Biparjoy: ప్రాణనష్టం లేదు.. ఆస్తి నష్టం ఎక్కువే: అతుల్‌ కార్వాల్‌

బిపోర్‌జాయ్ (Biparjoy) తుపాను ప్రభావంతో దాదాపు 800 చెట్లు కూలిపోయినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) చీఫ్‌ అతుల్‌ కార్వాల్‌ (Atul Karwal) తెలిపారు. మొత్తం 1000 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. 

Published : 16 Jun 2023 17:29 IST

దిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను (Cyclone Biparjoy) తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గురువారం అర్ధరాత్రి గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో తీరం దాటిన ఈ తుపాను ప్రభావంతో దాదాపు 800 చెట్లు కూలిపోయినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ అతుల్‌ కార్వాల్ వెల్లడించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 500 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. వీటి సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. 1000 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలిపారు. అయితే, ఈ ప్రకృతి విలయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. తుపాను తీరం దాటిన కచ్‌ ప్రాంతంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. తీరాన్ని తాకడానికి ముందే వారు మృతి చెందినట్లు చెప్పారు. అయితే, వివిధ చోట్ల 23 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు.

కచ్‌ జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు అతుల్‌ కార్వాల్‌ తెలిపారు. దాదాపు 40శాతం గ్రామాల్లో స్తంభాలు కూలిపోయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. అయితే, తీరం దాటే సమయానికి తుపాను సామర్థ్యం కాస్త తగ్గడంతో నష్టం కొంతమేర తగ్గిందని అన్నారు. వర్షం ఎక్కువగా కురుస్తున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. తీరం దాటిన బిపోర్‌జాయ్‌ ప్రస్తుతం దక్షిణ రాజస్థాన్‌ మీదుగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశముందన్న హెచ్చరికలతో కొన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అక్కడికి పంపించినట్లు కార్వాల్‌ తెలిపారు. అంతేకాకుండా ముంబయి, కర్ణాటక, రాజస్థాన్‌లోనూ తమ టీమ్‌లను సిద్ధంగా ఉంచామన్నారు.

ప్రస్తుతం బిపోర్‌జాయ్‌ తూర్పు ఈశాన్య దిశగా కదులుతున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను కారణంగా 80-90కి.మీ వేగంతో గాలులు వీస్తున్నట్లు చెప్పింది. అయితే, రాజస్థాన్‌పై తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశమున్నందున బర్మేర్‌ జిల్లాలో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని