ధం నడుస్తోంది. రష్యా దాడిని ప్రతిఘటించేందుకు ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు యుద్ధ సామాగ్రిని అందిస్తున్నాయి. అందులో భాగంగా జర్మనీ నుంచి లెపర్డ్‌ ట్యాంకులు, అమెరికా యుద్ధ ట్యాంకులు పంపిస్తున్నాయి. అయితే యుద్ధంలో వాటిని ధ్వంసం చేసిన సైనికులకు రష్యా ఆఫర్ ప్రకటించింది. ఆ బలగాలకు బోనస్ ఇస్తామని రక్షణ శాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చదువు పేరుతో చిన్నారులను నగరానికి తీసుకొచ్చి..!

చదువు నేర్పించి, ఉద్యోగం కూడా ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి, నగరానికి తీసుకొచ్చిన చిన్నారులతో బలవంతంగా పని చేయించుకుంటున్న ఓ వ్యక్తి నిర్వాకం బయటపడింది. బిహార్‌కు (Bihar) చెందిన 22 మంది చిన్నారులను ఓ ఇరుకు గదిలో పెట్టి వారితో దాదాపు రోజుకు దాదాపు 18 గంటలపాటు గాజులు తయారు చేయిస్తున్నట్లు తేలింది. అనారోగ్యంతో పని చేయలేకపోతే.. యజమాని శారీరకంగా హింసించేవాడని బాధితులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని