Shashi Tharoor: ‘కాంగ్రెస్‌ ఆ ఊహల్లో ఉండొద్దు’: శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

కర్ణాటకలో సాధించిన విజయంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలుస్తామనే ఊహల్లో ఉండొద్దని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) వ్యాఖ్యానించారు. ప్రజలు తమ అభిప్రాయాలను మార్చుకుంటారని గుర్తుచేశారు.

Updated : 16 Jun 2023 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక (Karnataka) గెలుపుతో కాంగ్రెస్‌ (Congress) సంతృప్తి చెంది ఉదాసీనంగా వ్యవహరించొద్దని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor) అన్నారు. ఒక రాష్ట్రంలో గెలిస్తే.. దేశమంతా గెలుస్తామనే ఊహల్లో ఉండొద్దని అన్నారు. ఎన్నికలను బట్టి ప్రజలు తమ అభిప్రాయాలను మార్చుకుంటారన్న ఆయన.. 2019 నాటి పరిస్థితులను ఉదాహరణగా చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించడమే గాక.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ, ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (Loksabha Elections) ఆయా రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి? భాజపా (BJP) మనల్ని ఓడించింది. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమవ్వాల్సి వచ్చింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయం ఒకేలా ఉండదు. నెలల వ్యవధిలోనే వారు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు. అందుకే.. ఈసారి కర్ణాటకలో సాధించిన విజయంతో మనం (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) ఆత్మసంతృప్తి చెందొద్దు. అసెంబ్లీ ఎన్నికల్లో మన వ్యూహాలు పనిచేశాయి కదా.. జాతీయ స్థాయిలోనూ పనిచేస్తాయని ఊహించొద్దు’’ అని థరూర్‌ పార్టీకి సూచించారు.

స్థానిక నేతల బలంతోనే కర్ణాటకలో హస్తం పార్టీ భారీ విజయం సాధించగలిగిందని థరూర్‌ (Shashi Tharoor) ఈ సందర్భంగా తెలిపారు. ‘‘కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే.. కర్ణాటకకు చెందినవారు. రాహుల్, ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రానికి వచ్చి విస్తృత ప్రచారం చేశారు. అది విజయానికి దోహదపడింది. అయితే భారీ మెజార్టీ మాత్రం స్థానిక నేతల వల్లే వచ్చింది. స్థానిక సమస్యలపై వారు దృష్టి పెట్టారు. దానిపై బలంగా ప్రచారం చేయగలిగారు. మరోవైపు, భాజపా ప్రచారమంతా జాతీయ స్థాయిలోనే జరిగింది. దీంతో మోదీ, షా వచ్చి కర్ణాటకలో ఉండరు. ప్రభుత్వాన్ని నడిపించరు అని ప్రజలు నమ్మారు. కానీ, లోక్‌సభ ఎన్నికల విషయంలో అలా ఉండదు. ప్రజల అభిప్రాయాలు కేంద్ర స్థాయిలోనే ఉంటాయి’’ అని కాంగ్రెస్‌ ఎంపీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని