Rajasthan: చదువు పేరుతో చిన్నారులను నగరానికి తీసుకొచ్చి..!

తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి, వారి పిల్లలతో పని చేయించుకుంటున్న ఓ వ్యక్తి నిర్వాకం బయటపడింది. రాజస్థాన్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, నయ సవేరా ఎన్జీవో సంఘం సభ్యుల సహకారంతో 22 మంది చిన్నారులు బయటపడ్డారు.

Published : 16 Jun 2023 18:10 IST

జైపుర్‌: చదువు నేర్పించి, ఉద్యోగం కూడా ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి, నగరానికి తీసుకొచ్చిన చిన్నారులతో బలవంతంగా పని చేయించుకుంటున్న ఓ వ్యక్తి నిర్వాకం బయటపడింది. బిహార్‌కు (Bihar) చెందిన 22 మంది చిన్నారులను ఓ ఇరుకు గదిలో పెట్టి వారితో దాదాపు రోజుకు దాదాపు 18 గంటలపాటు గాజులు తయారు చేయిస్తున్నట్లు తేలింది. అనారోగ్యంతో పని చేయలేకపోతే.. యజమాని శారీరకంగా హింసించేవాడని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటన జైపుర్‌లోని (Jaipur) భట్టా బస్తీ ప్రాంతంలో జరిగింది. స్థానికులు అందించిన సమాచారంతో రాజస్థాన్‌ (Rajasthan) ఛైల్డ్ వెల్ఫేర్‌ కమిటీ, నయ సవేరా అనే ఎన్జీవో సంఘం సభ్యులు జూన్‌ 11న ఆ చిన్నారులను రక్షించారు. ఆ యూనిట్‌లో మొత్తం 26 మంది ఉండగా.. అందులో 22 మంది మైనర్లే. వారు కూడా ఏడేళ్ల నుంచి 11 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘గుడ్డు’ అనే వ్యక్తి భట్టా భస్తీ ప్రాంతంలో గాజుల తయారీ యూనిట్‌ను నడుపుతున్నాడు. అందులో పని చేసేందుకు మనుషులు అవసరం కావడంతో.. బిహార్‌కు చెందిన కొందరు పేద తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి వారి పిల్లలను పనికి కుదుర్చుకున్నాడు. వాళ్లకు చదువు చెప్పిస్తానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో కొందరు తమ పిల్లల్ని అతడి వెంట పంపించారు. యూనిట్‌లో కొందరు గత రెండుమూడు నెలలుగా పని చేస్తుండగా.. మరికొందరు 15 రోజుల క్రితం వచ్చినట్లు తెలుస్తోంది. వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు వచ్చారన్న విషయం తెలుసుకొని ‘గుడ్డు’ అక్కడి నుంచి పారిపోయాడు. అతడి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. 

అక్కడి నుంచి బయటపడిన అనంతరం 11 ఏళ్ల బాలుడు తాము అనుభవించిన కష్టాలను మీడియాకు తెలిపాడు. ‘‘ ఏమైనా ఫిర్యాదు చేసినా కొట్టేవాడు. ఆరోగ్యం బాగోలేక పని చేయకపోయినా హింసించేవాడు. నెలలో రెండుసార్లు మాత్రమే మా తల్లిదండ్రులతో మాట్లాడించేవాడు. అది కూడా ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌లో ఉన్నప్పుడే. ఇక్కడ ఏం జరిగినా ఎట్టిపరిస్థితుల్లోనూ తల్లిదండ్రులకు చెప్పొద్దని హెచ్చరించేవాడు. ఒకసారి కడుపులో ఇబ్బందిగా ఉందని మా అమ్మకు చెప్తే.. నన్ను తీవ్రంగా కొట్టాడు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లిదండ్రుల పేదరికమే పిల్లల్ని ఈ స్థితికి తీసుకొస్తోందని నయసవేనా ఎన్జీవో సంస్థకు చెందిన అఖిలేశ్‌ మహేశ్వరి అభిప్రాయడ్డారు. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి, చదువు నేర్పిస్తామని ఆశ కల్పించి, వారికి ఎంతో కొంత ముట్టజెప్పి వారిని పనిలో పెట్టుకుంటున్నారని అన్నారు. ఈ చిన్నారులను బిహార్‌ సాంఘిక సంక్షేమ బోర్డు అధికారులకు అప్పగిస్తామని, అక్కడి నుంచి ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ అధికారుల సమక్షంలో తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని