Bengaluru: చిన్నారి మాటలు నమ్మి.. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ను చితక్కొట్టి..

ఎనిమిదేళ్ల చిన్నారి అబద్ధం చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు, స్థానికులు ఓ ఫుడ్‌డెలివరీ బాయ్‌పై చేయి చేసుకున్నారు. తీరా నిజమేంటో తెలియడంతో పశ్చాత్తాపపడ్డారు.

Published : 16 Jun 2023 17:24 IST

బెంగళూరు: ఫుడ్‌ డెలివరీ బాయ్‌ తనను టెర్రస్‌ మీదికి తీసుకెళ్లాడని ఎనిమిదేళ్ల చిన్నారి చెప్పడంతో బెంగళూరు నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌ వాసులు, అక్కడి గార్డులు కలిసి అతడిని చితక్కొట్టేశారు. దుర్భాషలాడి పోలీసులకు అప్పగించారు. అయితే, అసలు విషయం తెలుసుకొని పశ్చాత్తాపపడ్డారు. ఇంతకీ ఏమైందటే.. ఎలక్ట్రానిక్‌ సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న దంపతులు తమ కుమార్తె కనిపించకపోవడంతో  వెతకడం మొదలుపెట్టారు. దాదాపు అరగంట తర్వాత ఆమె టెర్రస్‌ మీద నుంచి వచ్చింది. ఎక్కడికెళ్లావని ప్రశ్నించగా.. ఫుడ్‌డెలివరీ బాయ్‌ తనను టెర్రస్‌ మీదకి తీసుకెళ్లాడని అబద్ధం చెప్పింది. విషయం తెలియక.. అపార్ట్‌మెంట్‌ గార్డులకు సమాచారమిచ్చిన తల్లిదండ్రులు గేట్లు మూసివేయించారు. ఆ సమయంలో అపార్ట్‌మెంట్‌కి వచ్చిన ఫుడ్‌డెలివరీ బాయ్‌లను వరుసలో నిలబెట్టి..ఎవరు తీసుకెళ్లారో చెప్పమన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆమె ఒక బాయ్‌ను చూపించింది. కోపోద్రిక్తులైన అపార్ట్‌మెంట్‌ వాసులు, గార్డులు అతడిపై దాడి చేశారు. దుర్భాషలాడారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెలివరీ బాయ్‌ని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని, ఆమెను కనీసం చూడలేదని సమాధానమిచ్చాడు. పోలీసులకు అనుమానం వచ్చి అక్కడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. చిన్నారి మాత్రమే టెర్రస్‌ మీదకి వెళ్లినట్లు తేలింది. ఇదే విషయాన్ని పోలీసులు చిన్నారి తల్లిదండ్రులకు చెప్పగా.. తమ మరో కుమార్తెను స్కూల్లో దించేందుకు వెళ్లామని, తిరిగి వచ్చేసరికి చిన్న కూతురు కనిపించకపోవడంతో కంగారుపడ్డామని చెప్పారు. చిన్నారి కూడా తాను అబద్ధం చెప్పినట్లు అంగీకరించడంతో డెలివరీ బాయ్‌ని కొట్టినందుకు అక్కడున్నవారంతా పశ్చాత్తాపపడ్డారు.

‘చిన్నారి తల్లిదండ్రులపై కేసు ఏమైనా ఫైల్‌ చేయాలనుకుంటున్నావా?’ అని డెలివరీ బాయ్‌ను పోలీసులు అడగ్గా.. ‘వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోగలను. వాళ్ల కుమార్తె కనిపించకపోయే సరికి కంగారుపడ్డారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఇక్కడ నేను ఉండను. త్వరలోనే మా సొంతూరు అస్సాం వెళ్లిపోతాను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు